బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..

Posted By:

బెంగళూరు వీధుల్లో దొరికే అత్యంత ప్రజాదరణ పొందిన వంటకం దొన్నె బిర్యానీ. విస్తరాకు లేదా అరటి ఆకుతో చేసిన దొన్నెలో వడ్డించే ఈ బిర్యానీ రుచి చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

నాన్వెజ్ ప్రియులకే కాదు, మష్రూమ్స్ ఇష్టపడే వారికి కూడా ఈ బెంగళూరు స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఓ అద్భుతమైన విందు. ప్రత్యేకమైన జీరక సాంబ బియ్యం సువాసనలతో, నోరూరించే మసాలాలతో ఇంట్లోనే సులభంగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Authentic Bangalore Style Mushroom Donne Biryani Recipe in Telugu

కావలసిన పదార్థాలు
జీరక సాంబ బియ్యం - 1 కప్పు
పుట్టగొడుగులు - 175 గ్రా.
పెరుగు - పావు కప్పు
కారం - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
పల్లి నూనె - అర టేబుల్ స్పూన్
లవంగాలు, దాల్చిన చెక్క - కొద్దిగా
మిరియాలు - పావు టీస్పూన్
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 5
అల్లం - చిన్న ముక్క
కొత్తిమీర, పుదీనా ఆకులు - కొద్దిగా
జీలకర్ర - అర టీస్పూన్
బిర్యానీ తయారీకి
పల్లి నూనె - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
హోల్ గరం మసాలా దినుసులు - కొద్దిగా
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
నీళ్లు - 2 కప్పులు
నెయ్యి - 1 టీస్పూన్

Chicken Kofta Recipe: రోటీ, బగారా రైస్‌లోకి అదిరిపోయే చికెన్ కోఫ్తా కర్రీ..ఈజీగా, టేస్టీగా ఇలా చేసుకోండి

తయారీ విధానం

-ముందుగా జీరక సాంబ బియ్యాన్ని శుభ్రంగా కడిగి 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి.

-ఒక గిన్నెలో పుట్టగొడుగులు తీసుకుని అందులో పెరుగు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి ముక్కలకు పట్టేలా బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టాలి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి పల్లి నూనె వేడి చేయాలి. అందులో దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. చివరగా కొత్తిమీర, పుదీనా, జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చల్లారాక మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.

-ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో నూనె వేడి చేసి గరం మసాలా దినుసులు వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి అవి రంగు మారేంతవరకు వేయించాలి. ఇప్పుడు అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న గ్రీన్ మసాలా పేస్ట్, మారినేట్ చేసిన మష్రూమ్స్ వేసి మరో రెండు నిమిషాలు బాగా వేయించాలి. ఆ తర్వాత నానబెట్టిన బియ్యం, రెండు కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించాలి.

-తర్వాత మూత తీసి ఒకసారి నెమ్మదిగా కలిపి, పైనుంచి నెయ్యి వేయాలి. మంటను పూర్తిగా తగ్గించి, గిన్నెపై మూత పెట్టి, ఆవిరి బయటకు పోకుండా దానిపై ఏదైనా బరువును ఉంచాలి. ఇలా దమ్ పద్ధతిలో 15 నిమిషాల పాటు ఉడికించాలి.

-సమయం అయ్యాక జాగ్రత్తగా మూత తీసి, అన్నం మెతుకులు విరగకుండా నెమ్మదిగా కలపాలి.

-అంతే గుమగుమలాడే వేడి వేడి మష్రూమ్ దొన్నె బిర్యానీ రెడీ. దీన్ని రైతాతో కలిపి తింటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరు.

[ of 5 - Users]
Story first published: Sunday, October 4, 2026, 10:11 [IST]
Desktop Bottom Promotion