Latest Updates
-
అటు ప్రొటీన్, ఇటు టేస్ట్.. పిల్లలు లంచ్ బాక్స్‌లోకి ఇష్టంగా తినేలా పనీర్ ఖీమా రైస్.! -
పిల్లల నుంచి పెద్దల వరకు.. రక్తహీనత పోగొట్టి ఎముకల బలాన్ని పెంచే రాగి బీట్రూట్ జున్ను.! -
టైమ్ తక్కువ, టేస్ట్ ఎక్కువ..లంచ్ బాక్సులకు పర్ఫెక్ట్ పుదీనా పులావ్ చేసేయండిలా -
మొహర్రం పవిత్ర మాసం సందర్భంగా మీ ప్రియమైన వారికి విషెస్ ఇలా తెలియజేయండి.! -
గుండెకు బ్యాడ్ మార్నింగ్.. ఆ సమయాల్లో ఆహార ఎంపికలతో పెను ముప్పు.! -
జూన్ 26 సాయంత్రం ఈ 5 రాశుల వారికి అదృష్టం.. ధనయోగం, కెరీర్ సక్సెస్ మీ సొంతం! -
ఈరోజు సాధ్య యోగం.. ఈ పనులు మొదలుపెడితే తిరుగులేని విజయం మీదే! -
ఒత్తిడికి గురవుతున్నారా.. ఇది మీ జుట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా.? -
హిందూ ధర్మంలో క్షేత్రపాలక దేవతల పాత్ర ఏమిటి? -
వృశ్చిక రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త!
ఫెమినిజం అంటే వాటితో పోలిక కాదు.. నెట్టింట్లో చర్చకు దారి తీస్తున్న సునీత కామెంట్స్.. అసలేమన్నారు.!
ఫెమినిజంపై చాలా రోజులుగా చాలా వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు తమ దృక్పథాన్ని పంచుకుంటున్నారు. అసలు ఫెమినిజం అంటే ఇదంటూ తమ ఆలోచనా సరళిని వినిపిస్తున్నారు. ముఖ్యంగా కొందరి మహిళల వస్త్రధారణ విషయంలోనూ గత కొంతకాలంగా నెట్టింట సైతం చర్చ జరుగుతోంది. కొందరు విమర్శలు చేస్తుండగా.. మరికొందరు మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ గాయని సునీత స్త్రీవాదంపై తన దృక్పథాన్ని షేర్ చేసుకున్నారు. అది వైరల్ అవుతోంది.

ఫెమినిజం అంటే స్త్రీవాదం.. సమాజంలో పురుషులతో సమానంగా రాజకీయ, ఆర్థిక రంగాలతో పాటు సామాజికంగా సమానత్వం ఉండాలని నమ్మే సిద్ధాంతం. ఇది ఉద్యమంగానూ పలు సందర్భాల్లో రూపుదాల్చుతోంది. అయితే ఇది కేవలం మహిళల హక్కుల గురించే మాత్రమే కాదు. లింగ వివక్షను రూపుమాపి, అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఫెమినిజం ప్రధాన ఉద్దేశం. ఇదిలా ఉండగా.. గత కొన్ని నెలలుగా ఫెమినిజంపై సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొందరు మహిళల వస్త్రధారణ విషయంలో.
ఎలాంటి దుస్తులు ధరించాలనేది తమ ఇష్టమంటూ కొందరు మహిళలు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. మహిళలు వేసుకునే బట్టలను బట్టే వారికి గౌరవం ఉంటుందని కొందరు, వారు ఎలాంటి దుస్తులు ధరిస్తే మనకెందుకు చూసే విధానం సరిగా ఉండాలని మరికొందరు ఇలా భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. అయితే అసలు ఫెమినిజం అంటే మహిళలు వేసుకునే దుస్తుల గురించా.. వారి హక్కులు, అవకాశాల గురించా అనేది చర్చనీయాంశమైంది. దీనిపై గాయని సునీత తన అభిప్రాయాన్ని వెల్లడించడం ఆలోచింపజేస్తోంది.
మా శరీరం మా ఇష్టం మాకు నచ్చిన బట్టలు వేసుకుంటామని మహిళలు అన్నప్పుడు.. మా కళ్లు మా ఇష్టం అని పురుషులు కూడా అనే అవకాశం ఉంది. కానీ కళ్లు చేతుల వరకూ వెళ్లనప్పుడే అది సమంజసంగా ఉంటుందని సునీత అన్నారు. అయితే ఫెమినిజం అంటే మహిళల వస్త్రధారణ గురించి కాదని.. సమాజంలో వారికి దక్కుతున్న గౌరవం, అవకాశాల గురించి అని చెప్పారు.
ప్రజల జీవితాలను నిజంగా ప్రభావితం చేసే రంగాల్లో సమానత్వం, సాధికారత, సమాన అవకాశాలను ప్రోత్సహించడమే ఫెమినిజం నిజమైన ఉద్దేశ్యమని సునీత నొక్కి చెప్పారు. స్త్రీవాదం అంటే కేవలం పురుషులతో ముడిపడి ఉన్న ప్రతి అంశాన్ని లేదా అలవాటును అనుకరించడం కాదు.. వారితో పాటుగా న్యాయం, గౌరవం, విద్య, వృత్తిపరమైన అభివృద్ధి, భద్రత, సమాన హక్కులను నిర్ధారించడమని వెల్లడించారు.
ఫెమినిజానికి సంబంధించి అసలైన భావనను చాలా మంది కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని సునీత అన్నారు. పురుషుల వ్యక్తిగత అలవాట్లపై పోలికలకు పరిమితం చేయడం ఫెమినిజం కాదని చెప్పారు. పురుషులు ఎలాంటి పరిమితులు లేకుండా ధూమపానం చేయగలిగినప్పుడు, మహిళలు ఎందుకు చేయకూడదు, మద్యం ఎందుకు తాగకూడదు లాంటి ఉదాహరణలను ఉటంకిస్తూ.. ఈ వాదనలు ఫెమినిజం అసలు ఉద్దేశ్యాన్ని దృష్టి మళ్లిస్తాయని అన్నారు.
సునీత అభిప్రాయం ప్రకారం.. స్త్రీవాదం అనేది అనారోగ్యకరమైన, హానికరమైన ప్రవర్తనలను సమానత్వానికి చిహ్నాలుగా పరిగణించకూడదు. పురుషులతో సమానంగా సానుకూల పురోగతిని, అర్థవంతమైన మార్పును ప్రోత్సహించే దిశగా కృషి చేయాలి.

మహిళలకు వివిధ రంగాల్లో అవకాశాలను సృష్టించడం, అడ్డంకులను తొలగించడం, ఎలాంటి వివక్ష లేకుండా తమ కలలను సాకారం చేసుకునే స్వేచ్ఛను కల్పించడం ద్వారానే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని తాను విశ్వసిస్తానన్నారు. వ్యక్తిగత లేదా సామాజిక శ్రేయస్సుకు దోహదపడని అలవాట్ల గురించి మాట్లాడకుండా.. వారికి సమాజంలో మెరుగైన ప్రమాణాల కోసం కృషి చేసేలా ప్రోత్సహించాలని సూచించారు.
ఫెమినిజంపై తన అభిప్రాయాన్ని చెబుతూ సునీత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చలకు దారితీశాయి. సమాన హక్కులు, సమాన ఎంపికల మధ్య ఆమె చూపిన వ్యత్యాసాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు. మరికొందరు ఆధునిక స్త్రీవాదం దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందనే దానిపై చర్చిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఆమె వ్యాఖ్యలు నేటి సమాజంలో స్త్రీవాదం, సాధికారత, లింగ సమానత్వం చుట్టూ జరుగుతున్న చర్చలపై మరోసారి దృష్టిని ఆకర్షించింది.



Click it and Unblock the Notifications