మటన్ స్పెషల్ -చెట్టినాడు స్టైల్ మటన్ ఫ్రై

చెట్టినాడు వంటకాలంటే ఖచ్చితంగా నోరూరాల్సిందే. తమిళుల సాంప్రదాయ వంటకాలైనా చెట్టినాడు స్పెషల్ వంటలు వాసన చూడగానే మరింత ఆకలి వేస్తుంది. స్పైసీగా, చాలా రుచిగా ఉండే ఈ వంటలు అద్భుతమైన రుచిని ఇస్తాయి. చెట్టినాడు మటన్ రెండు రకాలుగా వండుతారు. ఒకటి తమిళులు వండే మటన్ కర్రీ. మరొకటి ఈ ఫ్రై. ఈ ఫ్రై చెన్నై స్ట్రీట్ ఫుడ్స్ లో చాలా ఫేమస్. కాబట్టి ఈ స్పైసీ చెట్టినాడు స్టైల్ మటన్ ఫ్రైన్ మీరూ తయారు చేసి రుచిచూడండి...

Mutton Fry Chettinadu Style

మ్యారినేట్ చేయడానికి కావలసిన పదార్థాలు:
మటన్: 1/2kg(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పసుపు: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tbsp
కారం: 1.5tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
చెట్టినాడు మసాలాకు కావల్సిన పదార్థాలు:
చిన్న ఉల్లిపాయలు: 4
వెల్లుల్లిపాయలు: 5-8
ధనియాల పొడి: 1.5tbsp
కారం: 1tsp
లవంగాలు: 2
చెక్క: చిన్న ముక్క
బిర్యాని ఆకు: 1
కరివేపాకు: రెండు రెమ్మలు
పెప్పర్ కార్న్(మిరియాలు): 8
ఉల్లిపాయలు: 2(chopped)
టమోటో: 1(finely chopped)
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1tsp
కొబ్బరి తురుము: 2tbsp
సోంపు: 1tsp
గసగసాలు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా మటన్ ను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మ్యారినేట్ కు సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని వేసి అందులోనే మటన్ ముక్కలను కూడా వేసి బాగా మిక్స్ చేసి 1 నుండి 2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో నూనె వేసి వేడిచేసి వేడయ్యాక అందులో చిల్ల ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి పాయలు వేసి వేయించాలి.
3. తర్వాత అందులోనే కారం, ధనియాల పొడిని కూడా వేసి మీడియం మంట మీద రెండు మూడు నిముషాలు వేయించాలి.
4. ఇప్పుడు అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న మటన్ ముక్కలను వేసి బాగా కలియబెడుతూ పది నిముషాల పాటు వేయించాలి.
5. తర్వాత అందులో ఒకటిన్నర కప్పు వేడి నీళ్ళు పోసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి.
6. అంతలోపు ఒక ఫ్రైయింగ్ పాన్ లో లవంగాలు, చెక్క, గసగసాలు, సోంపుగింజలు, బిర్యానీ ఆకు మరియు మిరియాలు వేసి రెండు నిముషాల పాటు వేయించుకోవాలి.
7. వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేయించి మసాల దినుసులను పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
8. ఇప్పుడు పాన్ లో నూనె వేసి, కాగిన తర్వాత అందులో కరివేపాకు, కట్ చేసి ఉల్లిపాయ ముక్కలను వేసి ఐదు నిముషాల పాటు మీడియం మంట మీద వేగించుకోవాలి.
9. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి మారే సమయంలో అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో రెండు నిముషాలు వేగించాలి.
10. ఇప్పుడు అందులోనే కొబ్బరి తురుము మరియు పేస్ట్ చేసి పెట్టుకొన్న మసాలను వేసి ఐదు నిముషాలు వేగించాలి. ఇంతలోపు కుక్కర్ లో మటన్ తీసి ఈ ఫ్రైయింగ్ పాన్ లో పోసి గ్రేవీ చిక్కబడేవరకూ ఉడికించాలి. అంతే చెట్టినాడు స్టైల్ మటన్ కర్రీ రెడీ...దీన్ని రోటీ లేదా దోసతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.

Story first published: Saturday, November 17, 2012, 17:05 [IST]
Desktop Bottom Promotion