రైస్ పొటాటో ఊతప్పం..ఇంతకుముందు తిన్న ఊతప్పం రుచులన్నీ మర్చిపోతారు!

Posted By:

అందరికీ ఇష్టమైన, ఆరోగ్యకరమైన, త్వరగా పూర్తయ్యే బ్రేక్ ఫాస్ట్ లలో ఊతప్పం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఉల్లిపాయ ఊతప్పం, మసాలా ఊతప్పం, టొమాటో ఊతప్పం, రవ్వ ఊతప్పం.. ఇలా ఇందులో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ రుచిలో అద్భుతంగా ఉంటాయి. అయితే రెగ్యులర్ ఊతప్పం బోర్ కొట్టి, ఏదైనా కొత్తగా, స్పెషల్ గా ట్రై చేయాలనుకుంటున్నారా?

అయితే రైస్ పొటాటో ఊతప్పం ఓసారి ట్రై చేయాల్సిందే. ఇది తిన్న తర్వాత మీరు ఇంతకు ముందు తిన్న ఊతప్పం రుచులన్నీ మర్చిపోతారు. ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్ ఈ సరికొత్త రెసిపీని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అభిమానులతో పంచుకున్నారు.

Tired of Regular Uthappam Try this Crispy Rice Potato Uthappam Healthy Breakfast Recipe in Telugu

రైస్ పొటాటో ఊతప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు

బియ్యప్పిండి : 1 కప్పు
ఉడికించి మెత్తగా చేసిన బంగాళదుంప : ముప్పావు కప్పు
నీళ్లు : ఒకటిన్నర కప్పులు
ఉప్పు : రుచికి సరిపడా
ఉల్లిపాయ ముక్కలు : పావు కప్పు
టొమాటో ముక్కలు : పావు కప్పు
పచ్చ క్యాప్సికమ్ : పావు కప్పు
తురిమిన క్యారెట్ : అర కప్పు
ఎర్ర క్యాప్సికమ్ : 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి : 2 టీస్పూన్లు
అల్లం : అర టీస్పూన్
మిరియాల పొడి : చిటికెడు
కరివేపాకు : అర టేబుల్ స్పూన్
కొత్తిమీర : పావు కప్పు
ఈనో ఫ్రూట్ సాల్ట్ : 3 టేబుల్ స్పూన్లు
నూనె : కాల్చుకోవడానికి సరిపడా

రైస్ పొటాటో ఊతప్పం తయారీ విధానం

-ముందుగా ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు బియ్యప్పిండి, ఉడికించి మెత్తగా మ్యాష్ చేసిన బంగాళదుంపల మిశ్రమం, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఈ పిండి మరీ నీళ్లలా కాకుండా, కొద్దిగా చిక్కటి బ్యాటర్ లా ఉండేలా చూసుకోండి. తయారైన ఈ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి.

-ఆ గిన్నెలో ఉన్న పిండిలో మీ రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చ- ఎర్ర క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు, కొత్తిమీర, చిటికెడు మిరియాల పొడి వేసి పిండిని బాగా కలపండి. ఈ కూరగాయలన్నీ పిండిలో బాగా కలిసిపోయేలా గరిటెతో తిప్పండి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి మీడియం మంట మీద వేడి చేయండి. పెనం వేడెక్కాక కొద్దిగా నూనె రాసి గ్రీజ్ చేయండి. ఊతప్పం వేసే ముందు పిండిలో ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి ఒకసారి సున్నితంగా కలపండి, దీనివల్ల ఊతప్పం చాలా సాఫ్ట్ గా, ప్లఫ్ఫీగా వస్తుంది.

-ఇప్పుడు గరిటెతో నిండుగా పిండిని తీసుకుని పెనం మధ్యలో పోసి, మరీ పలచగా కాకుండా, కొద్దిగా మందంగా గుండ్రంగా స్ప్రెడ్ చేయండి.

-ఊతప్పం చుట్టూ కొద్దిగా నూనె వేసి, రెండు వైపులా అంచులు అద్భుతమైన బంగారు రంగులోకి మారేంత వరకు మీడియం మంట మీద దోరగా కాల్చుకోండి. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా మరోవైపుకు తిప్పి జాగ్రత్తగా కాల్చుకోండి.

-అంతే ఎంతో రుచికరమైన, వేడి వేడి రైస్ పొటాటో ఊతప్పం రెడీ. ఈ నోరూరించే ఊతప్పంను మీకు ఇష్టమైన గ్రీన్ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా టొమాటో సాస్ తో కలిపి తింటే ఆ మజానే వేరు.

[ of 5 - Users]
Story first published: Thursday, April 2, 2026, 8:06 [IST]
Desktop Bottom Promotion