ఉదయం హడావిడిలో బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. కేవలం 10 నిమిషాల్లో శనగపిండి దోశ..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

సమయం తక్కువగా ఉన్నప్పుడు, ఆరోగ్యానికి మేలు చేసే, రుచితో పాటు కడుపు నింపే అద్భుతమైన వంటకం కోసం చూస్తున్నారా? అయితే శనగపిండి దోశ మీకు బెస్ట్ ఆప్షన్. ఇది కేవలం ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ కే కాదు, సాయంత్రం వేళ పిల్లలు స్కూల్ నుండి రాగానే పెట్టే చిరుతిండిగా కూడా అద్భుతంగా ఉంటుంది.

శనగపిండిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే మనం ఇందులో రకరకాల కూరగాయలు కూడా వాడుతాం కాబట్టి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేవలం 10 నుండి 15 నిమిషాల్లో వేడివేడిగా సిద్ధమయ్యే శనగపిండి దోశ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

No Time for Breakfast Make This Quick Healthy Besan Dosa in 10 Minutes Recipe in Telugu

శనగపిండి దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు

శనగ పిండి - 1 కప్పు
ఉల్లిపాయ - 1
టమాటో - 1
పచ్చిమిర్చి -2
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
అల్లం - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
ఎర్ర కారం -అర టీస్పూన్
ఉప్పు -తగినంత
జీలకర్ర - అర టీస్పూన్
కసూరి మెంతి - అర టీస్పూన్
క్యారెట్ లేదా క్యాప్సికమ్ - 2 టేబుల్ స్పూన్లు
వంట సోడా- చిటికెడు
నూనె - కాల్చడానికి సరిపడా

శనగపిండి దోశ తయారీ విధానం

-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు శనగపిండి,పసుపు, కారం, జీలకర్ర, ఉప్పు, తురిమిన అల్లం, కసూరి మెంతిని వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ గరిటెతో బాగా కలపండి. పిండిలో ఎలాంటి ఉండలు లేకుండా, మృదువుగా అయ్యేలా చూసుకోండి. పిండి మరీ నీళ్లలా పల్చగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా చిక్కగా కూడా ఉండకూడదు. దోశ పిండి లా ఉంటే సరిపోతుంది.

-సిద్ధం చేసుకున్న పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, తురిమిన క్యారెట్ లేదా క్యాప్సికమ్, చిటికెడు బేకింగ్ సోడా వేసి కలపండి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి, నాన్ స్టిక్ లేదా ఇనుప పెనాన్ని వేడి చేయండి. పెనం వేడెక్కాక దానిపై కొద్దిగా నూనె రాసి, ఒక టిష్యూ కాగితంతో పెనమంతా తుడవండి. ఇలా చేయడం వల్ల దోశ పెనానికి అంటుకోకుండా సులభంగా వస్తుంది.

-ఇప్పుడు ఒక గరిటెడు పిండిని తీసుకుని పెనం మధ్యలో పోసి, మెల్లగా గుండ్రంగా దోశలా పరచండి. కూరగాయలు ఉన్నందున ఇది దోశంత పల్చగా రాదు, కాస్త మందంగానే ఉంటుంది. దీని అంచుల చుట్టూ కొద్దిగా నూనెను చిలకరించండి.

-మంటను తక్కువ నుండి మీడియంలో ఉంచి ఒక వైపు బంగారు గోధుమ రంగులోకి మారే వరకు నిదానంగా ఉడికించండి. ఒక వైపు కాలిన తర్వాత, గరిటెతో జాగ్రత్తగా తిప్పి, రెండో వైపు కూడా దోరగా కాల్చుకోండి.

-అంతే గుమగుమలాడే వేడివేడి, రుచికరమైన శనగపిండి దోశ రెడీ. దీనిని పుదీనా పచ్చడి లేదా టమాటా కెచప్‌ తో తింటే అదిరిపోతుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, April 9, 2026, 16:50 [IST]
Desktop Bottom Promotion