కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

Posted By:

వేసవి కాలం వచ్చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా ఎండలు మండిపోతున్నాయి. ఈ తీవ్రమైన వేడి, వడగాలుల వల్ల డీహైడ్రేషన్, నీరసం, అలసట వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, తక్షణ శక్తినిచ్చే చల్లని పానీయాలు తీసుకోవడం చాలా అవసరం. వేసవిలో శరీరాన్ని చల్లబరిచే డ్రింక్స్ లో ముందు వరుసలో ఉండేది లస్సీ. అందులోనూ కాశీ (వారణాశి లేదా బనారస్) వీధుల్లో దొరికే బనారసీ లస్సీ రుచే వేరు.

Authentic Banarasi Lassi Recipe in Telugu The Perfect Summer Coolant

బనారస్ లో మట్టి కుండలో వడ్డించే ఈ క్రీమీ లస్సీ.. దాని చిక్కదనానికి, కుంకుమపువ్వు సువాసనకు ఎంతో ప్రసిద్ధి. ఇది కేవలం రుచికరమైన డ్రింక్ మాత్రమే కాదు, జీర్ణక్రియను మెరుగుపరిచి, శరీర వేడిని ఇట్టే లాగేసే అద్భుతమైన ఔషధం. బనారసీ లస్సీని అదే రుచి, ఆ అనుభూతిని అందించేలా మన ఇంట్లోనే చాలా తేలికగా, తక్కువ సమయంలో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

బనారసీ లస్సీ తయారీకి కావలసిన పదార్థాలు

తాజా గడ్డ పెరుగు: 1 కప్పు
పంచదార: 2-3 టేబుల్ స్పూన్లు
ఐస్ క్యూబ్స్: 3-4 క్యూబ్స్
మలై (మీగడ) లేదా రబ్రీ: 2 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి: పావు టీస్పూన్
డ్రై ఫ్రూట్స్: బాదం, పిస్తా
కుంకుమపువ్వు: కొన్ని రేకులు
రోజ్ వాటర్: 3-4 చుక్కలు

Authentic Banarasi Lassi Recipe in Telugu The Perfect Summer Coolant

బనారసీ లస్సీ తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో తాజాగా ఉన్న చల్లటి గడ్డ పెరుగును వేయండి. కవ్వం లేదా విస్కర్ సహాయంతో పెరుగును ఉండలు లేకుండా మెత్తని క్రీమ్‌ లా మారేంత వరకు బాగా చిలకండి. బనారసీ లస్సీ నీళ్లలా కాకుండా చాలా చిక్కగా ఉండాలి. కాబట్టి ఇందులో అస్సలు నీళ్లు కలపకండి.

-చల్లటి పెరుగును నున్నగా చిలికిన తర్వాత, అందులో చక్కెర, ఐస్ క్యూబ్స్, యాలకుల పొడి వేయండి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌ లో వేసి సుమారు 1 నుంచి 2 నిమిషాల పాటు బ్లెండ్ చేయండి. ఇలా చేయడం వల్ల లస్సీ పైన అందమైన నురుగు ఏర్పడి, పానీయం మరింత క్రీమీగా మారుతుంది.

-లస్సీ తయారు చేయడం ఒక ఎత్తైతే, దాన్ని వడ్డించడం మరో ఎత్తు. బనారస్ వీధుల ఫీల్ రావాలంటే దీన్ని మట్టి గ్లాసులో వడ్డించాలి. మట్టి పాత్రలో తాగడం వల్ల ఆ పానీయానికి ఒక అద్భుతమైన మట్టి సువాసన తోడవుతుంది. సిద్ధం చేసుకున్న లస్సీని గ్లాసులో పోసి, దాని పైన మందపాటి మీగడ లేదా రబ్రీని ఒక పొరలా వేయండి.

-లస్సీ పైన సన్నగా తరిగిన బాదం, పిస్తా ముక్కలను చల్లండి. ఆపై కుంకుమపువ్వు రేకలను అలంకరించి, చివరగా మనసుకు ఆహ్లాదాన్నిచ్చేలా కొన్ని చుక్కల రోజ్ వాటర్‌ ను కలపండి.

-అంతే ఎంతో రుచికరమైన, చల్లని, చిక్కటి బనారసీ లస్సీ రెడీ. ఎండలో నుంచి రాగానే, లేదా వేసవి మధ్యాహ్నం వేళ ఈ పానీయాన్ని తాగితే.. అలసట అంతా మాయమై శరీరానికి తక్షణ శక్తి వస్తుంది.

[ of 5 - Users]
Desktop Bottom Promotion