ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

రోజూ తినే అన్నం, పప్పు, కూరలతో విసిగిపోయారా? మధ్యాహ్న భోజనంలో ఏదైనా కొత్తగా, నోటికి రుచిగా తినాలనిపిస్తోందా? మీ వంటగదిలో కాస్త బాస్మతి బియ్యం, కొన్ని కూరగాయలు ఉన్నాయా? అయితే ఇంకెందుకు ఆలస్యం... కేవలం నిమిషాల్లో ముంబై వీధుల్లో దొరికే ఘుమఘుమలాడే 'స్ట్రీట్ స్టైల్ తవా పులావ్ ను మీ ఇంట్లోనే తయారు చేసుకోండి.

సాధారణంగా మనం చేసుకునే బిర్యానీలు, పులావ్‌ లకు భిన్నంగా ఉండే ఈ తవా పులావ్.. మీ ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఇట్టే కట్టిపడేస్తుంది. ముఖ్యంగా పిల్లల లంచ్ బాక్స్‌ లో ఇది పెట్టిస్తే, ఒక్క మెతుకు కూడా వదలకుండా డబ్బా ఖాళీ చేసి మరీ వస్తారు.

Mumbai Street Style Tawa Pulao Recipe in Telugu

కావలసిన పదార్థాలు

వండిన బాస్మతి అన్నం - 2 కప్పులు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
వెన్న- 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ - సగం
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
క్యాప్సికమ్ - సగం
పచ్చిమిర్చి - 2
పచ్చి బఠానీలు - 3 టేబుల్ స్పూన్లు
క్యారెట్ - 1
టమాటాలు - 2
ఉడికించిన బంగాళదుంప - 1
పసుపు - పావు టీస్పూన్
కారం - 1 టేబుల్ స్పూన్
పావ్ భాజీ మసాలా - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - 4 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - సగం చెక్క
నీళ్లు - 2 టేబుల్ స్పూన్లు

పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!

తయారీ విధానం

-ముందుగా అడుగు మందంగా ఉన్న వెడల్పాటి పాన్ లేదా తవా తీసుకోండి. అందులో నూనె, వెన్న వేసి వేడి చేయండి. ఇప్పుడు అందులో జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించండి.

-ఉల్లిపాయలు మెత్తబడ్డాక.. క్యాప్సికమ్, బఠానీలు, క్యారెట్, టమాటా ముక్కలు వేసి బాగా కలపండి. కూరగాయలు మరీ మెత్తగా కాకుండా, కాస్త కరకరలాడేలా వేయించుకుంటే పులావ్ తినేటప్పుడు భలే రుచిగా తగులుతాయి.

-మంటను మీడియంలో ఉంచి.. పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, ఈ వంటకానికే హైలైట్ అయిన పావ్ భాజీ మసాలా వేయండి. మసాలాలన్నీ కూరగాయలకు పట్టేలా కలుపుతూ వేయించండి.

-ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు చల్లి, మసాలా మాడిపోకుండా ఉడికించండి. ఆ వెంటనే ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, కొద్దిగా కొత్తిమీర చల్లి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి.

-ఇప్పుడు అసలైన ఘట్టం. పొడిపొడిగా వండి పెట్టుకున్న బాస్మతి అన్నాన్ని అందులో వేసి, అన్నం మెతుకులు విరగకుండా చాలా సున్నితంగా, మసాలా అంతా అన్నానికి పట్టేలా కలపండి. చివరగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, మరో రెండు చెంచాల కొత్తిమీర చల్లి, పుల్లపుల్లని నిమ్మరసాన్ని పిండండి.

-అంతే అంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి.

-వేడివేడిగా, కమ్మని వెన్న,పావ్ భాజీ మసాలా సువాసనలతో నోరూరించే ముంబై రోడ్‌ సైడ్ తవా పులావ్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, September 24, 2026, 13:08 [IST]
Desktop Bottom Promotion