పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

భారతీయుల పండుగలు, శుభకార్యాలు, వేడుకలు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మిఠాయిలే. మన భోజనం ఎంత రుచిగా ఉన్నా, చివర్లో కాస్త స్వీట్ పడకపోతే ఆ తృప్తి ఎప్పటికీ అసంపూర్ణమే. లడ్డూ అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది తిరుపతి లడ్డూ లేదా బూందీ లడ్డూ, బేసన్ లడ్డూ, మోతీచూర్ లడ్డూ.

అయితే అవన్నీ మైదా, శెనగపిండి, పంచదార, నూనె లేదా డాల్డాతో చేసేవి కాబట్టి రుచికి బాగున్నా.. తరచుగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో స్వీట్స్ తినాలంటేనే చాలామంది భయపడుతున్నారు. తీపి తినాలనే కోరికను బలవంతంగా చంపుకుంటున్నారు.

మరి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ అందించే స్వీట్ జొన్న పిండి లడ్డూ. మన తాత ముత్తాతల కాలంలో జొన్నలు, సజ్జలు, రాగులు వంటి సిరిధాన్యాలే ప్రధాన ఆహారం. అందుకే వాళ్లు అంత దృఢంగా ఉండేవారు. జొన్నలతో చేసిన ఈ లడ్డూలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా, బూందీ లడ్డూను మించేలా అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. ఈ జొన్న లడ్డూలకు ఎలాంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ కమ్మని జొన్న లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

జొన్న లడ్డూకి కావాల్సిన పదార్థాలు

జొన్న పిండి - 1 కప్పు
బెల్లం తురుము - 1 కప్పు
స్వచ్ఛమైన నెయ్యి - పావు కప్పు
జీడిపప్పులు - గుప్పెడు
బాదం పప్పులు - 20
పల్లీలు (వేరుశెనగ గుళ్లు) - 2 టేబుల్ స్పూన్లు
ఎండుకొబ్బరి ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
యాలకులు - 4:

జొన్న లడ్డూ తయారీ విధానం

-ముందుగా స్టవ్ ఆన్ చేసి, మందంగా ఉండే ఒక పాన్ (కడాయి) పెట్టుకోవాలి. అందులో కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి.

-నెయ్యి కాస్త వేడెక్కగానే అందులో జీడిపప్పులు, బాదం పప్పులు, పల్లీలు, ఎండుకొబ్బరి ముక్కలు వేయాలి. మంటను పూర్తిగా సిమ్ లో ఉంచి, గరిటెతో నిరంతరం కలుపుతూ దోరగా వేయించాలి. డ్రై ఫ్రూట్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి, వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి.

-ఇప్పుడు అదే పాన్ లో ఉన్న మిగిలిన నెయ్యిలో ఒక కప్పు జొన్న పిండిని వేయాలి. మంటను ఏమాత్రం పెంచకుండా సిమ్ లోనే ఉంచి, పిండిని నెయ్యిలో బాగా కలిసేలా గరిటెతో కలుపుతూ ఫ్రై చేయాలి. పిండి రంగు కూడా లైట్ గా మారుతుంది. ఈ ప్రాసెస్ కు సుమారు 8 నుంచి 10 నిమిషాల సమయం పట్టొచ్చు. ఇలా వేగిన పిండిని వెంటనే ఒక వెడల్పాటి ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

-ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం, పల్లీలు, కొబ్బరి) చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసుకోవాలి. వీటిని మరీ మెత్తటి పౌడర్ లా కాకుండా, కాస్త బరకగా (రవ్వలా) ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద ప్లేట్ లోకి తీసుకోవాలి.

-ఇప్పుడు అదే మిక్సీ జార్ లో మనం ముందుగా వేయించి చల్లార్చుకున్న జొన్న పిండి, ఒక కప్పు తురిమిన బెల్లం, అలాగే నాలుగు యాలకులు వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

-గ్రైండ్ చేసుకున్న జొన్నపిండి-బెల్లం మిశ్రమాన్ని డ్రై ఫ్రూట్స్ పొడి ఉన్న ప్లేట్ లోకి వేసుకోవాలి. ఇప్పుడు చేతులతో ఈ రెండు మిశ్రమాలు బాగా కలిసేలా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా వేడి నెయ్యిని ఈ మిశ్రమంలో కలుపుకుంటూ మీకు కావాల్సిన సైజులో గుండ్రంగా లడ్డూలు చుట్టుకోవాలి.

-అంతే ఎంతో కమ్మనైన, ఆరోగ్యకరమైన జొన్న పిండి లడ్డూలు రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో (Airtight Container) భద్రపరుచుకుంటే 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి.

[ of 5 - Users]
Desktop Bottom Promotion