జింక్, కాల్షియం, విటమిన్ ఈ, ప్రొటీన్ పుష్కలంగా ఉండే లడ్డు ఇదే ..ఎలా చేసుకోవాలో చూడండి

Posted By:

నోటికి తీయగా ఏదైనా తినాలని ఉందా? కానీ బరువు పెరుగుతామనే భయమో, షుగర్ సమస్యతో వెనకడుగు వేస్తున్నారా? అయితే మీలాంటి వారి కోసమే ఒక అద్భుతమైన రెసిపీ ఉంది. తీపి అనగానే కేవలం పంచదార, బెల్లం మాత్రమే కాదు. ప్రకృతి సహజంగా ప్రసాదించిన ఎన్నో ఆరోగ్యకరమైన పదార్థాలతో మన తీపి కోరికలను ఎలాంటి అపరాధ భావం లేకుండా తీర్చుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే అలాంటి ఒక అద్భుతమే విటమిన్, ప్రోటీన్ లతో నిండిన డ్రై ఫ్రూట్స్ చనా సత్తు లడ్డూ.

విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఈ లడ్డూలో శరీరానికి అవసరమైన జింక్, కాల్షియం, విటమిన్ ఈ, ఫైబర్ మెండుగా లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్, రకరకాల గింజలు, సత్తు (వేయించిన శనగ పిండి)తో తయారు చేసే ఈ లడ్డూలు బరువు తగ్గాలనుకునే డైటర్లకు, షుగర్ పేషెంట్లకు ఒక వరమనే చెప్పాలి. ఇది తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు సరికదా, తక్షణ శక్తి అందుతుంది.

Sugar Free Weight Loss Friendly Nutritious Dry Fruits Chana Sattu Laddu Recipe in Telugu

డ్రై ఫ్రూట్స్ చనా సత్తు లడ్డూ తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేయండి. అందులో అర కప్పు చొప్పున గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, సన్నగా తరిగిన బాదం, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి దోరగా, సువాసన వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోండి. అదే పాన్ లో కొద్దిగా మఖానా వేసి సన్నని మంటపై కరకరలాడే వరకు వేయించుకోవాలి.

-వేయించి పెట్టుకున్న గింజలు, డ్రై ఫ్రూట్స్, మఖానా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సహజమైన తీపి కోసం అర కప్పు గింజ తీసిన ఖర్జూరాలను వేసి, మిగిలిన పదార్థాలతో బాగా కలిసేలా మరోసారి మిక్సీ పట్టుకోవాలి.

చలికాలంలో మాత్రమే దొరికే లక్నో ఫేమస్ మఖన్ మలై.. మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..

-ఇప్పుడు పాన్ లో ఒక కప్పు కంటే కొంచెం తక్కువ నెయ్యి వేడి చేసి, అందులో 2 కప్పుల శనగ సత్తు (వేయించిన శనగల పిండి) వేసి సన్నని మంట మీద వేయించండి. సత్తు పిండి ఇప్పటికే వేయించిన శనగలతో తయారవుతుంది కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన పనిలేదు. కాసేపటికి మిశ్రమం కొద్దిగా పల్చబడి కమ్మటి వాసన రాగానే స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.

-ఈ సత్తు మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు, ముందుగా మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాల పొడిని ఇందులో కలపాలి. మంచి సువాసన, రుచి కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా జతచేసి, చేత్తో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మీకు కావలసిన సైజులో గుండ్రంగా లడ్డూలు చుట్టుకోవాలి.

-ఎంతో రుచికరమైన, పోషక విలువలతో కూడిన డ్రై ఫ్రూట్స్ చనా సత్తు లడ్డు రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, November 11, 2026, 9:58 [IST]
Desktop Bottom Promotion