Fish Prasadam: చేప ప్రసాదం, నిజంగానే ఆస్తమా తగ్గుతుందా? మూఢ నమ్మకమా?

హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఖరారైంది. మూడేళ్ల తర్వాత చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. జూన్ 9 వ తేదీ మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిని సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తుంటారు.

అయితే కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీని మూడేళ్ల పాటు నిలిపేశారు. ఈ ఏడాది నుండి చేప ప్రసాదం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం చేయనున్నారు.

Fish Prasadam In Hyderabad, Thousands Of People Swallow Live Fish To Cure Asthma

170 ఏళ్లకు పైగా చేప ప్రసాదం పంపిణీ:
ఆస్తమా పేషెంట్ల కోసం హైదరాబాద్ లో ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంటారు. దాదాపు 170 ఏళ్లకు పైగా ఈ చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. 170 ఏళ్లుగా ప్రతి సంవత్సరం నిరంతరాయంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తుండగా.. 2020లో కరోనా కారణంగా చేప పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అలా మూడేళ్ల నుండి చేప ప్రసాదం పంపిణీ జరగలేదు. ఈ సంవత్సరం నుండి తిరిగి ప్రారంభం అవుతోంది.

చేప ప్రసాదం అంటే ఏంటి?
1845 నాటి నుండి ఈ చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు బత్తిని సోదరులు చెబుతున్నారు. ఆస్తమాను నయం చేయడానికి తమ పూర్వీకులు ఈ చేప ప్రసాదాన్ని తయారు చేసి ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ చేప ప్రసాదంలో బతికి ఉన్న కొర్రమీను చేపను అలాగే మింగాల్సి ఉంటుంది. ఈ చేప నోట్లో పసుపు రంగులో ఉండే మూలికలతో తయారు చేసిన పదార్థం పెడతారు. ఆ తర్వాత బతికున్న కొర్రమీను చేపను అలాగే మింగేస్తారు. సీక్రెట్ ఫార్ములాతో ఈ పసుపు పదార్థం తయారు చేస్తామని బత్తిని సోదరులు చెబుతున్నారు. శాకాహారులకు అయితే బెల్లంలో ఈ పసుపు పదార్థాన్ని కలిపి ఇస్తారు.

ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి ఆస్తమా పేషెంట్ల రాక:
ఏటా మృగశిర కార్తె రోజు పంపిణీ చేసే ఈ చేప ప్రసాదం తీసుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండే కాకుండా.. పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుండి ఎక్కువ మంది ఆస్తమా పేషెంట్స్ వస్తుంటారు. భారత్ నుండి మారుమూల ప్రాంతాల నుండి హైదరాబాద్ కు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. విదేశాల నుండి కూడా వచ్చి చేప ప్రసాదాన్ని తీసుకుంటారని బత్తిని సోదరులు చెబుతున్నారు. లక్షల్లో వచ్చే ఆస్తమా పేషెంట్ల కోసం హైదరాబాద్ లో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. కొర్రమీను చేపలను అందుబాటులో ఉంచుతుంది రాష్ట్ర ప్రభుత్వం.

చేప మందు నుండి చేప ప్రసాదంగా పేరు మార్పు:
చేప ప్రసాదాన్ని మొదట్లో చేప మందుగా పిలిచే వారు. ఆస్తమా పేషెంట్లకు అది తగ్గడానికి ఇచ్చే ఈ సీక్రెట్ పదార్థాన్ని మందుగా పిలవడం పట్ల జన విజ్ఞాన వేదిక వారు కోర్టుకు వెళ్లారు. చేప మందుకు శాస్త్రీయత లేదని వాదించారు. అయినా చేప మందులో వాడే పదార్థంలో కలిపే సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ గురించి బత్తిని సోదరులు బయటకు చెప్పలేదు. అప్పటి నుండి చేప మందు అనే పేరును చేప ప్రసాదంలా మార్చి ఏటా అందిస్తున్నారు.

చేప ప్రసాదం తీసుకుంటే ఆస్తమా తగ్గుతుందా?
చేప ప్రసాదం తీసుకుంటే ఆస్తమగా తగ్గుతుందా లేదా అనే ప్రశ్నకు భిన్న సమాధానాలు వస్తుంటాయి. వైద్యులు, హేతువాదులు చేప ప్రసాదం ఓ మూఢనమ్మకమని, అందులో ఎలాంటి శాస్త్రీయత లేదని కొట్టి పరేస్తున్నారు. చేప ప్రసాదం తీసుకోవడం వల్ల ఆస్తమా తగ్గిన కేసులను తాము చూడలేదని చెబుతున్నారు. చేప ప్రసాదంలో వాడే ఆ సీక్రెట్ పదార్థాలు ఏంటో చెప్పాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.

చేప ప్రసాదం తీసుకున్న వారు మాత్రం ఇందుకు భిన్నమైన సమాధానాన్ని ఇస్తున్నారు. చేప ప్రసాదం తీసుకోవడం వల్ల ఆస్తమా నుండి ఉపశమనం లభిస్తున్నట్లు ఇక్కడికి వచ్చే ఆస్తమా పేషెంట్లు చెబుతున్నారు. చేప ప్రసాదం తీసుకోవడం వల్ల తమ సమస్య తగ్గినట్లు వెల్లడిస్తున్నారు.

చేప ప్రసాదం వెనక ఆసక్తికర కథ:
చేప ప్రాసదం పంపిణీ వెనుక ఆసక్తికరమైన కథనం ఒకటి వుంది. 1847 ప్రాంతంలో ఒక సాధువు బత్తిన వంశానికి చెందిన వీరన్న గౌడ్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. జోరు వానలో తడిసిపోయిన వచ్చిన ఆ సాధువుకి వీరన్న గౌడ్ భక్తిగా సేవలు చేశారు. అందుకు మెచ్చి ఆయన ఆస్తమా మందు ఎలా తయారు చేయాలో చెప్పి దాన్ని ఏటా మృగశిర కార్తె రోజున ఉచితంగా పంపిణీ చేయమని చెప్పి వెళ్లాడు. అప్పట్నుంచీ బత్తిని వంశజులు శతాబ్దమున్నరకు పైగా విజయవంతంగా చేప ప్రసాదం రోగులకు అందిస్తూ వస్తున్నారు.

Story first published: Wednesday, May 24, 2023, 16:30 [IST]
Desktop Bottom Promotion