వర్క్ ఫ్రమ్ హోం జాబ్ కావాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..!

కరోనా వైరస్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్(WFH) అనేది మన జీవితాల్లో విడదీయరాని భాగంగా మారిపోయింది. నిత్యం ఎదుర్కొనే ట్రాఫిక్ కష్టాలు, ప్రయాణ బడలిక తప్పడంతో ఉద్యోగులు ఈ విధానానికి బాగా అలవాటు పడిపోయారు. ఇది ఎంతలా ఉందంటే.. ఇంట్లో కూర్చుని పనిచేసే సౌలభ్యం కోసం తమ జీతంలో కోత విధించినా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనే వారు ఎందరో ఉన్నారు.

Escaped the Traffic Caught in Isolation The Dark Side of Work From Home

కానీ మీకు ఎంతో సౌకర్యంగా అనిపించే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మిమ్మల్ని మెల్లగా ఒంటరితనం, ఆందోళన, డిప్రెషన్ వైపు నెట్టేస్తోందని మీకు తెలుసా? తాజాగా ప్రసిద్ధ సైన్స్ జర్నల్‌ లో ప్రచురితమైన ఒక పరిశోధన.. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఎన్నో ఆందోళనకరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆర్థికవేత్త నటాలియా ఇమాన్యుయెల్ బృందం అమెరికాలోని ఐదు పెద్ద జాతీయ సర్వేల డేటాను విశ్లేషించి ఈ అధ్యయనాన్ని రూపొందించారు.

ఐటీ, సాఫ్ట్‌ వేర్ లాంటి రిమోట్ ఉద్యోగాలు చేసేవారిలో.. ఇంటి నుండి పనిచేసేటప్పుడు ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయని వారు గుర్తించారు. వీరు యాంటీ డిప్రెసెంట్ మందులు వాడటం కూడా గణనీయంగా పెరిగింది.

పెరుగుతున్న ఒంటరితనం.. భయపెడుతున్న గణాంకాలు
ఆఫీసు వాతావరణానికి, తోటి ఉద్యోగులకు దూరంగా ఉండటం వల్ల రిమోట్ ఉద్యోగులు ఒంటరిగా గడిపే సమయం ఏకంగా 58 శాతం పెరిగింది. మరీ దారుణమైన విషయం ఏమిటంటే.. రోజంతా ఒక్క మనిషితో కూడా కనీసం ముఖాముఖి మాట్లాడకుండా గడిపే అవకాశాలు వీరిలో 72 శాతం పెరిగాయి. ఆఫీసులో కోల్పోయిన సామాజిక సంబంధాలను పని పూర్తయ్యాక సాయంత్రం స్నేహితులను కలవడం ద్వారానైనా భర్తీ చేసుకుంటున్నారా అంటే అదీ లేదు.

ఇక బ్యాచిలర్స్‌ గా, గదిలో ఒంటరిగా ఉంటూ పని చేసేవారి పరిస్థితి మరీ దయనీయం. కుటుంబంతో ఉండేవారితో పోలిస్తే వీరిలో మానసిక ఒత్తిడి దాదాపు రెట్టింపు ఉంటుందని, వీరు రోజంతా మరే ఇతర వ్యక్తితో మాట్లాడకపోవడానికి 83 శాతం అవకాశాలు ఉన్నాయని అధ్యయనం స్పష్టం చేసింది.

Escaped the Traffic Caught in Isolation The Dark Side of Work From Home

మనం ఎక్కడ పొరబడుతున్నాం?
చికాగో యూనివర్శిటీ ప్రొఫెసర్ నికోలస్ ఎప్లీ దీని గురించి వివరిస్తూ..ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులను మాత్రమే చూస్తున్నారు కానీ సహోద్యోగులతో కలవడం, నవ్వడం వల్ల భవిష్యత్తులో కలిగే మానసిక ప్రశాంతతను అంచనా వేయలేకపోతున్నారని అన్నారు. దీర్ఘకాలిక ఒంటరితనం కేవలం మనసునే కాదు, రోగనిరోధక శక్తిని తగ్గించి గుండె సంబంధిత సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో... నలుగురితో కలిసి నవ్వడం కూడా అంతే ముఖ్యం

పరిష్కారం ఏమిటి?
అలాగని అందరూ వెంటనే ఆఫీసులకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు రోజూ కాసేపు బయటకు వెళ్లడం, వాకింగ్ చేయడం, పొరుగువారితో చిన్నపాటి ముచ్చట్లు పెట్టడం, ఆటలు ఆడటం వంటి పనులు చేస్తే మానసిక ఉల్లాసం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే, కంపెనీలు కూడా ఉద్యోగులను బలవంతంగా ఆఫీసుకు రప్పించడం కంటే.. వారు ఆఫీసుకు వచ్చినప్పుడు తోటివారితో ఆనందంగా సంభాషించుకునేలా ఒక ఆహ్లాదకరమైన, స్వాగతించే వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టి పెట్టాలని చెబుున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, June 13, 2026, 8:43 [IST]
Desktop Bottom Promotion