మటన్ పచ్చడి కాదు.. ఎప్పుడైనా స్పైసీ మటన్ చట్నీ రుచి చూశారా?

Posted By:

మాంసాహార ప్రియులకు మటన్ పచ్చడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మటన్ ముక్కలతో చేసే నిల్వ పచ్చడిని చాలామంది ఇష్టంగా తింటారు. కానీ ఎప్పుడైనా మటన్ చట్నీ రుచి చూశారా? ముక్కలు లేకుండా పేస్ట్ లాగా ఉండే ఈ చట్నీని ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. వేడి వేడి అన్నం, చపాతీలు, రోటీలు, చివరకు బిర్యానీలోకి కూడా ఈ మటన్ చట్నీ అద్భుతమైన కాంబినేషన్.

Mutton Chutney Recipe in Telugu Perfect Side Dish for Rice Chapati and Biryani

మటన్ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు

మటన్ (బోన్‌ లెస్) - అరకిలో
టమాటాలు - కిలోన్నర
నూనె - 2 టేబుల్ స్పూన్లు
కశ్మీరీ కారం - 1 టేబుల్ స్పూన్
సాధారణ కారం - 1.5 టేబుల్ స్పూన్
ఉప్పు - 1 టేబుల్ స్పూన్
పసుపు - 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
పుదీనా - 10 ఆకులు
కొత్తిమీర - ఒక చిన్న కట్ట
నీళ్లు - ఒకటిన్నర కప్పు
ధనియాలు - 50 గ్రాములు
నువ్వులు - 10 గ్రాములు
కలోంజి (ఉల్లిపాయ గింజలు) - 20 గ్రాములు
నూనె - అర లీటర్
వెల్లుల్లి రెబ్బలు - 25 నుంచి 30 )
జీలకర్ర - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 12
కరివేపాకు - గుప్పెడు
నిమ్మకాయలు - 10 నుంచి 12

Mutton Chutney Recipe in Telugu Perfect Side Dish for Rice Chapati and Biryani

మటన్ చట్నీ తయారీ విధానం

-ముందుగా బోన్‌ లెస్ మటన్‌ ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒకవేళ ఎముకలు ఉన్న మటన్ అయితే ఉడికాక వాటిని తీసేయవచ్చు.

-ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందులో మటన్, టమాటా ముక్కలు, రెండు స్పూన్ల నూనె, కశ్మీరీ కారం, సాధారణ కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర కూడా వేసి చేత్తో బాగా కలుపుతూ మిక్స్ చేయాలి. మసాలాలన్నీ ముక్కలకు పట్టాక అందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి మూతపెట్టాలి. స్టవ్ వెలిగించి కుక్కర్‌ ను 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

-ఆవిరి పోయాక మూతతీసి, నీరంతా ఇగిరిపోయి దగ్గరపడే వరకు మీడియం మంటపై ఉడికించి చల్లారనివ్వాలి.

-మటన్ చల్లారేలోపు స్టవ్ పై పాన్ పెట్టి ధనియాలు, నువ్వులు, కలోంజి గింజలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ పట్టి మెత్తటి పౌడర్ లా చేసుకోవాలి.

-ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ మిశ్రమం పూర్తిగా చల్లారాక (ఎముకలు ఉంటే తీసేసి), మిక్సీలో గానీ, రోట్లో గానీ వేసి మెత్తటి పేస్ట్‌ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ పై అడుగు మందంగా ఉన్న పెద్ద కడాయి పెట్టి, అందులో అర లీటర్ నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక పొట్టుతీసిన వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వరుసగా వేసి దోరగా వేయించుకోవాలి. పోపు బాగా వేగాక ముందుగా రుబ్బి పెట్టుకున్న మటన్ పేస్ట్‌ ను ఇందులో వేయాలి. నూనెనంతా మటన్ పేస్ట్ పీల్చుకుని, మంచి కలర్ లోకి మారే వరకు కనీసం 20-30 నిమిషాల పాటు సన్నటి మంటపై కలుపుతూ ఉడికించాలి. అడుగు అంటకుండా గరిటెతో తిప్పుతూనే ఉండాలి.

-మటన్ పేస్ట్ నూనెలో బాగా మగ్గాక, ముందుగా తయారు చేసి పెట్టుకున్న ధనియాలు, కలోంజి మసాలా పొడిని ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. పొడి వేశాక మరో పది నిమిషాలు ఉడకనివ్వాలి. ఈలోపు గింజలు లేకుండా నిమ్మరసాన్ని తీసి పెట్టుకోవాలి. మసాలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి, నిమ్మరసం పోసి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేయాలి.

-అంతే.. ఘుమఘుమలాడే, ఎంతో రుచికరమైన మటన్ చట్నీ రెడీ. ఈ స్పైసీ చట్నీని అన్నం, రోటీలతో పాటు బిర్యానీకి సైడ్ డిష్‌గా వడ్డిస్తే లొట్టలేసుకుంటూ తినడం ఖాయం.

[ of 5 - Users]
Story first published: Thursday, June 25, 2026, 9:15 [IST]
Desktop Bottom Promotion