నోరూరించే పచ్చి మామిడికాయ టమాటా పచ్చడి..అన్నం,దోశ,చపాతీ దేనిలోకైనా అమృతమే!

Posted By:

వేసవి కాలం రాగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మండుతున్న ఎండలు.. ఆ తర్వాత నోరూరించే మామిడి పండ్లు. ప్రస్తుతం మార్కెట్లోకి వెళితే ఎక్కడ చూసినా లేత, పచ్చి మామిడికాయలు విరివిగా కనిపిస్తున్నాయి. పచ్చి మామిడితో పప్పు, పులిహోర, నిల్వ పచ్చళ్లు ఇలా ఎన్నో రకాల వంటకాలు చేస్తుంటాం.

అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక అద్భుతమైన రెసిపీని పచ్చి మామిడికాయ టమాటా చట్నీ ఓసారి ట్రై చేయండి. పుల్లపుల్లగా, కారంకారంగా ఉండే ఈ చట్నీని ఒక్కసారి రుచి చూశారంటే.. ప్రతిరోజూ ఇదే కావాలంటారు.

Summer Special Raw Mango Tomato Chutney Recipe in Telugu Perfect Side Dish for Rice Roti Dosa

పచ్చి మామిడికాయ టమాటా చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు

పచ్చి మామిడికాయ - 1
టమాటా - 1
వెల్లుల్లి రెబ్బలు - 7
పచ్చిమిర్చి - 3
ఉల్లిపాయ - 1
కారం పొడి - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
చాట్ మసాలా - 1 టీస్పూన్
వంట నూనె - 1-2 టేబుల్ స్పూన్లు
తాజా కొత్తిమీర - కొద్దిగా

పచ్చి మామిడికాయ టమాటా చట్నీ తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ లేదా కడాయి పెట్టుకుని, అందులో రెండు చెంచాల నూనె వేసి వేడి చేయాలి.

-నూనె కొద్దిగా వేడెక్కాక అందులో రెండు ముక్కలుగా కోసిన పచ్చి మామిడికాయను, అలాగే రెండు ముక్కలుగా కోసిన ఒక టమాటాను వేయాలి. వీటితో పాటే పొట్టు తీసిన 6-7 వెల్లుల్లి రెబ్బలు, 3-4 పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. మంటను తక్కువగా ఉంచి, ఈ పదార్థాలన్నీ మంచి బంగారు రంగులోకి మారి, లోపల మెత్తబడే వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.

-ఇవన్నీ బాగా వేగి మెత్తగా మారిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ఇవి కాస్త చల్లారాక మామిడికాయ ముక్కల నుండి గట్టి తొక్కను, టెంకను తీసేసి లోపల ఉన్న గుజ్జును మాత్రమే తీసుకోవాలి. అలాగే వేగిన టమాటా పైనున్న సన్నటి పొట్టును కూడా వలిచేయాలి.

-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం వేయించి పెట్టుకున్న మామిడికాయ గుజ్జు, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేయాలి. వీటికి అదనంగా కారం పొడి, తగినంత ఉప్పు, చాట్ మసాలా, సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కడిగిన తాజా కొత్తిమీర జతచేయాలి. వీటన్నింటినీ మిక్సీలో మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా, కొంచెం బరకగా (కచ్చాపచ్చాగా) గ్రైండ్ చేసుకోవాలి.

-మీకు పల్లెటూరి రుచి కావాలంటే.. మిక్సీకి బదులుగా రోలు, రోకలి వాడి దంచితే ఈ పచ్చడి రుచి అమృతంలా ఉంటుంది.

-అంతే ఎంతో ఘుమఘుమలాడే, నోరూరించే పచ్చి మామిడికాయ టమాటా చట్నీ రెడీ. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని, పప్పుతో పాటు ఈ చట్నీని కలుపుకుని తింటే ఆ మజాయే వేరు. అలాగే రోటీ, చపాతీ, దోశల్లోకి కూడా ఇది అదిరిపోయే సైడ్ డిష్‌గా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, April 8, 2026, 14:02 [IST]
Desktop Bottom Promotion