బెస్ట్ బ్రేక్‌ ఫాస్ట్.. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పరోటా ఇంట్లోనే చేసుకోండిలా..

Posted By:

చలికాలం వచ్చిందంటే చాలు.. పొగలు గక్కే వేడివేడి పరాటాలు తినాలనిపించడం సహజం. ఈ చల్లని వాతావరణంలో బంగాళదుంప, ముల్లంగి, ఉల్లిపాయ, క్యాబేజీ, పనీర్ వంటి రకరకాల పరాటాలను మనమంతా ఇష్టంగా లాగించేస్తుంటాం. అయితే మీరెప్పుడైనా పెసరపప్పు పరోటా రుచి చూశారా? కేవలం రుచిలోనే కాదు.. ఆరోగ్యపరంగా కూడా ఇది సూపర్.

ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ పరోటా తింటే చాలాసేపటి వరకు కడుపు నిండిన భావన కలుగుతుంది, ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి, డైట్ చేసేవారికి ఇది అద్భుతమైన బ్రేక్‌ ఫాస్ట్ ఆప్షన్. ఆరోగ్యకరమైన పెసరపప్పు పరాటాను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Moong Dal Paratha Recipe in Telugu Easy Healthy Protein Rich Breakfast

కావాల్సిన పదార్థాలు

పిండి కోసం:

గోధుమ పిండి - 2 కప్పులు
వాము - అర టీస్పూన్
నూనె లేదా నెయ్యి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత

స్టఫింగ్ కోసం:
పసుపు పెసరపప్పు - అర కప్పు (3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి)
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
పసుపు - అర టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
కారం, ఉప్పు - రుచికి తగినంత
ఆమ్చూర్ పొడి లేదా చాట్ మసాలా - 1 టీస్పూన్
కొత్తిమీర - తగినంత
వేయించడానికి - నూనె లేదా నెయ్యి

శరీరంలో చెత్త మొత్తాన్ని తొలగించి, లివర్ ని శుభ్రపర్చే టీ ..చాలా ఈజీగా చేసుకోండిలా..

తయారీ విధానం

-ముందుగా నానబెట్టిన పెసరపప్పులోని నీటిని పూర్తిగా వడకట్టండి. ఆ పప్పును మిక్సీ జార్‌ లో వేసి మరీ మెత్తని పేస్ట్‌ లా కాకుండా కాస్త బరకగా రుబ్బి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, ఒక స్పూన్ నూనె వేడి చేయండి. అందులో జీలకర్ర, చిటికెడు ఇంగువ వేయండి. జీలకర్ర చిటపటలాడాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి పచ్చివాసన పోయేలా వేయించండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి లేత బంగారు రంగులోకి మారేంత వరకు వేయించాలి.

-ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న పెసరపప్పును పాన్‌ లో వేయండి. దానికి పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, సరిపడా ఉప్పు జతచేసి బాగా కలపండి. తక్కువ మంటపై ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు పప్పు పచ్చిదనం పోయేలా వేయించండి. చివరగా ఆమ్చూర్ పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

-ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, చేతితో నలిపిన వాము, కొద్దిగా నూనె వేసి కలపండి. తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మృదువుగా, చపాతీ ముద్దలా కలుపుకుని మూతపెట్టి 10-15 నిమిషాల పాటు పక్కన ఉంచండి.

-కలుపుకున్న పిండిని సమాన పరిమాణంలో ఉండలుగా చేసుకోండి. ఒక ఉండను తీసుకుని కొద్దిగా పూరీ సైజులో ఒత్తి, అందులో ముందుగా సిద్ధం చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ ఉంచండి. అంచులన్నీ మూసివేసి, పొడి పిండి చల్లుతూ నెమ్మదిగా పరోటాలా ఒత్తుకోండి.

-స్టవ్ పై పెనం వేడి చేసి, ఒత్తుకున్న పరోటాను వేయండి. రెండు వైపులా నెయ్యి లేదా నూనె రాస్తూ.. పరోటా మంచి బంగారు వర్ణంలోకి వచ్చి, కరకరలాడే వరకు మీడియం మంటపై కాల్చుకోండి.

-అంతే పెసరపప్పు పరోటా రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, November 9, 2026, 23:03 [IST]
Desktop Bottom Promotion