వర్షాకాలంలో డయాబెటిస్‌ బాధితులకు ఇన్‌ఫెక్షన్‌ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.!

వర్షాకాలం మొదలవగానే వాతావరణం వేడి నుంచి ఉపశమనం కలిగించినా సీజనల్‌ వ్యాధులు, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు విపరీతంగా ప్రబలుతాయి. అయితే వీటితో పాటు మన ఆరోగ్యానికి ఇంకో ప్రమాదం ముంచి ఉంది. అదే డయాబెటిస్‌. ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వారికి వర్షాకాలంలో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.

Monsoon And Diabetes Why Infection Risk Increases During The Rainy Season

భారత్‌లో ఇప్పటికే ఎక్కువగా డయాబెటిస్‌ బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వర్షాకాలంలో తడిసిన బూట్లు, గాలిలో తేమ, రోడ్లపై బురదలో ఎక్కువ సేపు ఉండాల్సి రావడం.. ఫలితంగా ఇన్‌ఫెక్షన్‌ ముప్పు ఇంకా పెరుగుతుంది. కాలివేళ్ల మధ్య దురద, గాయం తగ్గడానికి సమయం ఎక్కువ తీసుకోవడం, యూరినరీ ఇన్‌ఫెక్షన్‌ ప్రబలడం. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. అధిక చక్కెర స్థాయిలు, వాతావరణంలో మార్పులు.. రెండీ శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా ఆస్పత్రుల్లో ఓపీడీల ప్రభావం పెరుగుతోంది.

మేకింగ్ ఇండియా విన్ ఓవర్ డయాబెటిస్ అనేది సన్ ఫార్మా సంస్థ.. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సహకారంతో చేపట్టిన ఒక అవగాహన కార్యక్రమం. వైద్య నిపుణుల సలహాలు, సూచనలతో కూడిన సరైన సమాచారాన్ని అందిస్తూ... భారతీయులు డయాబెటిస్ గురించి స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, దాన్ని రాకుండా నివారించడానికి, ఒకవేళ వచ్చినా దానిని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ

డయాబెటిస్‌ బాధితులపై వర్షాకాలం ప్రభావం ఎందుకు తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒకే సమయంలో జరిగే రెండు వేర్వేవు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి - ఇన్ఫెక్షన్‌తో పోరాడే శరీర సామర్థ్యం తగ్గిపోతుంది. మరొకటి - ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే పర్యావరణ పరిస్థితులు బలపడతాయి.

తగ్గిపోతున్న ఇమ్యూనిటీ పవర్‌

శరీరంలోని తెల్ల రక్త కణాలు(న్యూట్రోఫిల్స్‌) వ్యాధి కారకాన్ని గుర్తించి సంబంధిత బ్యాక్టీరియా, ఫంగస్‌తో నేరుగా పోరాడతాయి. అయితే మన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు న్యూట్రోఫిల్స్‌ స్పందించే తీరు మందగిస్తుంది. ఫ్రాంటియర్స్ ఇన్ ఇమ్యూనాలజీలో ప్రచురించిన ఒక సమీక్ష ప్రకారం.. నిరంతర హైపర్‌గ్లైసీమియా(హై షుగర్‌ లెవెల్స్‌) న్యూట్రోఫిల్స్‌ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. తెల్ల రక్త కణాల పనీతీరులో వైఫల్యం టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. డయాబెటిస్ లేని వారితో పోలిస్తే, ఉన్నవారిలో యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్ల ప్రమాదం రెట్టింపవుతుంది. ఇక, శస్త్రచికిత్స జరిగిన ప్రదేశంలో ఈ ప్రమాదం ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంటుంది. రక్తంలో బ్యాక్టీరియా చేరడం మూడు రెట్ల వరకూ పెరుగుతుంది.

యూరిన్‌లో బాక్టీరియా

సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు మూత్రపిండాలు తిరిగి గ్రహించే దాని కంటే మించినప్పుడు గ్లూకోజ్‌ మూత్రంలోకి విడుదలవతుంది. mSphere జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. మూత్రంలోని ఈ అదనపు గ్లూకోజ్ దాదాపు 80 శాతం మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. E. coli అనే బ్యాక్టీరియా యాక్టివ్‌గా మారి బయోఫిల్మ్‌లను ఏర్పరచుకుంటుంది. మూత్ర నాళంలో స్థిరపడి ఇన్‌ఫెక్షన్‌కి దారితీస్తుంది. ఇదే గ్లైకోసూరియా.

జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్‌ మరో పరిశోధన ప్రకారం.. కిడ్నీలను బ్యాక్టీరియా నుంచి రక్షించడంలో ఇన్సులిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఇన్సులిన్‌ లోపం కూడా మధుమేహానికి దారితీయడంతో ఇది నేరుగా యూరినరీ ఇన్‌ఫెక్షన్‌కి దారితీస్తుంది. రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోవడం, మధుమేహం కారణంగా బ్యాక్టీరియా పెరిగి మొత్తానికి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌కి దారితీస్తుంది.

దానిపైనే దృష్టి వద్దు

'డయాబెటిస్‌ బాధితులు చాలా వరకు షుగర్‌ లెవెల్స్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ వర్షాకాలంలో ఇన్‌ఫెక్షన్లను కూడా నివారిస్తేనే మధుమేహం అదుపులో ఉంటుంది. గ్లూకోజ్‌ లెవెల్స్‌ను సరిగ్గా నియంత్రిస్తేనే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. వర్షాకాలంలో పాదాలను పొడిగా ఉంచుకోవడం, చెప్పులు వేసుకుని నడవడం, గాయాలు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లకు ముందుగానే చికిత్స తీసుకోవడం వంటి సాధారణ చర్యల ద్వారా ఈ ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు.’

Dr. Adari Purnima, MBBS, DNB Family Medicine, Visakhapatnam

Monsoon And Diabetes Why Infection Risk Increases During The Rainy Season

ఎలా గుర్తించాలి..

అయితే వర్షాకాలం అయినంత మాత్రాన ఇన్‌ఫెక్షన్‌ దానంతట అదే వ్యాపించదు. ఫంగస్‌, బ్యాక్టీరియా పెరిగే వాతావరణం ఏర్పడినప్పుడు ఈ ప్రమాదం ఉంటుంది. తేమ, తడి చర్మంతో ఎక్కువ సేపు ఉండటం ఇన్‌ఫెక్షన్లకి కారణమవుతుంది. చెప్పులు, దుస్తులు ఎక్కువ సేపు తడిగా ఉన్నప్పుడు పాదాల పగుళ్లు, తామర, దురద వ్యాపిస్తాయి. చెమటలో పెరిగిన గ్లూకోజ్‌ లెవెల్స్‌ ఫంగస్‌ పెరుగుదలకు కారణమవుతాయి. అందుకే ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లకు డయాబెటిస్‌ ప్రధాన కారణంగా డెర్మటాలజిస్టు నిపుణులు చెబుతారు.

పాద సమస్యలు

వర్షాకాలంలో డయాబెటిస్‌ బాధితులను ఎక్కువగా వేధించే సమస్య పాద సమస్యలు. షుగర్‌ లెవెల్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల నరాలు దెబ్బతినడం, వరద నీటిలో నడుస్తున్నప్పుడు ఏర్పడే బొబ్బలు, రాపిడి, చిన్నచిన్న దెబ్బలను ముందుగా గమనించకపోతే ఇవి ఎక్కువవుతాయి. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, రోగ నిరోధక శక్తి తగ్గడం కారణంగా గాయాలు త్వరగా మానవు. ఇవి పుండ్లుగా మారి ఇన్‌ఫెక్షన్‌కి దారితీస్తాయి. మరోవైపు డయాబెటిస్‌ బాధితుల్లో గ్లైకోసూరియా(మూత్రంలో షుగర్‌ లెవెల్స్‌)తో పాటు ఇమ్యూనిటీ పవర్‌ తగ్గిపోవడం వల్ల యూరినరీ ఇన్‌ఫెక్షన్లకి దారితీస్తాయి. ఇది మూత్రపిండాలకు వ్యాపించే అవకాశమూ ఉంది. ఇదే ఫైలోనెప్రైటిస్.. దీని చికిత్స తీవ్రంగా ఉంటుంది.

ఫంగల్‌ సమస్యలు

డయాబెటిస్‌ అదుపులో లేనప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు మ్యూకోర్మైకోసిస్ వంటి తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. దేశంలో కొవిడ్‌- 19 సమయంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంది.

ఎలా తగ్గించుకోవాలి

వర్షాకాలంలో ఇంటాబయటా పనులు చూసుకుంటూనే కొన్ని అలవాట్లను పాటించడం ద్వారా ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుకోవచ్చు.

  • వర్షంలో తడిచినప్పుడు కాలివేళ్ల మధ్య భాగాన్ని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి.
  • తడి బూట్లను ఎక్కువ ధరించకుండా పాదరక్షలను మార్చడం మేలు చేస్తుంది.
  • మీ పాదాలను, ముఖ్యంగా అరికాళ్లను, కాలివేళ్ల మధ్య భాగాన్ని, పొడిగా ఉండేలా చూసుకోవాలి. గాయాలు, బొబ్బలు ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకండి.
  • చిన్న గాయాలు, పగుళ్లు, ఫంగస్ మచ్చలు వంటివి కనిపిస్తే చికిత్స తీసుకోండి.
  • రక్తంలో చక్కెర స్థాయిలను వీలైనంత వరకు సాధారణ స్థాయికి దగ్గరగా ఉండేలా చూసుకోండి. శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి గ్లూకోజ్ నియంత్రణలో ఉండాలి.
  • బాడీ ఎప్పుడూ హైడ్రేడెట్‌గా ఉండేలా చూసుకోండి. ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకోవద్దు. యూరిన్‌ ఆపుకోవడం ద్వారా బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంది.
  • వీలైనంత వరకు వరద నీటిలో చెప్పులు లేకండా నడవకండి.

డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి

వర్షాకాలంలో మధుమేహ రోగులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. గాయం వెచ్చగా ఉండటం, వాపు రావడం, చీము కారడం, స్కిన్‌ ఇన్‌ఫెక్షన్‌, మూత్ర సంబంధిత లక్షణాలతో పాటు జ్వరం రావడం, గాయాలు త్వరగా మానకపోవడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట, లేదా రక్తం పడటం వంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. మధుమేహం ఉన్నవారిలో, మొదట చిన్నవిగా కనిపించే ఇన్ఫెక్షన్లు తర్వాత ముదిరిపోతాయి. అందుకే ముందస్తు చికిత్స తప్పనిసరి.

ముగింపు

వర్షాకాలంలో మధుమేహం ఉన్నవారికి కొత్త ప్రమాదాలను సృష్టించడంతో పాటు.. ఇప్పటికే ఉన్న ప్రమాదాలను మరింత తీవ్రం చేస్తుంది. రోగనిరోధక శక్తి బలహీనపడటం, బ్యాక్టీరియాకు పెరగడానికి దోహదపడే పరిస్థితులు, పాదాల్లో స్పర్శజ్ఞానం తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఈ కాలంలో మీ పాదాలను పరీక్షించుకోవాలి. షుగర్‌ లెవెల్స్‌ను గమనించుకోవాలి. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు ముందుగానే చికిత్స చేయించుకోవడం అతి జాగ్రత్త కాదని గమనించాలి. ఈ జాగ్రత్తల ద్వారా మధుమేహం ఉన్న చాలా మందికి, చిన్న ఇన్ఫెక్షన్లు పెద్దదిగా మారకుండా కాపాడుతుంది. SPI-IN-CVD-ZT---08-20260337

Disclaimer: ఈ సమాచారం కేవలం రోగుల అవగాహన కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఇది ఏ రకంగానూ డాక్టర్ లేదా ఇతర ఆరోగ్య నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీ డాక్టర్‌ను సంప్రదించండి: మీరు మీ ఆరోగ్యం విషయంలో ఎల్లప్పుడూ మీ సొంత డాక్టర్ సలహాలను మాత్రమే తీసుకోవాలి, వాటిపైనే ఆధారపడాలి. 'సన్ ఫార్మాస్యూటికల్స్ లాబొరేటరీస్ లిమిటెడ్' (SPLL) ఈ సమాచారాన్ని ఖచ్చితంగా, సరైన సమయానికి అందించడానికి ప్రయత్నిస్తుంది, కానీ దీనికి ఎలాంటి హామీ ఇవ్వదు. సన్ ఫార్మాస్యూటికల్స్ లాబొరేటరీస్ లిమిటెడ్ (SPLL) ముందస్తు అనుమతి లేకుండా ఈ సమాచారంలోని ఏ భాగాన్ని కూడా ప్రింట్ రూపంలో కానీ, డిజిటల్ రూపంలో (మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో) కానీ కాపీ చేయడం, ఇతరులకు పంపడం లేదా భద్రపరచడం చేయకూడదు.

Desktop Bottom Promotion