శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

Posted By:

విటమిన్ల లోపం వస్తే వెంటనే సప్లిమెంట్లు, మందుల వైపు పరుగులు తీయడం కంటే.. ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్థాల ద్వారానే శరీరానికి అవసరమైన పోషకాలను పొందడం ఎంతో మేలు. మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలలో పచ్చి అరటిపండు ఒకటి. ఇందులో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

అయితే పచ్చి అరటిపండు కూర అంటే పిల్లలు ముఖం తిప్పేస్తుంటారు. అలాంటి వారి కోసం రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే కరకరలాడే పచ్చి అరటిపండు మసాలా పూరీ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

pachi aratikaya poori how to make crispy healthy raw banana masala puri in telugu

కావాల్సిన పదార్థాలు

గోధుమ పిండి - ఒకటిన్నర కప్పు (225 గ్రాములు)
పచ్చి అరటిపండ్లు - 6 (అర కిలో)
కొత్తిమీర - 3 టేబుల్ స్పూన్లు
పచ్చి మిర్చి - 2
పసుపు - అర టీస్పూన్
కారం - పావు టీస్పూన్
వాము - అర టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ..

తయారీ విధానం

-ముందుగా పచ్చి అరటిపండ్లను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి, ఆవిరి తగ్గేంతవరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారాక అరటిపండ్లను బయటకు తీసి, తొక్క వలిచేయాలి. లోపల ఉండే నల్లటి భాగాన్ని తీసేసి, మిగతా అరటిపండును ఎక్కడా ఉండలు లేకుండా మెత్తగా తురుముకోవాలి.

-ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి, తురుముకున్న అరటిపండు వేయాలి. దానికి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు కలపాలి. వామును చేతులతో నలిపి వేస్తే పూరీలకు అద్భుతమైన సువాసన వస్తుంది. ఇవన్నీ పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు చల్లుతూ పూరీ పిండిలా కాస్త గట్టిగా ముద్ద చేసుకోవాలి. సుమారు అరకప్పు నీళ్లు పడతాయి.

-కలుపుకున్న పిండిపై మూత పెట్టి 20 నుండి 25 నిమిషాల పాటు పక్కన ఉంచితే, పిండి బాగా సెట్ అయ్యి పూరీలు మృదువుగా వస్తాయి.

-20 నిమిషాల తర్వాత చేతులకు కాస్త నూనె రాసుకుని పిండిని మరోసారి మెత్తగా పిసకాలి. ఆ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని, ఆరిపోకుండా వాటిపై మూత పెట్టుకోవాలి.

-ఇప్పుడు చపాతీ పీటకు, కర్రకు నూనె రాసి, ఒక్కో ముద్దను తీసుకుని రౌండ్ గా పూరీల్లా ఒత్తుకోవాలి. మధ్యలో పల్చగా, అంచుల వద్ద మందంగా కాకుండా.. అంతటా ఒకే మందంతో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పూరీలు చక్కగా పొంగుతాయి.

-స్టవ్ వెలిగించి బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా కాగిందో లేదో తెలుసుకోవడానికి చిన్న పిండి ముద్దను వేస్తే, అది వెంటనే పైకి తేలాలి. ఇప్పుడు ఒత్తి పెట్టుకున్న పూరీని వేడి నూనెలో వేసి, గరిటెతో మెల్లగా నొక్కాలి. అలా చేస్తే పూరీ బంతిలా ఉబ్బుతుంది. రెండు వైపులా తిప్పుతూ బంగారు రంగులోకి మారే వరకు వేయించి, నూనె వడిపోయాక ప్లేట్ లోకి తీసుకోవాలి.

-మిగిలిన పూరీలను కూడా ఇదే విధంగా వేయించుకోవాలి.

-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే వేడివేడి పచ్చి అరటి మసాలా పూరీలు రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, October 1, 2026, 13:52 [IST]
Desktop Bottom Promotion