చలికి వణుకుతున్నారా? వేడి వేడి అన్నంలోకి ఈ మైసూర్ రసం తింటే స్వర్గమే

Posted By:

బయట వాతావరణం చల్లగా ఉంటే, మనసు మాత్రం వేడివేడిగా ఏదైనా తినాలని కోరుకుంటుంది. ఇలాంటి సమయంలో వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఘాటైన రసం వేసుకుని తింటే ఆ ఆనందమే వేరు. ఇది కేవలం నాలుకకు రుచిని ఇవ్వడమే కాదు, జలుబు, దగ్గు వంటి వాటికి మంచి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది.

రెగ్యులర్‌ గా చేసుకునే చింతపండు చారు లేదా టమాటా రసం తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి రొటీన్‌ కి భిన్నంగా మైసూర్ రసం ట్రై చేయండి. సాధారణ రసంతో పోలిస్తే దీని రుచి, వాసన పూర్తిగా వేరుగా ఉంటాయి. మైసూర్ రసం తయారీ విధానాన్ని ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు

కందిపప్పు- పావు కప్పు
టమోటాలు - 2
చింతపండు - పెద్ద ఉసిరికాయ సైజు
పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
వేరుశనగలు (పల్లీలు) - 2 టేబుల్ స్పూన్లు
మిరియాలు - 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు - 5
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
అల్లం ముక్క - చిన్నది
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
మెంతులు - చిటికెడు
కొత్తిమీర - గుప్పెడు
బెల్లం - చిన్న ముక్క
కరివేపాకు - 2 రెమ్మలు
పసుపు - చిటికెడు

తయారీ విధానం

-ముందుగా కందిపప్పును శుభ్రంగా కడగాలి.

-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కందిపప్పు, చిటికెడు పసుపు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించిన పప్పును బాగా మెదిపి పక్కన పెట్టుకోండి.

-టమోటాలను, చింతపండును విడివిడిగా లేదా కలిపి నీటిలో ఉడకబెట్టండి. అవి మెత్తబడ్డాక వాటి నుండి రసాన్ని పిండి, సుమారు 3 కప్పుల నీటిని సిద్ధం చేసుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్‌ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి అల్లం ముక్కలు, మిరియాలు, వేరుశెనగలు, ఎండు మిరపకాయలు, ధనియాలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి పచ్చి కొబ్బరి తురుము,జీలకర్ర కూడా వేసి బరకగా పొడి చేసుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద ఒక లోతైన గిన్నె పెట్టి అందులో చింతపండు-టమాటా రసం పోసి, అందులో రుచికి సరిపడా ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి మీడియం మంటపై మరిగించాలి. పచ్చి వాసన పోయే వరకు మరిగించాక, మెదిపి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని ఇందులో కలపాలి.

-రసం మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేయండి. ఇది పులుపు, కారాలను బ్యాలెన్స్ చేసి కమ్మని రుచిని ఇస్తుంది. మీకు ఇంకాస్త కారం కావాలంటే ఒక పచ్చిమిర్చిని చీల్చి వేసుకోవచ్చు. రసం నురగలు కక్కుతూ పైకి వస్తున్నప్పుడు స్టవ్ ఆపేయండి.

-చివరగా చిన్న పాన్‌ లో నెయ్యి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి రసంలో కలపాలి. పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే గుమగుమలాడే మైసూర్ రసం రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, December 25, 2025, 15:44 [IST]
Desktop Bottom Promotion