గొంతు గరగరను తగ్గించే,రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి కొత్తిమీర సూప్..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

చల్లటి వాతావరణంలో వణుకు పుడుతున్నప్పుడో, వర్షం పడుతున్నప్పుడో లేక గొంతు కాస్త గరగరలాడుతున్నప్పుడో.. వేడివేడిగా ఏదైనా తాగితే ఎంత హాయిగా ఉంటుందో. అటువంటి సమయాల్లో మనసుకు, శరీరానికి ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చే అద్భుతమైన రెసిపీ వెల్లల్లి కొత్తిమీర సూప్. ఇది హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక వంటకం. కేవలం ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది.

సాధారణంగా మనం వంటల్లో కొత్తిమీర ఆకులను మాత్రమే వాడి, లేత కాడలను పారేస్తుంటాం. కానీ ఆ కాడల్లోనే అసలైన రుచి, సువాసన, పోషకాలు దాగి ఉంటాయి. ఘాటైన వెల్లుల్లి వాసన, కొత్తిమీర తాజాదనం, మిరియాల కమ్మదనం కలగలిపి ఈ సూప్ కి అద్భుతమైన రుచిని ఇస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. వెల్లుల్లి కొత్తిమీర సూప్ మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Garlic Coriander Soup Recipe Make this Healthy and Comforting Soup in Just 5 Minutes

కావాల్సిన పదార్థాలు

నూనె - 1 టేబుల్ స్పూన్
అల్లం - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 1
వెల్లుల్లి - 8-10 రెబ్బలు
ఉల్లిపాయ ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర కాడలు - అర కప్పు
నీళ్లు - రెండున్నర కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - అర టీస్పూన్
కొత్తిమీర ఆకులు - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 1 టీస్పూన్

రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మందపాటి గిన్నె లేదా పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేయండి. పచ్చివాసన పోయి చక్కటి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి.

-ఇప్పుడు మీకు ఇష్టమైతే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి కొద్దిసేపు మగ్గనివ్వండి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడలను వేసి మరో నిమిషం పాటు వేయించాలి. ఇలా నూనెలో వేయించడం వల్ల కాడల్లోని ఫ్లేవర్ మొత్తం బయటకు వస్తుంది.

-ఇప్పుడు పాన్ లో రెండున్నర కప్పుల నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. మంటను కాస్త పెంచి నీళ్లను బాగా మరగనివ్వండి.

-నీళ్లు మరుగుతున్నప్పుడు మంటను సిమ్ లో ఉంచి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి, కొత్తిమీర, అల్లం రుచులన్నీ నీళ్లలోకి చేరి సూప్ ఎంతో రుచికరంగా మారుతుంది.

-సూప్ బాగా మరిగిన తర్వాత అర టీస్పూన్ మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు వేసి ఒకసారి కలుపుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసి, అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం పిండుకోవాలి.

-అంతే ఎంతో గుమగుమలాడే, ఆరోగ్యకరమైన వెల్లుల్లి కొత్తిమీర సూప్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, October 25, 2026, 20:04 [IST]
Desktop Bottom Promotion