టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి

షుగర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ..చక్కెర అనే పేరు వింటేనే చాలామంది భయపడుతున్నారు. ఒకప్పుడు చక్కెరను ఎక్కువగా తిన్నోళ్లే ఇప్పుడు దానిని స్వీట్ పాయిజన్ అని పిస్తున్నారు.

చక్కెర వల్ల శరీరానికి కలిగే లాభం పెద్దగా ఏమీ లేదు..కానీ నష్టాలు మాత్రం డజన్ల కొద్దీ ఉన్నాయి.ఇది మన ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి ఎన్నో తీవ్రమైన సమస్యలను ఉచితంగా అందిస్తుంది.

Ditching Sugar for Jaggery or Honey A Top Doctor Explains Why It s a Big Mistake

అయితే ఈ భయంతో చాలా మంది తీపి ప్రియులు, తమ టీ, కాఫీలలో పంచదారకు బదులుగా బెల్లం లేదా తేనెను ప్రత్యామ్నాయంగా వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల శరీరానికి తక్కువ కేలరీలు అందుతాయని, ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తారు. కానీ ఇది నిజంగానే పనిచేస్తుందా? ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ జయేష్ శర్మ ఈ అపోహల వెనుక ఉన్న అసలు నిజాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లోషేర్ చేసిన ఒక వీడియో ద్వారా బయటపెట్టారు.

చక్కెర స్థానంలో బెల్లం, తేనె వాడటం ఆరోగ్యకరం కాదా అన్న ప్రశ్నకు ఆయన కాదు అని స్పష్టంగా సమాధానమిచ్చారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. పంచదార, బెల్లం, తేనె ఈ మూడు ఒకే కుటుంబానికి చెందిన బంధువులు. బెల్లం అనేది పల్లెటూరి బంధువు లాంటిది అయితే తేనె అమెరికా నుండి వచ్చిన విదేశీ బంధువు లాంటిది. ఈ మూడింటి జన్యువులు ఒక్కటే. ఇవన్నీ యాడెడ్ షుగర్స్ (Added Sugars) కిందకే వస్తాయి. మూడింటిలోనూ దాదాపు సమానమైన కేలరీలు ఉంటాయి. ఇవి మూడూ కూడా రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను అత్యంత వేగంగా పెంచుతాయి.

తెల్ల చక్కెర పూర్తిగా రిఫైన్ చేయబడిన పదార్థం. ఇందులో ఎలాంటి పోషక విలువలు ఉండవు. ఇక బెల్లం విషయానికి వస్తే, ఇది కాస్త తక్కువ రిఫైన్ చేయబడిన రూపం. ఇందులో ఐరన్ వంటి సూక్ష్మపోషకాలు ఉంటాయన్నది నిజమే, కానీ అవి మన శరీరానికి ప్రయోజనం చేకూర్చేంత స్థాయిలో ఉండవు. రక్తహీనత తగ్గుతుందన్న భ్రమతో బెల్లం తింటే, దానిలోని పోషకాల కంటే అందులోని కేలరీలు మనకు ఎక్కువ నష్టం చేస్తాయి. అలాగే తేనెలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ, వేడి వేడి టీలో దానిని కలిపి తాగడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.

మరి పరిష్కారం ఏమిటి?
మనం రోజువారీ తీసుకునే క్యాలరీలలో చక్కెర శాతం 10 శాతం కంటే తక్కువగా ఉండాలి. సగటు మనిషి రోజుకు 3 నుంచి 4 టీస్పూన్ల వరకు చక్కెరను తీసుకోవడం సురక్షితం. పండుగలు, వేడుకల సమయంలో మోతాదుకు మించి స్వీట్లు తింటారు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, August 26, 2026, 10:25 [IST]
Desktop Bottom Promotion