Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది!

Posted By:

బ్రకోలి..ఈ పేరు వినగానే పిల్లలు ఆమడ దూరం పరిగెడతారా? ఎంత ఆరోగ్యకరమైన కూరగాయ అయినా సరే, తినడానికి చాలామంది ముఖం తిప్పుకుంటారు. కానీ ఒక్కసారి ఈ బ్రకోలి పులావ్ చేసి పెట్టండి.. మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ ఇష్టంగా తింటారు.

అద్భుతమైన మసాలా సువాసనలతో, నెయ్యి కమ్మదనంతో నోరూరించే ఈ బ్రకోలి రైస్.. లంచ్ బాక్స్‌ లోకి, డిన్నర్‌ లోకి పర్ఫెక్ట్ ఆప్షన్. నిమిషాల్లోనే ఈ టేస్టీ అండ్ హెల్తీ బ్రకోలి పులావ్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Quick Healthy Broccoli Pulao How to Make Broccoli Rice Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు
బ్రకోలి - 100 గ్రాములు
ఉడికించిన సోనా మసూరి అన్నం - 3 కప్పులు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్ (చివర్లో మరో అర టీస్పూన్)
జీడిపప్పు - 8
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
పచ్చిమిర్చి - 2
వెల్లుల్లి రెబ్బలు - 2
పసుపు - పావు టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
మిరియాల పొడి - పావు టీస్పూన్
కిచెన్ కింగ్ మసాలా - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మరసం - అర టీస్పూన్
నువ్వుల నూనె - కొద్దిగా

Chicken Kofta Recipe: రోటీ, బగారా రైస్‌లోకి అదిరిపోయే చికెన్ కోఫ్తా కర్రీ..ఈజీగా, టేస్టీగా ఇలా చేసుకోండి

తయారీ విధానం

-ముందుగా ఉడికించిన 3 కప్పుల సోనా మసూరి అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్‌ లో ఆరబోయాలి. దానికి కొద్దిగా నువ్వుల నూనె పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్నం ముద్దగా కాకుండా, పులావ్ పొడిపొడిలాడుతూ వస్తుంది.

-స్టవ్ ఆన్ చేసి, ఒక గిన్నెలో నీళ్లు మరిగించి స్టీమర్ పెట్టుకోవాలి. అందులో బ్రకోలి ముక్కలను వేసి కేవలం 5 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. బ్రకోలి మరీ మెత్తగా ఉడికితే రుచిగా ఉండదు, కాస్త క్రిస్పీగా ఉండాలి. ఉడికిన తర్వాత నీటిని వంపేసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి వెడల్పాటి పాన్ పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగాక జీడిపప్పులు వేసి దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

-అదే పాన్‌ లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, గింజలు తీసేసిన పచ్చిమిర్చి వేసి.. ఉల్లిపాయలు పారదర్శకంగా మారేంతవరకు బాగా వేయించాలి. ఆ తర్వాత పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, కిచెన్ కింగ్ మసాలా వేసి మంట తగ్గించి ఓ రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేలా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా కలుపుకోవాలి.

-అందులో ముందుగా ఆవిరిపై ఉడికించిన బ్రకోలి ముక్కలు వేసి ఒక్క నిమిషం పాటు మసాలా పట్టేలా వేయించాలి. ఆపై చల్లార్చిన అన్నాన్ని వేసి మసాలాలన్నీ అన్నానికి పట్టేలా నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

-చివరగా పుల్లటి నిమ్మరసం, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, అర టీస్పూన్ నెయ్యి పైన వేసి బాగా కలపాలి.

-అంతే గుమగుమలాడే వేడివేడి బ్రకోలి పులావ్ రెడీ. కమ్మటి పెరుగు రైతాతో కానీ, మీకు ఇష్టమైన కుర్మాతో కానీ వడ్డిస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.

[ of 5 - Users]
Story first published: Saturday, October 3, 2026, 21:54 [IST]
Desktop Bottom Promotion