కేవలం 10 నిమిషాల్లో రెడీ..టిఫిన్స్ లోకి అదిరిపోయే వెల్లుల్లి ఉల్లిపాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే

Posted By:

సాధారణంగా మనమందరం టిఫిన్స్ లోకి నంజుకోడానికి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా పుట్నాల చట్నీ చేస్తుంటాం. కానీ రోజూ అవే తిని తిని మీకు, మీ ఇంట్లో వారికి బోర్ కొట్టిందా? అయితే ఈసారి కొత్తగా వెల్లుల్లి ఉల్లిపాయ చట్నీ ట్రై చేయండి.

ఉదయాన్నే చల్లటి వాతావరణంలో వేడి వేడి ఇడ్లీల్లోకి కాస్త ఘాటుగా, స్పైసీగా ఉండే వెల్లుల్లి ఉల్లిపాయ చట్నీ తగిలితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇది కేవలం రుచికరమే కాదు, వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు ఈ శీతాకాలంలో మిమ్మల్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

Ready in 10 Minutes The Ultimate Spicy Garlic Chutney for Idli and Dosa Recipe in Telugu

దీనిని కేవలం 10 నిమిషాల్లోనే దీనిని సిద్ధం చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, ఊతప్పం, బోండా.. ఇలా ఏ టిఫిన్‌కైనా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. వెల్లుల్లి ఉల్లిపాయ చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
నూనె: ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు: 15-20 రెబ్బలు
ఎండు మిరపకాయలు: 6
కరివేపాకు: 1 రెమ్మ
పెద్ద ఉల్లిపాయ: 1
చింతపండు: చిన్న ఉసిరికాయ సైజు
ఉప్పు: రుచికి సరిపడా
నీరు: గ్రైండ్ చేయడానికి తగినంత
తాలింపుకి నూనె: 1 టీస్పూన్
ఆవాలు: అర టీస్పూన్
మినప్పప్పు: 1 టీస్పూన్
కరివేపాకు: 1 రెమ్మ

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె వేడయ్యాక ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి దోరగా వేయించండి. మిరపకాయలు మాడిపోకుండా చూసుకోండి.

-ఇప్పుడు వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను బాండీలో వేయాలి. వెల్లుల్లిలోని పచ్చి వాసన పోయి, అవి లేత బంగారు రంగులోకి మారే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి ఎంత బాగా వేగితే చట్నీకి అంత మంచి రుచి వస్తుంది.

-వెల్లుల్లి వేగాక బాండీలోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, చిన్న ఉసిరికాయంత చింతపండు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు వేయించండి.

-అన్నీ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

-వేయించిన పదార్థాలన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌ లోకి తీసుకోండి. అందులో అవసరమైనంత నీరు పోసి మెత్తగా పేస్ట్‌ లా రుబ్బుకోవాలి. మరీ నీళ్ళలా కాకుండా, కాస్త గట్టిగా ఉంటేనే ఈ చట్నీ బాగుంటుంది.

-ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద బాండీ పెట్టి, ఒక స్పూన్ నూనె వేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. ఈ తాలింపులో మనం మిక్సీ పట్టుకున్న చట్నీని వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు జతచేసి, ఒక్క నిమిషం పాటు సన్నని మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.

-అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన వెల్లుల్లి ఉల్లిపాయ చట్నీ రెడీ. దీనిని వేడి వేడి ఇడ్లీ లేదా నెయ్యి దోశతో వడ్డించుకుని తింటే.. ఆ రుచిని మీరు అస్సలు మర్చిపోలేరు.

[ of 5 - Users]
Story first published: Monday, January 12, 2026, 7:02 [IST]
Desktop Bottom Promotion