ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా!

Posted By:

ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయాలన్నా లేదా రాత్రి డిన్నర్ సమయానికైనా మన ఇంట్లో అందరికీ ముందుగా గుర్తొచ్చేది వేడి వేడి దోశలే. ఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టంగా దోశలు అడిగినప్పుడు, తీరా చూస్తే పిండి లేకపోతే ఎలా? మీ ఇంట్లో కేవలం ఒక కప్పు పచ్చి బియ్యం ఉంటే చాలు.. హోటల్ రుచిని మరిపించేలా, నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే నీర్ దోశను చిటికెలో తయారు చేయవచ్చు.

మంగళూరు స్పెషల్ అయిన నీర్ దోశ చాలా పలుచగా, మృదువుగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం ఎంత సులభమో, రుచి అంత అద్భుతంగా ఉంటుంది. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ తన్నీ చట్నీ (నీళ్ల చట్నీ). ఈ రెండింటి కలయిక మీ నాలుకకు ఒక కొత్త రుచిని పరిచయం చేస్తుంది.

No Dosa Batter Make This Melt in Mouth Mangalore Neer Dosa with Just 1 Cup of Rice Recipe in Telugu

కావలసిన పదార్థాలు

నీర్ దోశ కోసం

పచ్చి బియ్యం - 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
నీళ్లు -రెండున్నర కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా

తన్నీ చట్నీ కోసం

నూనె - 1 టీస్పూన్
మినపప్పు - 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు - 3
వెల్లుల్లి - 1 పెద్ద రెబ్బ
చింతపండు - చిన్న ముక్క
కొబ్బరి తురుము - పావు కప్పు
ఉప్పు - రుచికి తగినంత
నీళ్లు - తగినన్ని

తాలింపు (పోపు) కోసం

నూనె - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
ఎండు మిరపకాయ - 1

ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు!

తయారీ విధానం

-దోశ పిండి తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో పచ్చి బియ్యాన్ని తీసుకుని నీటితో మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి సుమారు 4 నుండి 5 గంటల పాటు బాగా నాననివ్వాలి.

-తర్వాత నానిన బియ్యంలోని నీటిని వడకట్టి, మిక్సీ జార్‌ లో వేసుకోవాలి. అందులోనే పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము, అర కప్పు నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, అందులో మరో రెండు కప్పుల నీళ్లు, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి.

-నీర్ దోశ పిండి నీళ్లలా (మజ్జిగలా) పలుచగా ఉండాలి. దీన్ని పక్కన పెట్టుకోండి.

-తన్నీ చట్నీ తయారీ కోసం.. స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టి, అందులో కొద్దిగా నూనె వేడి చేయండి. అందులో మినపప్పు వేసి కమ్మటి వాసన వస్తూ, దోరగా బంగారు రంగులోకి మారే వరకు వేయించండి. తర్వాత అందులోనే ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బ, చిన్న చింతపండు ముక్క వేసి కాస్త వేయించి స్టవ్ ఆపేయండి.

-ఇవి చల్లారాక మిక్సీ జార్‌ లోకి తీసుకుని, కొబ్బరి తురుము, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ చట్నీ పలుచగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి, గిన్నెలోకి తీసుకున్నాక తగినన్ని నీళ్లు కలుపుకోండి.

-ఇప్పుడు పాన్‌ లో నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చితో పోపు పెట్టుకుని, ఆ తాలింపును చట్నీలో కలుపుకుంటే కమ్మటి తన్నీ చట్నీ రెడీ.

నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్!

దోశలు వేసే విధానం

-స్టవ్ మీద నాన్‌ స్టిక్ లేదా ఇనుప దోశ పెనం పెట్టి బాగా వేడి చేయండి.

-పిండి నీళ్లలా ఉండటం వల్ల అడుగున ఉండిపోతుంది కాబట్టి, ప్రతిసారి దోశ వేసే ముందు గరిటెతో పిండిని బాగా కలపాలి. పెనం వేడెక్కాక, రవ్వ దోశ వేసినట్లుగా అంచుల నుండి మధ్యలోకి పిండిని పోయాలి. దీనిపై మూత పెట్టి మీడియం మంట మీద సరిగ్గా ఒక నిమిషం పాటు ఉడికించండి.

-ఈ దోశను రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదు. ఒక నిమిషం తర్వాత మూత తీసి, మెల్లగా మడిచి ప్లేట్‌ లోకి తీసుకోండి.

-అంతే తెల్లటి మల్లెపూవు లాంటి మెత్తటి నీర్ దోశ రెడీ. దీనిని కమ్మటి తన్నీ చట్నీలో ముంచుకుని తింటే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Story first published: Thursday, August 27, 2026, 6:38 [IST]
Desktop Bottom Promotion