ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా..

Posted By:

తెలుగు వారి ఇళ్లలో టిఫిన్స్ ఎంత ముఖ్యమో, వాటిలోకి నంజుకోవడానికి ఉండే చట్నీలు, పొడులు కూడా అంతే ముఖ్యం. ఉదయం హడావిడిలో ప్రతిరోజూ పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ చేయడం సాధ్యం కాకపోవచ్చు. అటువంటి సమయంలో ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు లాంటి టిఫిన్స్ లోకి అద్భుతమైన రుచిని ఇచ్చే సాంప్రదాయ వంటకమే నల్ల కారం పొడి. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నల్ల కారం పొడి, కొద్దిగా నెయ్యి వేసుకుని మొదటి ముద్దగా తింటే జీర్ణవ్యవస్థ చాలా చురుగ్గా పనిచేస్తుంది. జ్వరం వచ్చి నోరు చేదుగా ఉన్నప్పుడు ఇలా తింటే రుచి తెలుస్తుంది.

నల్ల కారం పొడి కేవలం నాలుకకు రుచిని అందించే వంటకం మాత్రమే కాదు, మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను, ఔషధ గుణాలను అందించే సంజీవని లాంటిది. ఇందులో వాడిన ప్రతి పదార్థం మన శరీరానికి ఏదో ఒక రకంగా ఔషధంలా పనిచేస్తుంది. ఒక్కసారి చేసుకుంటే నెలరోజుల పైనే నిల్వ ఉంటుంది. పల్లెటూరి స్టైల్ లో, సంప్రదాయ రుచితో, అదే టెక్స్చర్, అదే టేస్ట్ తో నల్ల కారం పొడి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Healthy Easy Traditional Village Style Nalla Karam Podi Recipe for Idli Dosa and Rice

నల్ల కారం పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు

-ఎండుమిర్చి
-వెల్లుల్లి
-ధనియాలు
-జీలకర్ర
-కరివేపాకు
-చింతపండు
-ఉప్పు
-నూనె
-ఇంగువ
-మినపప్పు
-పచ్చి శెనగపప్పు

ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు!

నల్ల కారం పొడి తయారీ విధానం

-ముందుగా స్టవ్ ఆనే చేసి పాన్ పెట్టుకోండి. అందులో 1 లేదా 2 టీస్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక అందులో 50 గ్రాముల ఎండుమిర్చి వేసి తక్కువ మంట మీద కలుపుతూ రంగు మారే వేయించాలి. ఎండుమిర్చి లోపలి దాకా వేగి డార్క్ షేడ్ లోకి రావాలి. వేగిన తర్వాత ఎండుమిర్చిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్ లోనే 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించాలి. అవి కొంచెం లైట్ గా వేగిన తర్వాత అందులో అర టేబుల్ స్పూన్ జీలకర్ర,3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి ఆ వేడి సెగకి కాస్త ఫ్రై చేయండి. తర్వాత అందులో 20-30 గ్రాముల చింతపండు, 5 రెమ్మల కరివేపాకు వేసి అది లైట్ గా క్రిస్పీగా అయ్యేదాకా వేయించి స్టవ్ ఆపేసి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.

-చల్లారిన తర్వాత మిశ్రమం మొత్తాన్ని మిక్సీ జార్ లో వేసి, ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ ఇంగువ వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే వేయించిన ఎండుమిర్చి వేసి పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న కారాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోండి.

-ఇప్పుడు మిక్సీ గిన్నెలో 30 గ్రాముల పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని రెడీ చేసుకున్న కారంలో కలుపుకోండి.

-అంతే నల్ల కారం పొడి రెడీ. పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, October 7, 2026, 9:39 [IST]
Desktop Bottom Promotion