వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు!

Posted By:

ఇంట్లో పిల్లలకు కూరగాయలు తినిపించడం అంటే తల్లిదండ్రులకు పెద్ద యుద్ధం చేసినట్లే అనిపిస్తుంది. ప్లేట్‌ లో ఎన్ని రకాల కూరలు వడ్డించినా, వాళ్లు మాత్రం కూరగాయల ముక్కలను ఏరి పక్కన పెడుతుంటారు.

కానీ ఎదిగే పిల్లలకు కూరగాయల్లోని పోషకాలు చాలా అవసరం. మరి వాళ్లు ఇష్టపడి తినాలంటే ఏం చేయాలి? దానికి సమాధానమే ఈ అద్భుతమైన వెజిటబుల్ కుర్మా. ఇది ఎంత రుచిగా ఉంటుందంటే.. పిల్లలే కాదు, పెద్దలు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. రెస్టారెంట్ స్టైల్ రుచితో ఇంట్లోనే వెజ్ కుర్మా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Mouth Watering Veg Kurma Recipe in Telugu Perfect for Chapati Poori and Bagara Rice

కావలసిన పదార్థాలు
బంగాళాదుంపలు - 2
క్యారెట్ - 1
కాలీఫ్లవర్ ముక్కలు - 1 కప్పు
బీన్స్ - 6
పచ్చి బఠానీలు - 1 కప్పు
పెద్ద ఉల్లిపాయలు - 2
పండిన టమాటాలు - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి తగినంత.
నూనె - 2 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - 2
యాలకులు - 2
బిర్యానీ ఆకు - 1
జీలకర్ర - కొద్దిగా
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
వేయించిన పల్లీలు - 1 టేబుల్ స్పూన్
సోంపు - 1 టీస్పూన్
జీడిపప్పు - 9

అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా!

తయారీ విధానం

-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి తురుము, వేయించిన పల్లీలు, సోంపు, జీడిపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని క్రీమ్ లాంటి పేస్ట్‌ గా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేయాలి. నూనె వేడెక్కాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి.మసాలా సువాసన వస్తుండగానే.. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా ఎర్రగా వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తబడేవరకు మగ్గనివ్వాలి.

-టమాటాలు గుజ్జులా అయ్యాక పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి నూనె పైకి తేలేవరకు బాగా కలపాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కూరగాయల ముక్కలన్నీ వేసి మసాలా పట్టేలా వేయించాలి.

-ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్లు, ఉప్పు వేసి మూతపెట్టి ఉడికించాలి. కూరగాయలు సగం ఉడికిన తర్వాత, ముందుగా రుబ్బి పెట్టుకున్న కొబ్బరి-జీడిపప్పు పేస్ట్‌ను వేసి బాగా కలపాలి. మంటను సిమ్‌లో పెట్టి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి.

-కూరగాయలు మెత్తగా ఉడికి, గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలుతున్నప్పుడు.. సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయాలి.

-అంతే ఘుమఘుమలాడే, నోరూరించే వెజిటబుల్ కుర్మా రెడీ. వేడివేడి చపాతీ, పూరీ, పరోటా లేదా బగారా రైస్‌ లోకి ఈ కుర్మాను వడ్డించండి.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 16, 2026, 22:04 [IST]
Desktop Bottom Promotion