Richest Temples of India: భారతదేశంలో టాప్ 10 ధనిక దేవాలయాలు ఇవే..ఆ సంపద లెక్కబెట్టాలంటే ఎన్నేళ్లు పడుతుందో!

మనదేశంలో గుడులకు కొదవే లేదు. కనీసం ప్రతి ఊరికి ఒక గుడి అయినా ఉంటుంది. అయితే మనది పరమత సహనం కలిగిన దేశం కాబట్టి చర్చిలు,మసీదులు,గురుద్వారాలు కూడా మనదేశంలో భారీగానే ఉంటాయి. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారత్ లో అత్యధిక శాతం జనాభా హిందువులే అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యధిక మసీదులు ఉన్న రెండో దేశం మనదే. ఇదిలాఉంటే మనదేశంలోని ఆలయాలను కేవలం ప్రార్థనా మందిరాలగానే కాకుండా తరతరాలుగా మన కళ, వాస్తుశిల్పం, సామాజిక జీవనాన్ని ప్రతిబింబించే చారిత్రక కట్టడాలుగా చూస్తారు. అయితే మనదేశంలో వీధికో ఆలయం ఉంది కదా..అసలు అత్యంత ధనిక ఆలయాలు ఏవి అని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా?

భారతదేశంలో ఇప్పటికే అపారమైన సంపద, అద్భుతమైన వైభవం, కోట్లాది భక్తుల విశ్వాసంతో విరాజిల్లుతున్న 10 అత్యంత ధనిక దేవాలయాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయాల సంపద కేవలం డబ్బు, బంగారం రూపంలోనే కాక వేలాది ఎకరాల భూములు, అమూల్యమైన వజ్రవైఢూర్యాల రూపంలోనూ ఉంది. ఈ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా.. అపారమైన ఆర్థిక వనరులను కలిగి వాటిని ధార్మిక, సామాజిక, విద్యా, వైద్య సేవల కోసం వినియోగిస్తూ దేశ సామాజిక నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

From Tirumala to Somnath Top 10 Richest Temples in India

తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఆలయం, ఆంధ్రప్రదేశ్
భూలోక వైకుంఠంగా, కలియుగ దైవంగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం సంపదలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది. శేషాచల కొండల నడుమ, ప్రకృతి రమణీయత మధ్య వెలసిన ఈ ఆలయానికి రోజుకు సగటున 50000 మందికి పైగా భక్తులు తరలివస్తారు. ఈ ఆలయ నికర విలువ అక్షరాలా రూ. 3 లక్షల కోట్లు. ఈ మొత్తం ఎంత పెద్దదంటే మన దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ విప్రో, ఫుడ్ దిగ్గజం నెస్లే, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఓఎన్‌జీసీ, ఐఓసీల మార్కెట్ విలువ కంటే కూడా ఇది ఎక్కువ. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించిన వివరాల ప్రకారం, కేవలం హుండీ ద్వారానే ఏటా రూ. 1400 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. ఇది కాకుండా భక్తులు తలనీలాలు సమర్పించడం ద్వారా ఫిక్స్‌ డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ, బంగారం, వెండి, వజ్రాలు వంటి విలువైన కానుకల ద్వారా వందల కోట్లు వచ్చి చేరతాయి. 10వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం 16.2 ఎకరాల విస్తీర్ణంలో ఉండి, తన సంపదను ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ఆలయంలో దర్శనానికి ఇతర మతస్థులు కూడా రావొచ్చు. అయితే వెంకటేశ్వరస్వామి మీద మాకు నమ్మకం ఉంది అని ఓ డిక్లరేషన్ ఫాం ఇచ్చిన తర్వాతనే స్వామిని సందర్శించుకోవాలి.

From Tirumala to Somnath Top 10 Richest Temples in India

అనంత పద్మనాభస్వామి ఆలయం, కేరళ
ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా చరిత్రకెక్కిన ఈ ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయ నేలమాళిగల్లో దాగి ఉన్న సంపద విలువ రూ. 1,20,000 కోట్లకు పైమాటే. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలతో తెరిచిన కొన్ని నేలమాళిగల్లో బయటపడిన బంగారు విగ్రహాలు, వజ్రవైఢూర్యాలు, పురాతన నాణేలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ముఖ్యంగా ఇప్పటికీ తెరవని వాల్ట్-బి గది వెనుక అనేక రహస్యాలు, పురాణ కథలు ముడిపడి ఉన్నాయి. ఈ గదిని రెండు భారీ నాగుపాములు రక్షిస్తాయని, దాన్ని తెరవడం అరిష్టమని స్థానికులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అనంతశయనుడిగా కొలువైన విష్ణుమూర్తి కొలువుదీరిన ఈ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.

From Tirumala to Somnath Top 10 Richest Temples in India

గురువాయూర్ దేవస్వోమ్, కేరళ
కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉన్న గురువాయూర్ ఆలయం శ్రీకృష్ణుడిని గురువాయూరప్పన్ గా పూజించే పవిత్ర క్షేత్రం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి దేశవిదేశాల నుండి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తారు. ఒక ఆర్టీఐ సమాధానం ప్రకారం ఈ ఆలయం పేరు మీద బ్యాంకుల్లో రూ. 1,737 కోట్లకు పైగా డిపాజిట్లు, 271 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఇది కాకుండా భక్తులు సమర్పించిన బంగారం, వెండి, విలువైన రత్నాల నిల్వలు అపారం. ఈ ఆలయం ప్రత్యేకంగా గజపూజకు ప్రసిద్ధి. అద్భుతంగా అలంకరించిన ఏనుగుల ఊరేగింపును చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తారు.

From Tirumala to Somnath Top 10 Richest Temples in India

వైష్ణోదేవి ఆలయం, జమ్మూ
జమ్మూ నగరానికి కొద్ది దూరంలో త్రికూట పర్వతాలపై 5200 అడుగుల ఎత్తులో ఉన్న వైష్ణోదేవి ఆలయం.. దుర్గాదేవికి అంకితం చేయబడిన 108 శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారిని వైష్ణోదేవిగా కొలుస్తారు. కష్టమైన ప్రయాణాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారు. సంపద పరంగా ఈ ఆలయానికి 2000- 2020 మధ్య కాలంలోనే దాదాపు 1800 కేజీల బంగారం, 4700 కేజీల వెండి, రూ. 2,000 కోట్ల డబ్బు విరాళంగా వచ్చినట్లు అంచనా. ఈ పవిత్ర గుహల చరిత్రపై స్పష్టత లేనప్పటికీ శాస్త్రీయ అధ్యయనాలు ఈ గుహలు పది లక్షల సంవత్సరాల పురాతనమైనవని సూచిస్తున్నాయి.

From Tirumala to Somnath Top 10 Richest Temples in India

షిర్డీ సాయి బాబా ఆలయం, మహారాష్ట్ర
సబ్ కా మాలిక్ ఏక్ అంటూ సర్వమత సమానత్వాన్ని బోధించిన షిర్డీ సాయి బాబా ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని షిర్డీలో ఉంది. రోజుకు 25000 మందికి పైగా భక్తులు బాబా దర్శనం కోసం వస్తారు. ఈ ఆలయంలో బాబా ఆశీనులైన సింహాసనాన్ని 94 కిలోల బంగారంతో తయారు చేశారు. 2022లో భక్తులు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (SSST)కు రూ. 400 కోట్లకు పైగా విరాళాలు అందించారు. ఈ ఆలయ ట్రస్ట్ కేవలం విరాళాలు స్వీకరించడమే కాకుండా సమాజ సేవలో కూడా ముందుంటుంది. రెండు అత్యాధునిక హాస్పిటల్స్ నిర్వహిస్తూ రోగులకు ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తోంది. అంతేకాకుండా, ప్రతిరోజూ 50,000 నుండి లక్ష మంది భక్తులకు ఉచితంగా భోజనం అందించే ప్రసాదాలయను నడపడం ఇక్కడి విశేషం.

From Tirumala to Somnath Top 10 Richest Temples in India

జగన్నాథుని ఆలయం, పూరి

హిందువుల పవిత్ర చార్ ధామ్ యాత్రలో ఒకటైన పూరి జగన్నాథ ఆలయం ఒడిశా తీరంలో ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుని రూపంలో కొలువయ్యాడు. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి సుమారు 30000 ఎకరాల భూమి ఉంది. దీని నికర విలువ రూ. 150 కోట్లకు పైమాటే. ఏటా జరిగే రథయాత్ర విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగుతారు. ఈ ఏడాది జూన్ 27 నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది..జులై 5న ముగుస్తుంది.

From Tirumala to Somnath Top 10 Richest Temples in India

సిద్ధి వినాయక ఆలయం, ముంబై
ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉన్న ఈ రెండు శతాబ్దాల పురాతన ఆలయం నగరవాసులకే కాక దేశవ్యాప్తంగా భక్తులకు కొంగుబంగారం. ఇక్కడి గణపతి విగ్రహం తొండం కుడివైపుకు వంగి ఉండటం విశేషం. ఇలాంటి విగ్రహం త్వరగా ప్రసన్నమవుతుందని భక్తుల నమ్మకం. స్వామివారి విగ్రహాన్ని అలంకరించడానికే 4 కిలోల బంగారం ఉపయోగిస్తారు. ఆలయ నికర విలువ రూ. 125 కోట్లు కాగా, రోజువారీ ఆదాయం రూ. 30 లక్షల వరకు ఉంటుందని అంచనా.

From Tirumala to Somnath Top 10 Richest Temples in India

స్వర్ణ దేవాలయం, అమృత్‌సర్
సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన స్వర్ణ దేవాలయం అమృత్‌సర్ నగరానికి తలమానికంగా నిలుస్తుంది. ఐదవ సిక్కు గురువు, గురు అర్జన్ దేవ్ పర్యవేక్షణలో నిర్మించిన ఈ ఆలయాన్ని హర్మందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఆలయ పై అంతస్తులను 400 కిలోల స్వచ్ఛమైన బంగారంతో పూత పూయడం వల్ల దీనికి స్వర్ణ దేవాలయం అనే పేరు వచ్చింది. పవిత్రమైన సరస్సు మధ్యలో, సూర్యరశ్మికి బంగారు వర్ణంలో మెరిసిపోయే ఈ ఆలయ దృశ్యం వర్ణనాతీతం. దీని వార్షిక ఆదాయం సుమారు రూ. 500 కోట్లుగా అంచనా.

From Tirumala to Somnath Top 10 Richest Temples in India

సోమనాథ్ ఆలయం, గుజరాత్
భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిదిగా పరిగణించబడే సోమనాథ్ ఆలయం గుజరాత్‌ రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయం చరిత్రలో ఎన్నోసార్లు విదేశీ దండయాత్రలకు గురై ధ్వంసమైనా, ప్రతిసారీ అంతే వైభవంగా పునర్నిర్మించబడింది. ఇది భారతీయుల అచంచలమైన విశ్వాసానికి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీక. ఆలయ గర్భగుడిలో 130 కిలోల బంగారం, శిఖరంపై 150 కిలోల బంగారం ఉపయోగించారని చెబుతారు. ఆలయ ట్రస్ట్ పేరున 1700 ఎకరాల భూమి ఉంది.

From Tirumala to Somnath Top 10 Richest Temples in India

మీనాక్షి ఆలయం, మధురై
తమిళనాడులోని మధురై నగరంలో వైగై నది ఒడ్డున ఉన్న మీనాక్షి అమ్మవారి ఆలయం ద్రావిడ వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణ. 14 ఎత్తైన, రంగురంగుల గోపురాలతో, వేలాది శిల్పాలతో ఈ ఆలయం చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడి ప్రధాన దైవం మీనాక్షి దేవి (పార్వతి), ఆమె భర్త సుందరేశ్వరుడు (శివుడు). ఈ ఆలయాన్ని రోజుకు 20,000 మందికి పైగా భక్తులు సందర్శిస్తారు. దీని వార్షిక ఆదాయం దాదాపు రూ. 6 కోట్లు. ఏప్రిల్-మే నెలల్లో జరిగే 10 రోజుల మీనాక్షి తిరుకళ్యాణం ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.

Story first published: Tuesday, June 24, 2025, 12:34 [IST]
Desktop Bottom Promotion