ఉగాది 2026-27 రాశి ఫలాలు..పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశికి రాజయోగం? ఏ రాశికి అవమానం?

దేశవ్యాప్తంగా ఇవాళ(మార్చి 19)ఉగాది సంబరాలు మొదలయ్యాయి. ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. కాలగమనంలో ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. 2026-2027 సంవత్సరానికి పరాభవ నామ సంవత్సరం అని పేరు. పరాభవ అనగా ఓటమి లేదా అవమానం అని అర్థం వస్తుంది. అయితే ఇది కేవలం పేరు మాత్రమే, గ్రహస్థితులను బట్టి రాశుల ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో నవగ్రహాల సంచారం, గురు, శని, రాహు-కేతువుల గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల ఆదాయ-వ్యయాలు, రాజపూజ్య-అవమానాలు, సమగ్ర వార్షిక ఫలితాలు ఇక్కడ చూడండి.

Ugadi 2026 Panchangam Parabhava Nama Samvatsaram Complete Yearly Horoscope for All 12 Zodiac Signs

మేష రాశి
ఆదాయం-11, వ్యయం-05..రాజపూజ్యం-02, అవమానం-04

కుజుడు అధిపతిగా ఉండే మేష రాశి వారికి ఈ ఉగాది గతాన్ని మించిన అద్భుతాలను అందించబోతోంది. గురు గ్రహ అనుగ్రహంతో మార్చి నుంచి మీ జీవితంలో శుభ ఫలితాలు మొగ్గతొడుగుతాయి. ముఖ్యంగా మే 31 తర్వాత నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ యోగం, కొత్తగా పెళ్లైన వారికి అక్టోబర్-డిసెంబర్ మధ్య సంతాన భాగ్యం కలుగుతుంది.

శని 12వ స్థానంలో ఉండటం వల్ల ధనార్జన కోసం కాస్త శ్రమించాలి. అయితే గురు, రాహువుల మద్దతుతో మీ ఆదాయం కచ్చితంగా పెరుగుతుంది. పొదుపు విషయంలో జాగ్రత్త అవసరం. జూన్ 2 వరకు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఏలినాటి శని మొదటి దశ ప్రభావం వల్ల కోర్టు కేసులు, కార్యాలయాల్లో చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. నిద్రలేమి, కీళ్ల నొప్పులు బాధిస్తాయి.

వృషభ రాశి
ఆదాయం-05, వ్యయం-14..రాజపూజ్యం-05, అవమానం-04

శుక్రుని ఆధిపత్యం ఉండే ఈ రాశి విద్యార్థులకు, యువతకు ఈ ఏడాది ఒక స్వర్ణయుగం లాంటిది. రోహిణీ నక్షత్ర జాతకులకు కొత్త వాహన యోగం కూడా ఉంది. జూన్ 2వ తేదీ వరకు గురుడు లాభ స్థానంలో ఉండి ఆదాయాన్ని పెంచుతాడు. ఆ తర్వాత ఖర్చులు అదుపు తప్పుతాయి. శని బలమైన స్థానంలో ఉండటం వల్ల రాజకీయ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకున్న పనులు నెరవేరి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కుటుంబంలో సామరస్యం వెల్లివిరుస్తుంది. అక్టోబర్ తర్వాత గృహ వాతావరణం మరింత ప్రశాంతంగా మారుతుంది. 12 ఏళ్ల లోపు పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. యోగా, ధ్యానం మేలు చేస్తాయి.

మిథున రాశి
ఆదాయం-08, వ్యయం-11..రాజపూజ్యం-01, అవమానం-07

బుధుడు అధిపతిగా ఉండే మిథున రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అవివాహితులకు కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. శని దేవుని సంపూర్ణ అనుగ్రహంతో రాజకీయాల్లో మంచి పదవులు, సమాజంలో గౌరవం లభిస్తాయి.

జూన్ 2 వరకు ఖర్చులున్నా, ఆ తర్వాత రాహు-కేతువుల అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుంది. జూన్ తర్వాత విద్యార్థులకు మంచి సమయం. డిసెంబర్ తర్వాత కుటుంబంలో చిన్నపాటి కలతలు రావచ్చు. సరైన ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది.

కర్కాటక రాశి
ఆదాయం-02, వ్యయం-11..రాజపూజ్యం-04, అవమానం-07

చంద్రుని ప్రభావం ఉండే ఈ రాశివారికి గురు బలం అద్భుతంగా ఉంది. ధర్మకార్యాలు చేస్తారు. జూన్ 2 వరకు గురుడు లాభ స్థానంలో ఉండటం వల్ల పాత బకాయిలు వసూలవుతాయి. ఊహించని ధనలాభం కలుగుతుంది. అయితే శని ప్రభావం వల్ల పనుల్లో ఆటంకాలు, వ్యాపార పెట్టుబడుల్లో (ముఖ్యంగా ఏప్రిల్ నెలలో) జాగ్రత్త వహించడం మంచిది.

కుటుంబ పెద్దల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. రాహువు ప్రభావం వల్ల శత్రు బాధలు, అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. విదేశీ విద్యను అభ్యసించే వారికి లాభిస్తుంది.

సింహ రాశి
ఆదాయం-05, వ్యయం-05..రాజపూజ్యం-07, అవమానం-07

సూర్య భగవానుడి ప్రాబల్యం ఉండే సింహ రాశి వారికి గురు గ్రహ ప్రభావం వల్ల మే 31 వరకు న్యాయపరమైన ఆదాయం పెరుగుతుంది. కెరీర్‌ లో గొప్ప పురోగతి సాధిస్తారు. జూన్ 2 వరకు మీరు వేసే ప్రతి అడుగు విజయతీరాలకు చేరుస్తుంది. ఆ తర్వాత ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులకు శుక్రుని బలం వల్ల అనుకూలతలున్నా, రాహు-కేతువుల ప్రభావంతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు గందరగోళం ఏర్పడుతుంది.

శని ప్రభావంతో వైవాహిక జీవితంలో చిన్నపాటి ఘర్షణలు, శత్రువుల నుంచి ఆటంకాలు వస్తాయి. మానసిక ప్రశాంతత కోసం యోగా అవసరం. ప్రేమ వ్యవహారాలు పెళ్లి పీటలు ఎక్కుతాయి.

కన్య రాశి
ఆదాయం-08, వ్యయం-11.. రాజపూజ్యం-03, అవమానం-03

బుధుని సొంత రాశి కన్య. వీరికి మే 21 వరకు అన్ని భౌతిక సుఖాలు అందుతాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు ఇది స్వర్ణకాలం. వ్యాపారులకు జూన్ నుంచి అక్టోబర్ వరకు పదకొండో స్థానంలో గురుడి సంచారం అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. విదేశీ యానానికి, నిర్మాణ రంగ కాంట్రాక్టులకు అనుకూల సమయం. సప్తమ స్థానంలో శని వల్ల వైవాహిక జీవితంలో సర్దుబాట్లు అవసరం. విదేశీ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. బుధ గ్రహ సంచారం వల్ల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

తుల రాశి
ఆదాయం-05, వ్యయం-14 | రాజపూజ్యం-06, అవమానం-03

శుక్రుని ఆధిపత్యం ఉండే ఈ రాశి వారికి రాహువు మినహా శని, గురు, కేతు గ్రహాలు అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తున్నాయి. కేతువు, శని లాభ స్థానాల్లో ఉండటం వల్ల ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. యువతకు కొలువులు, రాజకీయ నాయకులకు పదవులు వరిస్తాయి. నవంబర్ తర్వాత వ్యాపారంలో తిరుగులేని విజయాలు సాధిస్తారు. శుక్రుని అనుగ్రహంతో ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. అయితే రాహువు పంచమ స్థానంలో ఉన్నందున గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు.

వృశ్చిక రాశి
ఆదాయం-11, వ్యయం-05.. రాజపూజ్యం-02, అవమానం-06

జూన్ తర్వాత ఈ రాశి వారి జీవితం ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా సాగుతుంది. గురువు భాగ్య స్థానంలోకి ప్రవేశించడం వల్ల అదృష్టం తలుపు తడుతుంది. విదేశీ ఉద్యోగాల కోసం చూస్తున్న వారి కల నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా మారతాయి.

తండ్రి వైపు ఆస్తి కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. బంధువుల గురించిన ఒక చెడు వార్త మినహా మిగతా అంతా ప్రశాంతంగా ఉంటుంది. దాంపత్య జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది, మంచి సంబంధం కుదురుతుంది.

Ugadi 2026 Panchangam Parabhava Nama Samvatsaram Complete Yearly Horoscope for All 12 Zodiac Signs

ధనుస్సు రాశి
ఆదాయం-14, వ్యయం-11..రాజపూజ్యం-05, అవమానం-06

రాశ్యాధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం పటాపంచలైపోతుంది. అన్ని రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లాభిస్తాయి. జూలై, ఆగస్టు నెలల్లో మాత్రం వృథా ఖర్చుల పట్ల పగ్గాలు వేయాలి. కేతువు వల్ల విదేశీ యోగం ప్రాప్తిస్తుంది. కుటుంబంలో పెళ్లి భాజాలు మోగుతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.

మకర రాశి

ఆదాయం-02, వ్యయం-08..రాజపూజ్యం-01, అవమానం-02

జూన్ నుంచి మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలోకి చేరడంతో మహర్దశ పడుతుంది. మీరు ఒక వెలుగు వెలుగుతారు. కుజ, శుక్రుల అనుగ్రహంతో ఆర్థిక స్థిరత్వం వస్తుంది. విదేశీ ఉద్యోగ అవకాశాలు మీ ఇంటి తలుపు తడతాయి. గురు మార్పు తర్వాత అదృష్టం వరిస్తుంది, సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వైవాహిక జీవితంలో చిన్నపాటి అపార్థాలు రాకుండా చూసుకోవాలి. పిల్లలు ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్తారు. గృహ, వాహన సౌకర్యాలు మెరుగుపడతాయి.

కుంభ రాశి
ఆదాయం-02, వ్యయం-08.. రాజపూజ్యం-04, అవమానం-02

ఏలినాటి శని ప్రభావం కొనసాగుతున్నప్పటికీ, గురు, ఇతర గ్రహాల మద్దతుతో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆదాయం బాగున్నా ఖర్చులు చికాకు పెడతాయి. ఎవరికీ హామీలు ఇవ్వొద్దు, అప్పులు ఇవ్వొద్దు. వృత్తిలో అదనపు బాధ్యతలు విశ్రాంతిని దూరం చేస్తాయి. రాజకీయ నాయకులకు మాత్రం అనుకూల సమయం. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తండ్రి సహకారంతో ఆస్తి వివాదాలు తీరతాయి. ప్రేమ వ్యవహారాల్లో నెమ్మదించడం మంచిది.

మీన రాశి
ఆదాయం-14, వ్యయం-11.. రాజపూజ్యం-07, అవమానం-02

ఏలినాటి శని తీవ్రత ఉన్నా, జూన్ తర్వాత మీ జీవితం పూలపాన్పులా మారబోతోంది. గ్రహాలు మీకు సానుకూల ఫలితాలను అందించడానికి సిద్ధమవుతున్నాయి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ఉద్యోగంలో మీ నైపుణ్యాలకు అధికారుల నుంచి ప్రశంసలు, ప్రమోషన్లు అందుతాయి.

సలహాలు ఇచ్చే స్థానానికి ఎదుగుతారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. జూన్ వరకు ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించండి. పెళ్లి ప్రయత్నాలు సునాయాసంగా సఫలమవుతాయి.

Disclaimer: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మతవిశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాల ఆధారంగా ఇవ్వబడిన ఈ సమాచారంకి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిత్వం. బోల్డ్ స్కై తెలుగు పై సమాచారాన్ని ధృవీకరించడం లేదు.

Desktop Bottom Promotion