రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా..

Posted By:

నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే తియ్యని స్వీట్ సోన్ పాప్డీ అంటే ఇష్టపడని వారుండరు. ఇది తయారు చేయడం కొద్దిగా కష్టమేమో, చాలా ఓపిక కావాలేమో అనిపిస్తుంది. కానీ సరైన పద్ధతిలో చేస్తే అచ్చం స్వీట్ షాపులో దొరికే అంతే అద్భుతమైన రుచితో ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు.

ఆగస్టు 28న రక్షాబంధన్, ఆ తర్వాత ఎనిమిది రోజులకు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగలు రానున్నాయి. ఈ పండుగల వేళ మీ కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు మీ చేతులతో స్వయంగా సోన్ పాప్డీ చేసి తినిపించాలనుకుంటే దీనిని మీ ఇంట్లో ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Rakhi Janmashtami Special How to Make Perfect Melt-in-Mouth Soan Papdi at Home in Telugu
సోన్ పాప్డీ తయారీకి కావలసిన పదార్థాలు
మైదా పిండి - 1 కప్పు
శనగ పిండి - 1/3 కప్పు
స్వచ్ఛమైన నెయ్యి - 1 కప్పు.
చక్కెర - 1 కప్పు
నీళ్లు - పావు కప్పు
నిమ్మరసం - 1 టీస్పూన్.
బాదం పప్పులు

రాఖీ 2026 స్పెషల్: మీ చేతులతో సోదరుడి కోసం కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ ఇలా చేయండి!

సోన్ పాప్డీ తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి మందంగా ఉన్న బాండీ పెట్టుకుని మంటను సిమ్‌ లో ఉంచాలి. అందులో నెయ్యి వేసి వేడి అయ్యాక, మైదా, శనగపిండి వేసి నిదానంగా కలపాలి. పచ్చివాసన పోయి, కమ్మని సువాసన వస్తూ లేత బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఎలాంటి ఉండలు లేకుండా జల్లెడ పట్టి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు మరో బాండీ తీసుకుని అందులో చక్కెర, నీళ్లు పోసి ఉడికించాలి. పాకం చిక్కగా, జిగురుగా మారుతున్నప్పుడు అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్ళెంలో కొద్దిగా నెయ్యి రాసి, ఈ వేడి వేడి పాకాన్ని అందులో పోయాలి. పాకం గోరువెచ్చగా, చేత్తో పట్టుకునేంత వేడికి వచ్చే వరకు చల్లారనివ్వాలి.

-అసలైన ఘట్టం ఇక్కడే ఉంది. మీ చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, గోరువెచ్చని పాకాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక ముద్దలా చేయండి. ఆ పాకాన్ని నెమ్మదిగా సాగదీస్తూ, మళ్ళీ మడతపెడుతూ ఉండాలి. పాకం అంటుకోకుండా ఉండేందుకు ముందుగా వేయించి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని అప్పుడప్పుడు చల్లుకుంటూ ఉండాలి. ఇలా పాకాన్ని లాగుతూ, మడతపెడుతూ ఉంటే క్రమంగా సన్నని దారాల్లాంటి పోగులు ఏర్పడతాయి.

-నెయ్యి రాసిన చిన్న గిన్నెలు లేదా అచ్చులను తీసుకుని, అడుగున వేయించిన బాదం ముక్కలు చల్లాలి. మనం తయారుచేసుకున్న సోన్ పాప్డీ దారాలను అందులో ఉంచి, చేతితో సున్నితంగా నొక్కాలి. ఆ తర్వాత జాగ్రత్తగా గిన్నెలోంచి బయటకు తీస్తే కమ్మని వాసనతో నోరూరించే సోన్ పాప్డీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, August 25, 2026, 14:45 [IST]
Desktop Bottom Promotion