పరాటాలు ఎన్ని గంటలు అయినా గట్టిపడకుండా, దూదిలా ఉండాలా?..ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు..

Posted By:

వేడివేడిగా, పొరలు పొరలుగా, కమ్మటి వాసనతో నోరూరించే పరాటాలను ఇష్టపడని వారు ఎవరుంటారు? అయితే చాలామందికి ఎదురయ్యే ఒక అతిపెద్ద సమస్య... లంచ్ బాక్స్, రోడ్ ట్రిప్స్ లేదా ఆఫీస్ ప్రయాణాలకు పరాటాలను ప్యాక్ చేసినప్పుడు అవి కాసేపటికే చల్లబడిపోయి గట్టిగా, రబ్బరులా మారిపోవడం. నోట్లో వేసుకుంటే కరిగిపోయే పరాటాలు కాస్తా, నమలడానికి కష్టంగా తయారవుతాయి. ఇది భోజనం మీద ఆసక్తిని తగ్గించేస్తుంది.

How to Keep Parathas Soft All Day Say Goodbye to Hard Parathas with This Simple Kitchen Hack

కానీ, పరాటాలు సాయంత్రం వరకు పెనం మీద నుంచి అప్పుడే తీసినంత తాజాగా, మెత్తగా ఉండాలంటే కొన్ని సులభమైన కిటుకులు ఉన్నాయి. పిండి కలిపే విధానం, కాల్చే పద్ధతులలో చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు. ఈ చిన్నపాటి చిట్కాలను పాటిస్తే, మీ లంచ్ బాక్స్‌ లో పరాటాలు ఎప్పుడూ ఫ్రెష్‌ గా, అంతే రుచిగా ఉంటాయి. ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ చూడండి.

గోరువెచ్చని నీరే మొదటి రహస్యం
పిండిని కలపడానికి చల్లటి నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని వాడండి. ఇలా చేయడం వల్ల పిండి చాలా మృదువుగా మారుతుంది. దీనివల్ల పరాటాలు గంటల గడిచినా గట్టిపడకుండా ఉంటాయి.

నెయ్యి లేదా నూనెను జతచేయండి
పిండి కలుపుతున్నప్పుడు ఒకటి లేదా రెండు టీస్పూన్ల నెయ్యి లేదా నూనె వేయండి. ఇది పిండికి కావాల్సిన తేమను, సాగే గుణాన్ని ఇచ్చి, పరాటాలు త్వరగా పొడిబారిపోకుండా కాపాడుతుంది.

పాలు లేదా పెరుగుతో అద్భుతం
ఆఫీస్ లేదా స్కూల్ లంచ్ బాక్స్ కోసం పరాటాలు చేస్తున్నారా? అయితే పిండిలో నీటితో పాటు కాస్త పాలు లేదా ఒకటి, రెండు చెంచాల పెరుగు కలపండి. ఇది పరాటాలలో తేమను లాక్ చేసి ఎక్కువసేపు సాఫ్ట్ గా ఉంచుతుంది.

పిండి మరీ గట్టిగా వద్దు
పూరీల పిండిలా గట్టిగా కాకుండా, చపాతీ పిండి కంటే కొంచెం మృదువుగా, సులభంగా వంగేలా పిండిని కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే పరాటాలు కూడా గట్టిగానే వస్తాయి.

పిండికి కాస్త విశ్రాంతి ఇవ్వండి
హడావిడిగా పిండి కలిపేసి వెంటనే పరాటాలు రుద్దేయకండి. పిండి ముద్దను కనీసం 15-20 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన ఉంచండి. ఇలా చేయడం వల్ల పిండిలోని గ్లూటెన్ వృద్ధి చెంది పరాటాలకు అద్భుతమైన మృదుత్వం వస్తుంది.

మంట విషయంలో జాగ్రత్త
పరాటాలను ఎప్పుడూ మీడియం మంటపైనే కాల్చాలి. పెద్ద మంట పెడితే పైకి రంగు వస్తుంది కానీ లోపల సరిగ్గా ఉడకదు. పెనంపై పరాటాలను మరీ ఎక్కువసేపు ఉంచకండి, దీనివల్ల అందులోని తేమ ఆవిరైపోయి పొడిగా మారుతాయి. రెండు వైపులా చక్కటి బంగారు రంగు రాగానే దించేయాలి.

సరైన పద్ధతిలో భద్రపరచండి
పరాటాలు కాల్చిన వెంటనే గాలి తగలకుండా ఒక శుభ్రమైన కాటన్ వస్త్రంలో లేదా ఫాయిల్ పేపర్‌ లో చుట్టి హాట్ బాక్స్‌లో ఉంచండి. ఒకదానిపై ఒకటి పేర్చేటప్పుడు మధ్యలో కాస్త నెయ్యి రాస్తే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి.

[ of 5 - Users]
Story first published: Wednesday, June 10, 2026, 14:00 [IST]
Desktop Bottom Promotion