ఎనకటి తరం హెల్తీ బ్రేక్ ఫాస్ట్..పోషకాలు నిండిన రాగి మునగాకు రొట్టె..చేయడం చాలా ఈజీ

Posted By:

ఈ మధ్య కాలంలో చాలామంది ఇడ్లీ, దోశలు పక్కన పెట్టి మిల్లెట్ బ్రేక్ ఫాస్ట్ వైపు చూస్తున్నారు. రాగులు, కొర్రలు, సజ్జలు వంటి మిల్లెట్స్ తో చేసే వంటకాలను తినేందుకు మొగ్గుచూపుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మన పూర్వీకులు తిన్న అంటే ఎనకటి తరం వంటకాలు చేసుకుంటున్నారు. అలాంటి ఎనకటి తరం వంటకాల్లో ఒకటి రాగి మునగాకు రొట్టె. పోషకాలు నిండిన ఈ బ్రేక్ ఫాస్ట్ ని చాలా ఈజీగా, తక్కువ సమయంలో అప్పటికప్పుడు తయారుచేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కి కూడా ఇది బెస్ట్ గా ఉంటుంది.

దీనిని పిల్లల లంచ్ బాక్సులకు, సాయంత్రం స్నాక్ గా లేదా డిన్నర్ లోకి ఎలా తిన్నా ఆ రోజుకి అందాల్సిన పోషకాల మోతాదు అందరికీ అందుతుంది. ఒకరకంగా చెప్పాలంటే..ఇది తెలంగాణవాళ్లకు రాగి మునగాకు సర్వ పిండి, ఆంధ్రోళ్లకు రాగి మునగాకు తపాలా చెక్క లాంటిది. చలికాలంలో అయితే రాగి మునగాకు రొట్టెలు రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయి. దీనిని తరచుగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. రాగి మునగాకు రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

Healthy Millet Breakfast Ragi Munagaku Rotte Recipe in Telugu An Ancient Superfood for Weight Loss

తయారీకి కావాల్సిన పదార్థాలు

-రాగిపిండి
-మునగాకు
-ఉప్పు
-వెల్లుల్లి రెబ్బలు
-పచ్చి కొబ్బరి తురుము
-ఎండు మిరపకాయలు
-ఉల్లిపాయ తరుగు
-వేడి నీళ్లు
-నూనె

వందల రోగాలను నయం చేసే మునగాకుతో టేస్టీ పూరీ..ఎలా చేసుకోవాలంటే..

తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో 2 కప్పుల రాగి పిండి తీసుకోండి. ఇందులోనే 1 ఉల్లిపాయ సన్నని తరుగు, లేత మునగాకు, రుచికి తగినంత ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బల సన్నని తరుగు, పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము, 4 ఎండుమిరపకాయ ముక్కలు వేయండి. ఇందులోనే 400-450 ml వరకు వేడి నీళ్లు పోసి చెంచాతో లేదా విస్కర్ తో మొత్తం బాగా కలిసేలా కలపండి. వేడి నీళ్లు వాడటం వల్ల పిండిలోని పచ్చివాసన పోతుంది, పిండి కూడా కాస్త మగ్గుతుంది.

-పిండిని ఒక దగ్గరకు చేర్చిన తర్వాత చేత్తో ఆకుని, ఉల్లి,వెల్లుల్లిని నలుపుతూ బాగా కలపండి. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ పిండిలోకి దిగుతాయి, రొట్టె త్వరగా కాలుతుంది. కలిపిన పిండి చిక్కగా, గట్టిగా ఉండాలని గర్తుంచుకోండి. కలుపుకున్న పిండి మీద మూతపెట్టి 30 నిమిషాల పాటు నాననివ్వండి.

-30 నిమిషాల తర్వాత ఒక కుండ లేదా మూకుడుని బోర్లించి దాని మీద తడి గుడ్డ వేయండి. బత్తాయి సైజ్ అంత కలుపుకున్న పిండి ముద్దను గుడ్డపై పెట్టి తడి చేత్తో పావు ఇంచు కంటే తక్కువ మందంగా ఒత్తుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి వేడి అయ్యాక ఒత్తుకున్నదాన్ని గుడ్డతో సహా పెనం మీదకు వేయండి. తర్వాత గుడ్డ తీసేయండి. ఈ రొట్టెను 2 నిమిషాలు మీడియం మంట మీద కాలనివ్వండి. తర్వాత అంచుల వెంట అర టీస్పూన్ వేరుశెనగ నూనె లేదా నువ్వుల నూనె అంచుల వెంట,ఇంకో అర టీస్పూన్ రొట్టె మీద వేసి కాల్చండి.

-ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పి నిదానంగా కాల్చుకోండి. అంతే రాగి రొట్టె రెడీ.

[ of 5 - Users]
Desktop Bottom Promotion