హోటల్ స్టైల్ ఆలూ పనీర్ గ్రేవీ..చపాతీ, నాన్‌లోకి అదిరిపోయే కాంబినేషన్

Posted By:

చపాతీ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది బంగాళాదుంప కుర్మా లేదా మసాలా. కానీ ఎప్పుడూ ఒకే రకమైన కూర తింటే ఎవరికైనా బోర్ కొట్టడం సహజం. అందుకే బంగాళాదుంప పనీర్ గ్రేవీ ట్రై చేయండి. చపాతీ, నాన్, పూరీ లేదా బగారా రైస్‌లోకి అద్భుతంగా ఉంటుంది. గ్రేవీ చిక్కగా, రెస్టారెంట్ రుచిని తలపిస్తుంది. ఆలూ పనీర్ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బంగాళాదుంపలు - అర కిలో
కాశ్మీరీ కారం -ఒకటిన్నర టీస్పూన్లు
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
టమోటాలు - 4
వెల్లుల్లి రెబ్బలు - 10
అల్లం - 1 అంగుళం ముక్క
జీడిపప్పు - 15
పనీర్ - 100 గ్రాములు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకు - 1
దాల్చిన చెక్క - 2 చిన్న ముక్కలు
లవంగాలు - 3, ఏలకులు - 1
మిరియాలు - పావు టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ఉల్లిపాయ - 1
పెరుగు - 4 టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
కారం - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
కరివేపాకు, కొత్తిమీర- కొద్దిగా

తయారీ విధానం

-ముందుగా బంగాళాదుంపల తొక్క తీసి, వాటిని పొడవుగా ముక్కలు కోసుకోవాలి. ఈ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కాశ్మీరీ కారం, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా బాగా కలిపి పక్కన పెట్టుకోండి.

-మిక్సీ జార్‌ లో టమోటా ముక్కలు, అల్లం, వెల్లుల్లి, నానబెట్టిన జీడిపప్పు,100 గ్రాముల పనీర్ వేసి మెత్తటి పేస్ట్‌ లా రుబ్బుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చేయండి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి మీడియం మంటపై దోరగా వేయించుకోవాలి. ముక్కలు కాస్త మెత్తబడి, రంగు మారిన తర్వాత వాటిని ఒక ప్లేట్‌ లోకి తీసుకోండి.

-అదే పాన్‌ లో మిగిలిన నూనెలో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, మిరియాలు, జీలకర్ర వేసి వేయించండి. సువాసన వచ్చాక, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

-ఇప్పుడు సిద్ధం చేసుకున్న టమోటా-పనీర్ పేస్ట్‌ ను పాన్‌ లో వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు పోసి, నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి.

-ఆ తర్వాత పెరుగు వేసి మంట తగ్గించి బాగా కలపాలి. ఇందులోనే ధనియాల పొడి, కారం, గరం మసాలా, పసుపు, సరిపడా ఉప్పు వేసి పచ్చి వాసన పోయేలా 10 నిమిషాల పాటు మూత పెట్టి మరిగించాలి.

-గ్రేవీ బాగా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి కలపాలి. ముక్కలకు గ్రేవీ పట్టేలా మరో 5 నిమిషాలు ఉడికించి, చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి దించేయండి. అంతే ఎంతో రుచికరమైన, ఘమఘమలాడే బంగాళాదుంప పనీర్ గ్రేవీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, December 6, 2025, 7:15 [IST]
Desktop Bottom Promotion