మిగిలిపోయిన అన్నంతో మంచూరియా..తరతరాలకు గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే

Posted By:

మిగిలిపోయిన అన్నంతో చాలామంది పులిహోర,గారెలు, టమాటో రైస్ వంటివి తయారుచేస్తుంటారు. మరికొందరు అయితే మిగిలిపోయిన అన్నం ఏం తింటాంలే అని పడేస్తుంటారు కూడా. అయితే మిగిలిపోయిన అన్నంతో టేస్టీ మంచూరియా చేసుకోవచ్చని మీకు తెలుసా? అది కూడా రెస్టారెంట్ లో తినే మంచూరియా కన్నా ఇంకా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మిగిలిపోయిన అన్నంతో టేస్టీ మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు

-మిగిలిపోయిన అన్నం
-కారం
-ఉప్పు
-జీలకర్ర పొడి
-ధనియాల పొడి
-నిమ్మరసం
-మొక్కజొన్న పిండి
-మైదాపిండి
-క్యాప్సికమ్
-క్యారెట్
-ఆయిల్
-ఉల్లిపాయ
-వెల్లుల్లి
-పచ్చిమిర్చి
-టమాటో
-టమాటో కెచప్
-చాట్ మసాలా
-గరం మసాలా

Quick and Easy How to Make Perfect Leftover Rice Manchurian At Home

తయారీ విధానం

-ముందుగా ఓ కప్పు మిగిలిపోయిన అన్నాన్ని మిక్సీ జార్ లో వేసి నీళ్లు పోయకుండానే మెత్తగా గ్రైండ్ చేసుకోండి.

-ఇప్పుడు ఓ పెద్ద బౌల్ తీసుకొని అందులో ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేయండి. ఇందులోనే 1 క్యాప్సిక్సమ్ సన్నని తరుగు, 1 క్యారెట్ తరుగు, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయల ముక్కలు, 1 ఉల్లిపాయ తరుగు వేసి కలపండి.

-ఇప్పుడు అందులోనే అరకప్పు మైదాపిండి, 2 స్పూన్ల మొక్కజొన్న పిండి లేదా కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, పావు స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ ధనియాల పొడి, అరచెక్క నిమ్మరసం వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి.

-తర్వాత చేతులకు కొంచెం ఆయిల్ రాసుకోండి. కలిపిన మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని మీకు నచ్చిన సైజులో మంచూరిన్ బౌల్స్ లా చేసుకొని ఓ ప్లేట్ లో పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానికి తగింత ఆయిల్ పోసి వేడి చెయ్యండి.

-ఆయిల్ బాగా వేడయ్యాక రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బౌల్స్ ని ఒక్కొక్కటిగా ఇందులో వేయండి. ఈ సమయంలో మంటను మీడియంలో ఉంచడం ముఖ్యం.

-గరిటతో నెమ్మదిగా వాటిని కదుపుతూ 10-15 నిమిషాలు మీడియం మంటమీద ఫ్రై చేసుకోవాలి. బంగారు రంగు వచ్చేదాకా ఫ్రై చేశాక వాటిని ఆయిల్ లో నుంచి తీసి ఓ ప్లేట్ లో పెట్టుకోవాలి.

-ఇప్పుడు సాసింగ్ కోసం స్టవ్ మీద మరో పన్ లేదా అదే పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడి చెయ్యాలి. ఆయిల్ వేడయ్యాక అందులో సన్నగా కట్ చేసిన 5 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసిన 1 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ సన్నని ముక్కలు వేసి కలర్ మారేదాకా ఫ్రై చేశాక అందులోనే 1 క్యారెట్ తరుము, 1 క్యాప్సికమ్ సన్నని ముక్కలు వేసి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి.

-తర్వాత అందులో సన్నగా కట్ చేసిన 1 టమాటో ముక్కలు వేసి 2 నిమిసాలు వేయించి ఇందులో అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ కారం, అర స్పూన్ గరం మసాలా, అర స్పూన్ చాట్ మసాలా వేసి బాగా ఫ్రై చేశాక ఇందులో 4 స్పూన్ల టమాటో కెచప్ వేసి కలపండి.

-1 నిమిషం తర్వాత అందులో వేయించిన మంచూరియా బాల్స్ వేసి 2 నిమిషాలు తక్కువమంట మీద కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే వేడి వేడి మంచూరియా రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, June 25, 2025, 13:42 [IST]
Desktop Bottom Promotion