ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే సైడ్ డిష్..వారం రోజుల పాటు చెడిపోని టమాటా వెల్లుల్లి తొక్కు

Posted By:

ప్రతిరోజూ ఉదయాన్నే ఇడ్లీ, దోశలు వేయగానే..వాటిలోకి సైడ్ డిష్‌ గా ఏ చట్నీ చెయ్యాలో తెలియక సతమతమవుతున్నారా? రోజూ తినే కొబ్బరి పచ్చడి, పల్లీ చట్నీ తిని బోర్ కొట్టిందా? మీరు ఒకసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉండి, పని సులభం చేసే రుచికరమైన వంటకం కోసం చూస్తున్నారా? అయితే టమాటా వెల్లుల్లి తొక్కు ట్రై చేయండి.

ఈ పచ్చడి కేవలం ఇడ్లీ, దోశలకే కాదు, వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది. ఇందులో వెల్లుల్లి ఎక్కువగా వాడటం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నోరూరించే టమాటా వెల్లుల్లి తొక్కు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
టమోటాలు - 4
చింతపండు - చిన్న ఉసిరికాయ సైజులో
వెల్లుల్లి రెబ్బలు - 1 గుప్పెడు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 3/4 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 10
కరివేపాకు - 1 రెమ్మ
నీరు - అర కప్పు
సాధారణ కారం - 1 టీస్పూన్
కశ్మీరీ కారం - 1 టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - గార్నిష్ కోసం కొద్దిగా

తయారీ విధానం

-ముందుగా టమాటాలను ముక్కలుగా కోసి అందులో చింతపండు వేసి మిక్సీ జార్‌ లో మెత్తగా పేస్ట్‌ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.

-తర్వాత అదే జార్‌ లో ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసి నీరు పోయకుండానే కచ్చాపచ్చాగా లేదా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు మరో 10 వెల్లుల్లి రెబ్బలు, తాజా కరివేపాకు వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి.

-ఇప్పుడు తాలింపులో ముందుగా రుబ్బి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చే వరకు సన్నని మంటపై వేయించాలి.

-వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత రుబ్బి ఉంచుకున్న టమాటా చింతపండు పేస్ట్‌ ను పాన్‌ లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో అర కప్పు నీరు పోసి కలపాలి.

-ఇప్పుడు ఈ మిశ్రమంలో కారం, కశ్మీరీ కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. పాన్‌ పై మూత పెట్టి, మీడియం మంట మీద సుమారు 5 నుండి 8 నిమిషాల పాటు ఉడికించాలి.

-మిశ్రమం నుండి నూనె పైకి తేలుతున్నప్పుడు మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.

-అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన టమాటా వెల్లుల్లి తొక్కు రెడీ. దీనిని గాలి చొరబడని సీసాలో భద్రపరుచుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, January 27, 2026, 7:14 [IST]
Desktop Bottom Promotion