కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

Posted By:

భోజనం ప్లేట్ లో పదుల సంఖ్యలో వెరైటీ కూరలు ఉన్నా సరే మన తెలుగువాళ్లు పచ్చడి ఎక్కడ ఉందా అని వెతుక్కుంటారు. ఎంత రుచికరమైన కూరలు వడ్డించినా కాస్త స్పైసీ పచ్చడితో ఒక్క ముద్ద తింటేనే తృప్తిగా అనిపిస్తుంటది చాలామంది. అలాగే టిఫిన్స్ లోకి కూడా చాలామంది రెగ్యులర్ చట్నీలకు బదులుగా ఏం చట్నీ బాగుంటది అని వెతుకుతుంటారు.

అదిరిపోయే రుచితో ఉండి, నోటికి భలేగా అనిపించే ఇన్‌ స్టంట్ ఎండుమిర్చి చట్నీ ఓ సారి ట్రై చేసి చూడండి. ఇది కేవలం ఇడ్లీ, దోశ, అన్నంలోకే కాదు.. పరాఠా, శాండ్‌ విచ్, ఇతర స్నాక్స్‌ తో కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడో, లేదా నోటికి ఏదైనా ఘాటుగా తినాలనిపించినప్పుడో ఈ చట్నీని చాలా తేలికగా, చిటికెలో తయారు చేసుకోవచ్చు.

Instant Red Chilli Chutney Recipe in Telugu The Perfect Spicy Side Dish for Idli Dosa Rice

ఎండుమిర్చి చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు

వంట నూనె - పావు కప్పు
ఉల్లిపాయలు - 2
ఎండుమిర్చి - 200 గ్రాములు
చింతపండు - 2 చిన్న ముక్కలు
కరివేపాకు - రెండు రెమ్మలు
వెల్లుల్లి రెబ్బలు - 8 నుండి 10
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - మీ రుచికి సరిపడా
తాలింపు కోసం
వంట నూనె - 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
ఎండుమిర్చి - 3 లేదా 4
కరివేపాకు - కొద్దిగా

చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది!

ఎండుమిర్చి చట్నీ తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి లేదా పాన్ పెట్టుకోవాలి. అందులో పావు కప్పు నూనె వేసి వేడి చేయండి. నూనె కొద్దిగా వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి లేత రంగులోకి మారేంతవరకు వేయించుకోవాలి.

-ఇప్పుడు అందులో గింజలు తీసి పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కలు, చింతపండు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ నూనెలో బాగా వేగేలా 5 నుండి 7 నిమిషాల పాటు వేయించాలి.

-ఎండుమిర్చి కాస్త మెత్తబడి, వెల్లుల్లి, జీలకర్ర సువాసన వచ్చే వరకు వేయించుకుంటే చట్నీకి అద్భుతమైన రుచి వస్తుంది.

-ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమానికి మీ రుచికి సరిపడా ఉప్పును వేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిశ్రమాన్ని అందులో వేసి మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి.

-తాలింపు కోసం ఇప్పుడు వేరొక చిన్న కడాయిని స్టవ్ మీద పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించి, ఆ ఘుమఘుమలాడే వేడి వేడి తాలింపును మనం సిద్ధం చేసుకున్న చట్నీపై పోసి కలుపుకోవాలి.

-అంతే ఘాటైన, ఎంతో రుచికరమైన ఎండుమిర్చి చట్నీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, September 28, 2026, 10:44 [IST]
Desktop Bottom Promotion