ఓట్స్ అంటే ఇష్టం లేదా? ఇలా గంజిలా చేసి చూడండి..బరువు తగ్గడంతో పాటు రుచీ మీ సొంతం!

Posted By:

బరువు తగ్గాలని నిర్ణయించుకోగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే ఆహారం ఓట్స్. బరువు తగ్గించే డైట్ చేసేవారి రోజువారీ మెనూలో ఓట్స్ తప్పనిసరిగా ఉంటాయి. కానీ నిజం చెప్పాలంటే ఓట్స్ తినడం చాలా మందికి పెద్ద శిక్షలా అనిపిస్తుంది. ఎలాంటి రుచీ పచీ లేని ఆ ఓట్స్‌ ను చాలామంది కేవలం డైట్ కోసం ముక్కు మూసుకుని, అయిష్టంగానే తింటుంటారు. అయితే ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే రుచిని త్యాగం చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు.

Hate the Taste of Oats Try This Delicious Oats Ganji for Quick Weight Loss

ఓట్స్‌ ను కూడా ఎంతో రుచికరంగా వండుకుని తినొచ్చు. ఉదయాన్నే అల్పాహారంగా ఓట్స్‌ ను వేడి వేడి గంజి రూపంలో తయారు చేసుకుని తాగితే, బరువు తగ్గడం మాత్రమే కాదు, ఇందులో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలిగి రోజంతా ఉల్లాసంగా ఉంటారు. ఈ స్పెషల్ ఓట్స్ గంజి కేవలం బరువు తగ్గాలనుకునే వారికే కాదు, మధుమేహం ఉన్నవారికి కూడా ఒక అద్భుతమైన వరం లాంటిది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

ఓట్స్ గంజి తయారీకి కావలసిన పదార్థాలు

నూనె - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
పచ్చిమిర్చి - 1
ఉల్లిపాయ - 1
టమాటో - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
ఉప్పు - మీ రుచికి తగినంత
ఓట్స్ - 1 కప్పు
నీరు - 5 కప్పులు
కొత్తిమీర - కొద్దిగా
పుదీనా - కొద్దిగా
మిరియాల పొడి -అర టీస్పూన్
కాచిన పాలు - పావు కప్పు

Hate the Taste of Oats Try This Delicious Oats Ganji for Quick Weight Loss

ఓట్స్ గంజి తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె లేదా పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి, చిటపటలాడే వరకు వేయించి తాలింపు పెట్టుకోండి.

-ఇప్పుడు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించండి. ఆ తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి మెత్తబడే వరకు మగ్గనివ్వండి.

-కూరగాయల ముక్కలు మగ్గిన తర్వాత ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు సన్నని మంట మీద వేయించండి. ఇది గంజికి మంచి ఫ్లేవర్‌ ను ఇస్తుంది. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పును జత చేసి బాగా కలపండి.

-ఇప్పుడు ఒక కప్పు ఓట్స్ తీసుకుని ఆ మిశ్రమంలో వేసి సుమారు 2 నిమిషాల పాటు కమ్మటి సువాసన వచ్చేలా బాగా వేయించండి.
ఇప్పుడు అందులో ఐదు కప్పుల నీళ్లు పోసి గరిటెతో బాగా కలపండి. మంటను మీడియంలో ఉంచి సుమారు 10 నిమిషాల పాటు ఓట్స్‌ ను మెత్తగా ఉడకనివ్వండి.

-ఓట్స్ మెత్తగా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి కలపండి. అలాగే మిరియాల పొడి చల్లి, ఒక్క ఉడుకు రానివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.

-చివరగా ముందుగా కాచి పెట్టుకున్న పావు కప్పు పాలను ఉడికిన ఓట్స్ మిశ్రమంలో పోసి బాగా కలపండి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వేడి వేడి ఓట్స్ గంజి రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, May 4, 2026, 12:48 [IST]
Desktop Bottom Promotion