ధ్యానం నడిచిందా? ,,,,ఒత్తిడి గోవిందా!

By B N Sharma

Forms Of Meditation To Relieve Stress!
ఆనందం, తృప్తి వంటి భావనలు మనిషి మనిషికి మారుతూంటాయి. ధ్యానం లేదా మెడిటేషన్ లో ఏం జరుగుతుంది? మన ఆత్మకు జ్ఞానం లభిస్తుంది. అపుడు మనం మనకుగల పరిమితులు, సామర్ధ్యాలు ఏమిటనేది తెలుసుకోగలుగుతాం. ధ్యానం వలన లాభాలు అనేకం. మనలో దాగివున్న సామర్ధ్యాలను, నిగూఢంగా వున్న శక్తులను అది వెలికి తీస్తుంది. ఈ రకమైన పరిజ్ఞానం పొందటం మీరు మీ లోపలికి ప్రయాణించినపుడు, మంచి గుణాలు కలిగివున్నపుడే సాధ్యం అవుతుంది.

ధ్యానం తెలివినిస్తుంది, ధ్యానం చేయకపోతే, అంతా తెలియని స్ధితి. అభివృధ్ధి ఎలా? ప్రపంచం ఎలా నడుస్తోంది అనేవి తెలియాలంటే ధ్యానం చేయాలి అంటాడు గౌతమ బుద్ధుడు. మరి నేడు ప్రధానంగా వున్న ధ్యాన పద్ధతులు ఏమిటి అవి మన ఒత్తిడి తగ్గించటానికి ఎలా ఉపయోగిస్తాయి అనేది పరిశీలిద్దాం.

శ్వాస ధ్యానం - మీ వీపును సౌకర్యవంతంగాను, నిటారుగాను పెట్టి కూర్చోండి. కళ్ళు మూసుకోండి. తేలికగా శ్వాసను పీల్చండి. ఈ ధ్యాన పద్ధతిలో శ్వాస మీ ముక్కు రంధ్రాలలోకి ప్రవేశించటం మరియు బయటకు వదలటం మీరు గమనించాలి. దీనినే శ్వాస మీద ధ్యాస అంటారు. ఈ రకమైన శ్వాస ధ్యానాన్ని 15 నుండి 20 నిమిషాల పాటుచేస్తే చాలు మీలోని ఒత్తిడి గణనీయంగా తగ్గిపోతుంది.

మానసిక ధ్యానం - ఈ ధ్యాన ముఖ్య ఉద్దేశ్యం మైండ్ ను ప్రశాంతంగా, ఆహ్లాదంగా వుంచుకోవడం. ఇది మన మనసులోని వివిధ అంశాలను గట్టిపరుస్తుంది. ఏ శబ్దం లేని ప్రదేశంలో ధ్యానించండి. ముందుగా కొద్ది కొద్ది సమయాలతో మొదలు పెట్టండి. పది నిమిషాల చొప్పున రోజుకు రెండు సార్లు చేయండి. మన మనసు, శరీరం రెండు అనుసంధానించబడి శక్తి కలుగుతుంది. మన నమైండ్ ను పాజిటివ్ ఆలోచనలవైపు మళ్ళించాలి. ధ్యానించేటపుడు ఎంత ప్రధానమైన పని అయినా సరే వదిలేయండి.

ఊహా ధ్యానం - రోజుకు కనీసం 20 నుండి 30 నిమిషాల సమయాన్ని మీకై మీరు కేటాయించుకోండి. పూర్తి విశ్రాంతిలో వుండండి. ఆహ్లాదాన్నిచ్చే చిత్రాలు, బొమ్మలు, పెయింటింగ్ ల వంటివి చూస్తూ వుండండి. ఈ స్ధితిలో మీ మైండ్, శరీరం రెండూ హానికరమైన మలినాలను విసర్జించి మీ ఒత్తిడిని తగ్గిస్తాయి. విశ్రాంతినిస్తాయి. ఇది ఏ ప్రదేశంలో అయినా చేయవచ్చు. మీరు మీ మైండ్ ను ఇతర విషయాలపై పెట్టకుండా వుంటే ఎక్కడైనా సరే ఈ ధ్యానం చేయవచ్చు.

ధ్యానాలు ఒత్తిడిని ఎలా తగ్గిస్తాయి? ధ్యానం అనేది విశ్రాంతినిస్తుంది. అది మీ సబ్ కాన్షస్ మైండ్ కు అతి త్వరగా చేరేలా చేస్తుంది రక్తపోటు, కొలెస్టరాల్, ఆందోళన వంటివి తగ్గుతాయి. మన శరీరంలో రక్తప్రసరణ బాగా చేసి మానసికంగా ఉల్లాసంగా వుంచుతుంది. ఆందోళన తగ్గిస్తుంది. కోప తాపాలు, మనోవేదన, చికాకు వంటివి లేని హాయి అయిన జీవనాన్ని ఇస్తుంది.

ధ్యానం అనేది మనమంటే ఏమిటో తెలుసుకోవడం. మన మైండ్ ప్రశాంతంగాను, విశాలంగాను, రిలాక్స్డ్ గాను, ఒత్తిడిలేకుండా వుండాలంటే కనీసం రోజుకు 15 నుండి 20 నిమిషాలపాటు ధ్యానం చేయాలి. ధ్యానానికి రోజులో ఉదయం, సాయంత్రం వేళలు అనుకూలమైనవి. కనుక నేటినుండే మీరు మీ ధ్యానాన్ని మొదలుపెట్టండి. మీ శరీరానికి, మనసుకు విశ్రాంతి నివ్వండి. మంచి మనసు కలిగి వుండటం సంతోషానికి ప్రధానం అన్నది మరవకండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Friday, June 1, 2012, 10:04 [IST]
Desktop Bottom Promotion