Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
విమాన,హెలికాఫ్టర్ ప్రమాదాల్లో మరణించిన భారతీయ సెలబ్రిటీలు..మన తెలుగోళ్లు కూడా
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో గురువారం(జూన్ 12,2025) ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ లైనర్ విమానం కూలిపోవడం..ఆ ప్రమాదంలో మొత్తం 242 మందిలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బతికి బయటపడిన విషయం తెలిసిందే. ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన 241 మందిలో 2016 నుంచి 2021 వరకు గుజరాత్ సీఎంగా పనిచేసిన విజయ్ రూపానీ కూడా ఉన్నారు. తన కూతుర్ని చూసేందుకు లండన్ వెళ్లేందుకు ఈ విమానం ఎక్కారు. అయితే ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లొచ్చు కదా..అలా చేసి ఉంటే ఆయన ప్రాణాలతో ఉండేవారంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాసి పెట్టి ఉన్నప్పుడు జరిగేదాన్ని ఆపలేవు అంటూ మరికొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే చరిత్రలో చాలామంది ప్రముఖలు, సెలబ్రిటీలు విమాన ప్రమాదాల్లో మరణించారు. వాళ్లందరికీ కూడా సొంత ఫ్లైట్ లు పెట్టుకొని జర్నీ చేసే స్థోమత ఉంది..కానీ వాళ్లకు ఆ రోజు చనిపోవాలని రాసి పెట్టి ఉంది కాబట్టి చనిపోయారంటూ గతంలో ఫ్లైట్ యాక్సిడెంట్స్ లో చనిపోయినవాళ్ల ఫొటోలను షేర్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు విమాన,హెలికాఫ్టర్ ప్రమాదాల్లో మరణించిన కొందరు ఫేమస్ సెలబ్రిటీల గురించి ఇప్పుడు చూద్దాం.

హోమి బాబా
భారత అణు కార్యక్రమ పితామహుడు హోమి బాబా..1966 జనవరి 24న స్విస్ ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లోని మాంట్ బ్లాంక్ పర్వతంపై ఎయిర్ ఇండియా విమానం 101 కూలిపోవడంతో మరణించారు.భారత అణు కార్యక్రమాన్ని ఆపేందుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్నీ(CIA) ఈ విమానాన్ని కూల్చివేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
వైఎస్ఆర్
2009 సెప్టెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి చిత్తూరు జిల్లాలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి బెల్ 430 హెలికాప్టర్ లో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరారు. ఉదయం 9:35 గంటల సమయంలో హెలికాప్టర్ తో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సంబంధాలు తెగిపోయాయి. కర్నూలు జిల్లా రుద్రకొండ సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాల గుట్ట వద్ద హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న ఐదుగురూ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.

సంజయ్ గాంధీ
భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కుమారుడైన సంజయ్ గాంధీ 1980 జూన్ 23న ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో పిట్స్ S-2A అనే తేలికపాటి స్టంట్ ప్లేన్ ను నడుపుతున్న టైంలో విమానం అదుపు తప్పి ఢిల్లీలోని డిప్లమాటిక్ ఎంక్లేవ్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో సంజయ్ గాంధీతో, శిక్షకుడు కెప్టెన్ సుభాష్ సక్సేనా ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.

తరుణి సచ్ దేవ్
బాలీవుడ్ బాలనటి తరుణి సచ్ దేవ్ 2012 మే 14న నేపాల్ లో పొఖారా విమానాశ్రయం నుండి జోమ్సోమ్ వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కారు. విమానం జోమ్సోమ్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించింది, కానీ తొలి ప్రయత్నం విఫలమైంది. రెండవసారి ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా విమానం కొండను ఢీకొని కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 21 మందిలో 15 మంది మరణించారు, వారిలో తరుణి సచ్‌దేవ్, ఆమె తల్లి కూడా ఉన్నారు. తరుణి సచ్‌దేవ్ బాలనటిగా "పా" (Paa) సినిమాలో అమితాబ్ బచ్చన్ స్నేహితురాలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఆమె 50కి పైగా వాణిజ్య ప్రకటనలలో ముఖ్యంగా రస్నా (Rasna) యాడ్ తో ప్రసిద్ధి చెందారు.
మాధవరావు సింధియా
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి మాధవరావు సింధియా 2001 సెప్టెంబర్ 30న కాన్పూర్ లో జరగనున్న ఒక రాజకీయ ర్యాలీలో ప్రసంగించడానికి వెళ్లేందుకని బీచ్ క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ సి90 అనే 10 సీట్ల ప్రైవేట్ విమానం ఢిల్లీలో ఎక్కారు. కాన్పూర్ కు చేరుకోవడానికి కొద్దిసేపటి ముందు భైన్ స్రౌలీ గ్రామం సమీపంలో ఓ పొలంలో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న మాధవరావు సింధియాతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు.
సౌందర్య
ఫేమస్ తెలుగు హీరోయిన్ సౌందర్య 2004 ఏప్రిల్ 17న బీజేపీ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి బెంగళూరులోని జక్కూరు ఎయిర్ పోర్ట్ నుంచి కరీంనగర్ కు చార్టర్డ్ విమానంలో (సెస్నా 180 హెలికాప్టర్) బయలుదేరారు. ఆ హెలికాప్టర్‌లో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమర్‌నాథ్, బీజేపీ కార్యకర్త రమేష్ కదమ్, పైలట్ జాయ్ ఫిలిప్ ఉన్నారు. ఉదయం 11:05 గంటలకు టేకాఫ్ అయింది. అయితే గాలిలోకి లేచిన కొద్దిసేపటికే సుమారు 150 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు వెళ్లలేకపోయింది. సాంకేతిక లోపం కారణంగా ఇంజిన్ పనిచేయడం మానేసింది. వెంటనే హెలికాప్టర్ లో మంటలు చెలరేగి చక్కర్లు కొడుతూ నేలపై పడి పేలిపోయింది. ఈ ప్రమాదంలో వాళ్లంతా అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.

బిపిన్ రావత్
భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)జనరల్ బిపిన్ రావత్..2021 డిసెంబర్ 8న తమిళనాడులోని సూలూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి వెల్లింగ్టన్ లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC)కు వెళ్లేందుకు భారత వైమానిక దళానికి చెందిన Mi-17V5 హెలికాప్టర్ ఎక్కారు. బిపిన్ రావత్ ఆయన భార్య మధులికా రావత్ మరియు భారత సాయుధ దళాలలోని 11 మంది ఇతర సిబ్బందితో సహా మొత్తం 14 మంది ఆ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారు. వెల్లింగ్టన్ కు చేరుకోవడానికి కొద్దిసేపటి ముందు హెలికాప్టర్ కుప్పకూలి మంటలు చెలరేగాయి. తీవ్ర గాయాలతో బయటపడిన ఒకే ఒక్క వ్యక్తి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్, కానీ దురదృష్టవశాత్తు కొన్ని రోజుల తర్వాత డిసెంబర్ 15న చికిత్స పొందుతూ మరణించారు.
బాలయోగి
భారత పార్లమెంట్‌లో తొలి దళిత లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి 2002 మార్చి 3న హెలికాప్టర్ లో ఏపీలోని భీమవరం నుండి హైదరాబాద్ కు బయల్దేరారు. ఉదయం 7:45 గంటలకు హెలికాఫ్టర్ గాల్లోకి లేచింది..టేకాఫ్ అయిన సుమారు 15-20 నిమిషాల తర్వాత, హెలికాప్టర్ కృష్ణా జిల్లాలోని కువ్వాడలంక గ్రామం వద్ద దిగువకు రావడం ప్రారంభించింది. దీంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించారు. హెలికాప్టర్ ఒక కొబ్బరి చెట్టును ఢీకొని అక్కడే ఉన్న ఒక చేపల చెరువులో కూలిపోయింది. కూలిన వెంటనే మంటలు చెలరేగి పెద్ద శబ్దం వచ్చింది. ఈ ప్రమాదంలో బాలయోగితో పాటు ఆయన అదనపు ప్రైవేట్ సెక్రటరీ కే. సత్తిరాజు, పైలట్ కెప్టెన్ జి.వి. మీనన్ అక్కడికక్కడే మరణించారు.



Click it and Unblock the Notifications











