పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే!

Posted By:

పండుగలొచ్చినా లేదా ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినా ముందుగా మనకు గుర్తుకొచ్చేది పాయసం. పండుగల వేళ కుటంబసభ్యుల కోసం, ఇంటికి చుట్టాలు వస్తే వారికి పాయసం చేసి పెట్టడం ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. అయితే చాలామంది చక్కెరతో పాయసం తయారుచేస్తుంటారు. అయితే అనేక అనారోగ్య సమస్యలు పెరుగుతున్న క్రమంలో క్రమంగా చక్కెరను దూరం పెడుతున్నారు. చక్కెరకు బదులుగా తీపి కోసం బెల్లం వాడుతున్నారు.

అయితే బెల్లంతో ఒక్కసారి పాయసం చేస్తే వాసనకే మీకు కడుపు నిండిపోతుంది. తినడం మొదలుపెట్టారంటే ఒక్క కప్పుతో ఆగరు. భలే ఉంది ఇంకొంచెం ఇంకొంచెం అనుకుంటూ మొత్తం ఖాళీ చేసేయడం గ్యారెంటీ. అయితే బెల్లంతో పాయసం తయారీలో చాలామందికి వచ్చే సమస్య ఏంటంటే..బెల్లం వేయడానే పాలు విరిగిపోటం. అందుకే చాలామంది బెల్లం పాయసం చేయడానికి ఆలోచిస్తారు. అయితే పాలు అస్సలు విరగకుండా, కమ్మటి రుచితో బెల్లం పాయసం ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Traditional Sweet Bellam Payasam Recipe Without Milk Curdling

కావాల్సిన పదార్థాలు

ఫుల్ క్రీమ్ పాలు - 1 లీటరు
బాస్మతి లేదా సాధారణ బియ్యం - 50 గ్రాములు
తురిమిన బెల్లం - 100 నుండి 120 గ్రాములు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
యాలకుల పొడి - అర టీస్పూన్
సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్- తగినన్ని

పాలు విరగకుండా ఉండాలంటే అసలు రహస్యం ఇదే
బెల్లంలో సహజంగానే కొద్దిగా ఆమ్ల గుణం (యాసిడ్ నేచర్) ఉంటుంది. అందుకే మరుగుతున్న పాలలో నేరుగా బెల్లం వేస్తే పాలు వెంటనే విరిగిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే.. ఒక చిన్న గిన్నెలో బెల్లం తురుము వేసి, అందులో 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి సన్నని మంటపై కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగి పల్చటి పాకంలా మారాక, స్టవ్ ఆపేసి ఆ పాకాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పాయసం తయారయ్యాక, వేడి తగ్గిన తర్వాత ఈ చల్లారిన పాకాన్ని కలపడమే అసలు కిటుకు.

పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!

బెల్లం పాయసం తయారీ విధానం

-ముందుగా బాస్మతి బియ్యం లేదా సాధారణ బియ్యంని అరగంట సేపు నీటిలో నానబెట్టుకోవాలి.

-తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి అడుగు ఉన్న గిన్నెను స్టవ్ మీద ఉంచి,అందులో కొద్దిగా నెయ్యి వేడి చేయండి. నెయ్యి వేడెక్కాక అందులో జీడిపప్పు, బాదం, పిస్తా వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు అదే గిన్నెలో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒక్క నిమిషం పాటు సన్నని మంటపై వేయించండి.

-వేయించిన బియ్యంలో ఫుల్ క్రీమ్ పాలు పోసి, మంటను కొద్దిగా పెంచి మరిగించండి. పాలు ఒక పొంగు వచ్చాక, మంటను పూర్తిగా తగ్గించి నెమ్మదిగా ఉడకనివ్వండి. బియ్యం అడుగు అంటకుండా మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి.

-పాలు సగానికి ఇగిరిపోయి, బియ్యం మెత్తగా క్రీమ్‌ లా ఉడికిన తర్వాత.. యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపండి.

-బియ్యం పూర్తిగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేయండి. వేడి కొద్దిగా తగ్గిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న చల్లటి బెల్లం పాకాన్ని ఇందులో పోసి కలపండి.

-అంతే ఎంతో రుచికరమైన, కమ్మటి బెల్లం పాయసం రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, September 26, 2026, 16:10 [IST]
Desktop Bottom Promotion