కూర లేకుండానే కడుపునిండా తినేయొచ్చు..రోజూ తినే చపాతీకి బదులు ఇలా క్యారెట్ రోటీ చేసి చూడండి

Posted By:

శీతాకాలం రాగానే మార్కెట్లన్నీ తాజా, ఎర్రని క్యారెట్లతో కళకళలాడుతుంటాయి. చలికాలంలో క్యారెట్లను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సాధారణంగా క్యారెట్లు అనగానే మనకు క్యారెట్ హల్వా, కర్రీ లేదా సలాడ్ వంటివే గుర్తుకొస్తాయి. కానీ ఎప్పుడూ ఒకే రకమైన వంటకాలు కాకుండా కొంచెం కొత్తగా, రుచికరంగా, ఆరోగ్యకరంగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే క్యారెట్ రోటీ ఒకసారి ట్రై చేసి చూడండి.

దీనికి ఎక్కువ సమయం కానీ, ఖరీదైన పదార్థాలు కానీ అవసరం లేదు. ఉదయం అల్పాహారంగానే కాకుండా మధ్యాహ్న భోజనంలోకి లేదా రాత్రి డిన్నర్‌ లోకి కూడా ఇది ఎంతో చక్కగా సరిపోతుంది. నోరూరించే క్యారెట్ రోటీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

No Curry Needed Make This Flavorful Spiced Carrot Roti in Just a Few Simple Steps

కావలసిన పదార్థాలు

గోధుమ పిండి: 4 కప్పులు
క్యారెట్లు: 3
జీలకర్ర పొడి: అర టీస్పూన్
కారం పొడి: అర టీస్పూన్
వాము: అర టేబుల్ స్పూన్
ఉప్పు: అర టీస్పూన్
గోరువెచ్చని నీరు: పిండి కలపడానికి అవసరమైనంత
నెయ్యి: కొద్దిగా

చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే

తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండి, సన్నగా తురిమిన క్యారెట్లను వేయండి. ఆ తర్వాత జీలకర్ర పొడి, కారం పొడి, వాము, ఉప్పు వేసి పొడి పదార్థాలన్నీ క్యారెట్ తురుములో బాగా కలిసేలా చేతితో కలపండి.

-ఇప్పుడు అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చని నీటిని పోస్తూ చపాతీ పిండిలా మృదువుగా కలపండి. పిండి ముద్దను సిద్ధం చేసుకున్న తర్వాత, పైన కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి, మూత పెట్టి సుమారు 20 నిమిషాల పాటు అలానే ఉంచండి.

-20 నిమిషాల తర్వాత పిండిని మరోసారి మృదువుగా ఒత్తుకొని, సమానమైన చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఇప్పుడు చపాతీ బల్లపై కొద్దిగా పొడి పిండి చల్లి, ఒక ఉండను తీసుకొని మరీ మందంగా కాకుండా గుండ్రని రొటీలాగా ఒత్తుకోండి.

-తర్వాత స్టవ్‌ పై పెనం పెట్టి వేడి చేయండి. పెనం వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న రోటీను దానిపై ఉంచి రెండు వైపులా బాగా కాల్చండి. దానిమీద కొద్దిగా నెయ్యి పూసి, బంగారు రంగులోకి మారి కరకరలాడేంత వరకు కాల్చుకోండి. మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా రోటీలను తయారు చేసుకోండి.

-అంతే, ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన వేడివేడి క్యారెట్ రోటీ రెడీ. దీనిని పెరుగు, మీకు ఇష్టమైన ఊరగాయ పచ్చడి లేదా కూరగాయల కూరతో వడ్డించి ఆస్వాదించండి.

[ of 5 - Users]
Story first published: Wednesday, November 25, 2026, 20:45 [IST]
Desktop Bottom Promotion