కేలరీలు తక్కువ,బలం ఎక్కువ..నూనె లేకుండానే హెల్దీ,టేస్టీ మఖానా కట్ లెట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

Posted By:

బరువు తగ్గే ప్రయత్నంలో భాగంగా డైటింగ్ చేసేటప్పుడు తరచుగా ఆకలి వేయడం, ఏదైనా రుచిగా తినాలనిపించడం సర్వసాధారణం. ఇలాంటి సమయంలో అనారోగ్యకరమైన నూనె పదార్థాలు తినడం కంటే ఆరోగ్యానికి మేలు చేసే మఖానా తీసుకోవడం ఉత్తమం.

మఖానాలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల బలానికి చాలా మంచిది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది, దీనివల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు.

5 Star Taste Zero Guilt Crispy Delicious Healthy Makhana Cutlet Recipe for Weight Watchers

కేవలం వేయించుకుని తినడమే కాకుండా మఖానాతో రుచికరమైన కట్ లెట్ లను కూడా తయారు చేసుకోవచ్చు. ఇందులో పెసరపప్పు, రకరకాల కూరగాయలు కలపడం వల్ల రుచితో పాటు పోషకాలు కూడా రెట్టింపు అవుతాయి. సాయంత్రం వేళ టీతో పాటు స్నాక్‌ గా తీసుకోవడానికి ఇది సరైన ఎంపిక. మఖానా వెజ్ కట్ లెట్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మఖానా (తామర గింజలు): 1 కప్పు
పచ్చి పెసరపప్పు: అర కప్పు
శనగపిండి: 2 టేబుల్ స్పూన్లు
క్యారెట్ తురుము: అర కప్పు
సొరకాయ తురుము: అర కప్పు
అల్లం తురుము: 1 టీస్పూన్
పచ్చిమిర్చి: 1 టీస్పూన్
జీలకర్ర పొడి: 1 టీస్పూన్
మిరియాల పొడి: అర టీస్పూన్
గరం మసాలా: అర టీస్పూన్
నిమ్మరసం: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: కాల్చడానికి సరిపడా

తయారీ విధానం

-ముందుగా అర కప్పు పచ్చి పెసరపప్పును శుభ్రంగా కడిగి నీటిలో 3 గంటల పాటు నానబెట్టాలి.

-ఒక కప్పు మఖానాను మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలా ఉండేలా పొడి చేసుకోవాలి.

-క్యారెట్, సొరకాయను తురిమి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని సన్నగా తరగాలి.

-3 గంటలపాటు నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ జార్‌ లో వేసి కచ్చాపచ్చాగా (ముతకగా) రుబ్బుకోవాలి. నీళ్లు పోయకుండా గట్టి పేస్ట్‌ లా చేసుకోవాలి.

-ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో పెసరపప్పు పేస్ట్, మఖానా పొడి, శనగపిండి, తురిమిన క్యారెట్, సొరకాయ, అల్లం, పచ్చిమిర్చి, వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు, కొద్దిగా నిమ్మరసం పిండాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, చపాతీ పిండిలా గట్టి ముద్దలా తయారు చేసుకోవాలి. నీరు కలపవద్దు.

-చేతికి కొద్దిగా నూనె రాసుకుని, తయారు చేసుకున్న మిశ్రమాన్ని సమాన భాగాలుగా విభజించి, గుండ్రటి టిక్కీల్లా (కట్లెట్స్ లాగా) ఒత్తుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ పెట్టి ఒక టీస్పూన్ నూనె వేయాలి. పాన్ వేడయ్యాక మంటను తగ్గించి టిక్కీలను పెనంపై ఉంచాలి. వీటిని తక్కువ మంట మీద రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు, కరకరలాడేలా కాల్చుకోవాలి.

-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వేడి వేడి మఖానా కట్ లెట్ రెడీ.

-వీటిని పుదీనా చట్నీ లేదా టమాటో సాస్ ‌తో తింటే అదిరిపోతుంది.

[ of 5 - Users]
Story first published: Monday, January 26, 2026, 10:01 [IST]
Desktop Bottom Promotion