నాలుగు నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. మృతదేహాన్ని ఎంతకాలం భద్రపరచొచ్చు.?

ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు, అయతొల్లా అలీ ఖమేనీకి జులై 4 నుంచి జులై 7 వరకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం ఖమేనీ భౌతికకాయాన్ని టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లాలో ప్రజల సందర్శనార్థం ఉంచగా.. తర్వాత మషద్‌లోని ఇమామ్ రెజా సమాధి సమీపంలో ఖననం చేయనున్నారు. కాగా, ఫిబ్రవరి 28న టెహ్రాన్‌లో జరిగిన వైమానిక దాడిలో ఖమేనీ మరణించగా.. నాలుగు నెలల తర్వాత ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు అందరిలో ఒక ప్రశ్న తలెత్తుతోంది. మృతదేహాన్ని ఎంతకాలం పాటు పాడవకుండా భద్రపరచవచ్చు అనే సందేహం నెలకొంది.

Khamenei s funeral after four months know methods used to prevent the body longer from decomposing

సాధారణంగా మృతదేహాలను ఐస్‌ బాక్స్‌ల్లో భద్రపరచడం చూస్తూనే ఉంటాం. ప్రముఖుల భౌతిక కాయాలను ప్రజల సందర్శనార్థం రెండు రోజుల వరకు ఉంచడం చూశాం. అయితే ఇరాన్‌ మాజీ నేత ఖమేనీ భౌతిక కాయాన్ని నాలుగు నెలలుగా భద్రపరచారు. అయితే వ్యక్తి మరణించి కొన్ని గంటల్లోనే కుళ్లిపోయే ప్రక్రియ మొదలవుతుండగా.. ఇన్ని నెలలపాటు ఎలాంటి దుర్వాసన రాకుండా ఎలా ఉంచగలిగారనే సందేహం చాలా మందిలో కలుగుతుంది.

కాగా, వివిధ పద్ధతుల ద్వారా మరణించిన శరీరాన్ని భద్రపరుస్తారు. ఇక్కడ మృతదేహాన్ని ఎంత కాలం భద్రపరచాలనే దానిపైనే పద్ధతిని అమలు చేస్తారు. సాధారణంలో మరణించిన 24 గంటల్లోపు శరీరం లోపలి నుంచి బ్యాక్టీరియా దెబ్బతీయడం మొదలవుతుంది. ఇదే అసలే క్షీణత. అందుకే శరీరాన్ని భద్రపరిచే ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తారని వరల్డ్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ రీసెర్చ్‌ వివరిస్తుంది. ఈ పద్ధతుల ద్వారా కుళ్లిపోవడం అనేది గణనీయంగా నెమ్మదిస్తుంది. ఆ విధానాలేంటో తెలుసుకుందాం..

మనదేశంలో ఇలా

మన దేశంలో సాధారణంగా మనిషి మరణిస్తే ఎలాంటి ఆధునిక ఏర్పాట్లు ఉండవు. చనిపోయిన వ్యక్తి దేహాన్ని ఇంట్లో 6 నుంచి 10 గంటల వరకు భద్రపరిచే అవకాశం ఉంటుంది. అయితే ఎండాకాలంలో 6 గంటల వరకు దుర్వాసన రాకుండా ఉంటుంది. ఇక శీతాకాలంలో 12 నుంచి 15 గంటల వరకు కుళ్లిపోకుండా ఉంటుంది. ఇక మంచు పర్వతాల్లో, హిమానీ నదుల్లో అయితే నెలలు కాదు, వందల సంవత్సరాలైనా మృతదేహం సురక్షితంగా ఉండగలదని అధ్యయనం చెబుతోంది.

అయితే సాధారణ వాతావరణంలో పరిమిత సమయం ముగిసిన తర్వాత మెల్లగా మృతదేహం కుళ్లిపోవడం ప్రారంభిస్తుంది. అందుకే భద్రపరచడానికి ఐస్‌ ఉంచిన బాడీ ఫ్రీజర్‌ను ఉపయోగిస్తారు. దీని ద్వారా రెండు రోజుల వరకు డెడ్‌ బాడీ సురక్షితంగా ఉంటుంది. అయితే ఆ తర్వాత నెమ్మదిగా బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. అందుకే సహజంగా చల్లగా ఉండే మంచు పర్వతాల ప్రాంతాల్లో ఎన్ని ఏళ్లయినా సురక్షితంగా ఉండగలదు. 1968లో హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తాంగ్ కనుమలో తప్పిపోయిన ఒక భారత వైమానిక దళ సైనికుడి మృతదేహం 56 ఏళ్ల తర్వాత మంచులో లభ్యమైంది. మంచులో శరీర కణాలు పాడవకుండా ఉంటాయనేదానికి ఈ సంఘటనే ఉదాహరణ.

Khamenei s funeral after four months know methods used to prevent the body longer from decomposing

ఇక, సాధారణ పరిస్థితుల్లో మృతదేహాలను ఎక్కువ కాలం భద్రపరచడానికి మూడు పద్ధతులను అవలంబిస్తారు.

  1. శీతల నిల్వ(కోల్ట్‌ స్టోరేజ్‌)
  2. ఎంబాల్మింగ్‌
  3. క్రయోప్రిజర్వేషన్‌

కోల్డ్‌ స్టోరేజ్‌

ఈ పద్ధతిని సాధారణంగా ఒకటి రెండు రోజుల్లో జరిగే అంత్యక్రియల విధానంలో ఉపయోగిస్తారు. ఖననం వరకు మృతదేహం కుళ్లిపోకుండా శీతల గిడ్డంగుల్లో పెట్డడం ద్వారా నిరోధించవచ్చు. 2 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ మధ్య మృతదేహాలను నిల్వ చేస్తారు. మృతదేహాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేటప్పుడు.. గరిష్ఠంగా నాలుగు రోజులు ఉంచాల్సిన సందర్భాల్లో ఐస్‌ ప్యాక్‌లు, ప్రత్యేక పాలిమర్‌ షీట్‌లను ఉపయోగించి భద్రపరుస్తారు.

ఎంబాల్మింగ్

మృతదేహాన్ని కొన్ని నెలల పాటు భద్రపరచాల్సిన సందర్భాల్లో ఎంబాల్మింగ్‌ విధానాన్ని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో ముందుగా శస్త్ర చికిత్స ద్వారా భౌతిక కాయం నుంచి రక్తాన్ని తొలగిస్తారు. ఆ రక్తం స్థానంలో ఫార్మాల్డిహైడ్‌ ఆధారిత రసాయన ద్రవాలతో నింపుతారు. దీనివల్ల కణజాలాల్లో క్రిములు చేరి పాడవకుండా నిరోధిస్తుంది. ఇంకా చర్మంలోని ప్రొటీన్‌లు విచ్ఛిన్నం చేసి బ్యాక్టీరియా అభివృద్ధి చెందకుండా చూస్తుంది. ఎంబాల్మింగ్‌ ద్వారా చాలా వారాల పాటు భద్రపరిచే అవకాశం ఉంటుంది. కాగా, వైద్య కళాశాలలో అధ్యయనాల కోసం ఈ ప్రక్రియను పాటిస్తారు. ఈ విధానానికి 2 నుంచి 4 గంటల సమయం తీసుకుంటుంది.

కాగా, ఎంబాల్మింగ్‌ విధానంలో మృతదేహాన్ని 26 వారాల పాటు భద్రపరిచే అవకాశం ఉంటుంది. చల్లగా ఉండే వాతావరణం, పొడి వాతావరణంలో 2 నుంచి 6 నెలల వరకు ఉంచవచ్చు. ఇక కోల్ట్‌ టెంపరేచర్ ఆధారంగా మరింత కాలం పొడిగించవచ్చు.

క్రయోప్రిజర్వేషన్

క్రయోప్రిజర్వేన్‌ విధానంలో మొత్తం శరీరాన్ని లేదా అవయవాలను నిల్వ ఉంచవచ్చు. -130°C కంటే ఇంకా తక్కువైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఫ్రీజ్‌ చేస్తారు. ఈ ప్రక్రియలో ద్రవ నైట్రోజన్‌ను ఉపయోగించడం ద్వారా ఇది బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా సంరక్షిస్తుంది. దీని ద్వారా దశాబ్దాల పాటు మృతదేహం కుళ్లిపోకుండా ఉంటుంది.

Story first published: Sunday, July 5, 2026, 10:30 [IST]
Desktop Bottom Promotion