బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా!

మతిమరుపు అనేది మనకు చాలా సహజమైన విషయంగా పరిగణిస్తుంటాం. ప్రస్తుత బిజీ లైఫ్ లో చిన్న చిన్న విషయాలను మర్చిపోవడం చాలా కామన్. ఒక్కోసారి నెత్తిన కళ్లద్దాలు పెట్టుకోని ఇళ్లంతా కళ్లజోడు ఎక్కడ పెట్టామా అని వెతుకుతుంటాం. కారుకే తాళాలు పెట్టి ఇళ్లంతా వెతికేస్తుంటాం.

ఒక పని చేస్తుండగా మధ్యలో ఏకాగ్రత లోపిస్తుంది లేదా మెదడు ఏదో గందరగోళంగా అనిపిస్తుంది. ఇదంతా కేవలం పని ఒత్తిడి లేదా సాధారణ అలసట వల్లే జరుగుతుందని మనం కొట్టిపారేస్తుంటాం. కానీ వైద్య పరిభాషలో దీన్ని బ్రెయిన్ ఫాగ్ అంటారు. ఇది కేవలం మెదడుకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, మీ గుండె ఆరోగ్యానికి సంబంధించిన ముందస్తు హెచ్చరిక కూడా కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

what is brain fog and why it could be a hidden sign of heart issues

అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏమిటి?

బ్రెయిన్ ఫాగ్ అనేది ఒక ప్రత్యేకమైన వ్యాధి కాదు, ఇదొక మానసిక స్థితి. ఆలోచనా విధానం మందగించడం, ఏకాగ్రత నిలపలేకపోవడం, దేనినీ స్పష్టంగా గుర్తుంచుకోలేకపోవడం లాంటివి ఇందులో కనిపిస్తాయి. నలుగురితో మాట్లాడుతున్నప్పుడు హఠాత్తుగా పదాలు గుర్తుకురాకపోవడం, త్వరగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అయోమయానికి గురికావడం దీని ప్రధాన లక్షణాలు. మెదడుపై ఏదో మంచు కమ్మేసినట్లుగా, స్పష్టత లోపించినట్లుగా అనిపించడాన్నే బ్రెయిన్ ఫాగ్ అంటారు.

ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడిఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి

గుండెకు, మెదడుకు మధ్య కనెక్షన్ ఏంటి?

మన శరీరంలో మెదడు అత్యంత చురుకైన అవయవం. ఇది నిరంతరం పనిచేయాలంటే దానికి ఆక్సిజన్, పోషకాలు పెద్ద మొత్తంలో అవసరం. ఈ రెండింటినీ రక్తప్రసరణ ద్వారా మెదడుకు సరఫరా చేసే బాధ్యత గుండెదే. ఎప్పుడైతే గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గుతుందో, అప్పుడు మెదడుకు తగినంత రక్తం, ఆక్సిజన్ అందవు. దీనివల్ల మెదడు కణాల పనితీరు మందగిస్తుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం జరుగుతుంది.

బీపీ, గుండె కండరాలు బలహీనపడటం, హార్ట్ ఫెయిల్యూర్, రక్తనాళాల సమస్యలు ఉన్నవారిలో దీర్ఘకాలికంగా మెదడు పనితీరు దెబ్బతింటుంది. అందుకే బ్రెయిన్ ఫాగ్ అనేది గుండె బలహీనతకు ఒక పరోక్ష సంకేతం కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ మార్పులు అవసరం

గుండె ఆరోగ్యంగా ఉంటేనే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండు ముఖ్యమైన అవయవాలను కాపాడుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అత్యవసరం.

-రోజూ కనీసం అరగంట పాటు నడక లేదా వ్యాయామం చేయడం వల్ల గుండె, మెదడులకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

-పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. రోజుకు 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం.

-యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని జయించాలి.

-బీపీ, మధుమేహం (షుగర్), కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ అదుపులో ఉంచుకోవాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Sunday, September 27, 2026, 16:30 [IST]
Desktop Bottom Promotion