చలికాలంలో పచ్చి బఠానీ ఎందుకు తినాలో తెలుసా?

చలికాలం అడుగుపెట్టగానే మార్కెట్లలో పచ్చని ముత్యాల్లాంటి తాజా బఠానీలు కనువిందు చేస్తాయి. పచ్చి బఠానీలతో నోరూరించే వంటకాలను ఎన్నో తయారు చేసుకోవచ్చు. సాధారణంగా చాలామంది బఠానీలను కేవలం ప్రోటీన్ వనరుగా మాత్రమే భావిస్తారు. కానీ వీటిని తినడం వల్ల మన శరీరానికి ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ప్రముఖ భారతీయ అమెరికన్ జీర్ణకోశ వైద్య నిపుణుడు(గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్) డాక్టర్ సౌరభ్ సేథి ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో వివరించారు.

పచ్చి బఠానీలతో అద్భుత ప్రయోజనాలు

జీర్ణక్రియకు మేలు చేసే పీచుపదార్థం: ఒక కప్పు ఉడికించిన బఠానీలలో దాదాపు 9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది రోజువారీ ఫైబర్ అవసరంలో సుమారు 31 శాతాన్ని భర్తీ చేస్తుంది. ఇందులో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉండటం వల్ల జీర్ణక్రియ క్రమబద్ధీకరించబడి, పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Surprising Health Benefits of Green Peas You Should Know This Winter

మీరు అనుకున్నదానికంటే ఎక్కువ ప్రోటీన్: కప్పు ఉడికించిన బఠానీలలో సుమారు 9 గ్రాముల ప్రోటీన్, 9 గ్రాముల ఫైబర్ లభిస్తాయి. ఈ అద్భుత కలయిక వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉండి, అనవసరపు ఆకలి వేయదు.

ఐరన్, విటమిన్ C శక్తి: కేవలం 100 గ్రాముల ఉడికించిన బఠానీలలో సుమారు 1.5 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. ఇందులో విటమిన్-సి కూడా ఉండటం వల్ల ఈ మొక్కల ఆధారిత ఐరన్ ను శరీరం సులభంగా గ్రహించడానికి తోడ్పడుతుంది.

పేగు మైక్రోబయోమ్‌ కు పోషణ: బఠానీలలోని ఫైబర్, పులియబెట్టగల కార్బోహైడ్రేట్లు పేగుల్లోని ప్రయోజనకరమైన మంచి బ్యాక్టీరియాను పోషిస్తాయి. ఈ పులియబెట్టే ప్రక్రియలో ఉత్పత్తయ్యే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యకరమైన పేగు వాతావరణాన్ని నిర్మిస్తాయి.

డీఎన్ఏ, కణాల పునరుద్ధరణ: వంద గ్రాముల వండిన బఠానీలలో సుమారు 63 మైక్రోగ్రాముల ఫోలేట్ (విటమిన్ బి9) ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన డీఎన్ఏ ఏర్పడటానికి, సాధారణ కణ విభజన జరిగి కణాలు పునరుద్ధరణ చెందడానికి ఎంతో అవసరం.

షుగర్ వ్యాధి వచ్చే ముందు కనబడే సంకేతాలు ఇవే!షుగర్ వ్యాధి వచ్చే ముందు కనబడే సంకేతాలు ఇవే!

బఠానీలను ఆరోగ్యకరంగా వండుకునే చిట్కాలు

-వండిన బఠానీలపై కొద్దిగా నిమ్మరసం పిండుకోండి. ఇది శరీరానికి విటమిన్ C అందించి, మొక్కల నుండి వచ్చే ఐరన్‌ ను మెరుగ్గా గ్రహించడానికి సహాయపడుతుంది.

-బఠానీలలోని విటమిన్లు నశించకుండా కాపాడుకోవాలంటే వాటిని ఎక్కువ సేపు ఉడకబెట్టకండి. బదులుగా ఆవిరిపై లేదా మైక్రోవేవ్‌ లో వండటం ఉత్తమమైన పద్ధతి.

-బఠానీలను తృణధాన్యాలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి వివిధ రకాల అమైనో ఆమ్లాలతో పాటు అదనపు పీచుపదార్థం కూడా లభిస్తుంది.

చాలామందికి తెలియని ముఖ్యమైన విషయం

బఠానీలలో ఉండే పులియబెట్టగల కార్బోహైడ్రేట్లు కొందరిలో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి అసౌకర్యానికి దారితీస్తాయి. ముఖ్యంగా సున్నితమైన ప్రేగులు లేదా ఐబీఎస్ సమస్య ఉన్నవారిలో ఈ ఇబ్బంది ఎక్కువగా కనిపించవచ్చు. అందుకే మొదట తక్కువ పరిమాణంతో తినడం ప్రారంభించి, మీ శరీరం అలవాటు పడిన తర్వాత క్రమంగా మోతాదును పెంచుకోవడం బెటర్.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Friday, November 13, 2026, 17:18 [IST]
Desktop Bottom Promotion