మైసూర్ స్పెషల్ పల్లీ కొబ్బరి చట్నీ..ఈ చట్నీ చేస్తే ఇడ్లీ, దోశలు ఎన్ని తింటారో మీకే తెలీదు!

Posted By:

బ్రేక్‌ ఫాస్ట్‌ లో వేడివేడి ఇడ్లీలు లేదా కరకరలాడే దోశలు వేసుకోవడం మనందరి ఇళ్లలో సాధారణంగా జరిగే పనే. ఆ అల్పాహారం ఎంత రుచిగా ఉన్నా, అందులోకి సరైన చట్నీ లేకపోతే ఆ మజానే రాదు. అయితే, ఎప్పుడూ ఇంట్లో రొటీన్‌గా చేసుకునే పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ, లేదా టమాటా చట్నీలు తిని తిని మీకు విసుగొచ్చేసిందా? అయితే ఓసారి మైసూర్ స్పెషల్ పల్లీ కొబ్బరి చట్నీ ట్రై చేయాల్సిందే.

సాధారణంగా మనం చేసుకునే చట్నీల కంటే ఈ మైసూరు శైలి చట్నీ రుచిలో చాలా భిన్నంగా ఉంటుంది. కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో ఈ చట్నీ చాలా ఫేమస్.

Taste of Karnataka How to Make the Perfect Mysore Style Peanut Coconut Chutney Recipe in Telugu

మైసూర్ స్పెషల్ పల్లీ కొబ్బరి చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు

వేరుశెనగలు (పల్లీలు) - 1/2 కప్పు
మినపపప్పు - 1 టేబుల్ స్పూన్
వంట నూనె - 2 టేబుల్ స్పూన్లు
కాశ్మీరీ ఎండుమిర్చి - 5 (చట్నీకి మంచి రంగు వస్తుంది)
బెల్లం పొడి - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 3
చింతపండు గుజ్జు లేదా రసం - 1/2 టేబుల్ స్పూన్
మిరియాలు - 4
పచ్చి కొబ్బరి తురుము - 3/4 కప్పు
కారం - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - మీ రుచికి తగినంత

మైసూర్ స్పెషల్ పల్లీ కొబ్బరి చట్నీ తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మందపాటి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి.

-నూనె కాస్త వేడెక్కాక అందులో పల్లీలు (వేరుశెనగలు), మినపపప్పు వేసి మీడియం మంటపై దోరగా వేయించండి. తర్వాత కశ్మీరీ ఎండుమిర్చిని వేసి మరో రెండు నిమిషాల పాటు మాడిపోకుండా వేయించాలి. తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, కొద్దిగా చింతపండు రసం, బెల్లం పొడి వేసి మరో నిమిషం పాటు సన్నని మంటపై ఉడికించండి. బెల్లం, చింతపండు కలయిక వల్ల చట్నీకి ఆ అద్భుతమైన మైసూరు స్పెషల్ రుచి వస్తుంది.

-చివరిగా అందులో పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుతూ మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.

-తర్వాత ఒక మిక్సీ జార్‌ తీసుకుని అందులో చల్లారిన మిశ్రమాన్ని వేసి, సుమారు ఒక కప్పు నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి.

-అంతే... ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే మైసూర్ చట్నీ రెడీ.

-ఈ చట్నీని మీరు నేరుగా అలాగే వేడివేడి ఇడ్లీ లేదా దోశతో ఆస్వాదించవచ్చు. మీకు ఘాటుగా, మరింత రుచిగా కావాలనుకుంటే.. కొద్దిగా నూనెలో ఆవాలు, మినపపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కమ్మని తాలింపు పెట్టుకుంటే దీని రుచి అమాంతం పెరిగిపోతుంది. ఈ చట్నీని ఫ్రిజ్‌ లో పెడితే రెండు రోజుల పాటు తాజాగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, March 26, 2026, 8:00 [IST]
Desktop Bottom Promotion