నోట్లో నీళ్ళు ఊరించే కొబ్బరి పాల చట్నీ..టిఫిన్ ఏదైనా రుచి రెట్టింపు!

Posted By:

దక్షిణ భారతదేశంలో ప్రతి ఇంటా ఉదయం నిద్రలేవగానే వినిపించే మాట టిఫిన్ ఏం చేయాలి?. ఇడ్లీ, దోస, ఊతప్పం లేదా గారెలు.. ఇలా ఏ బ్రేక్ ఫాస్ట్ చేసినా, దాని పక్కన చట్నీ ఉండాల్సిందే. సాధారణంగా మనందరం పచ్చి కొబ్బరి, పల్లీలు లేదా పుట్నాల పప్పుతో చట్నీ చేస్తుంటాం. ఎప్పుడూ ఒకటే తిని తిని వల్ల బోర్ కొట్టిందా అయితే కొబ్బరి పాల చట్నీ ట్రై చేయాల్సిందే.

దీనిని ఒకసారి రుచి చూస్తే, మళ్లీ పాత పద్ధతిలో చట్నీ చేయడానికి ఇష్టపడరు. అంత అద్భుతంగా ఉంటుంది దీని రుచి. ఇది రుచికరమే కాదు, కొబ్బరి పాలు వాడటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొబ్బరి పాల చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
చిక్కటి కొబ్బరి పాలు - 1 కప్పు
జీడిపప్పు - పావు కప్పు
పచ్చిమిర్చి - 2
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 4
కొత్తిమీర - 1 కప్పు
జీలకర్ర పొడి - అర టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 3
కరివేపాకు - 2 రెమ్మలు
కొత్తిమీర-గార్నిష్ కోసం

తయారీ విధానం

-ముందుగా ఒక మిక్సీ గిన్నెలో కొబ్బరి పాలు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేయాలి. అంటే జీడిపప్పు, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, శుభ్రం చేసిన కొత్తిమీర, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.

-పదార్థాలన్నీ మెత్తగా పేస్ట్‌ లా అయిన తర్వాత అందులో ఒక కప్పు చిక్కటి కొబ్బరి పాలను పోయాలి. ఇప్పుడు మరోసారి బాగా గ్రైండ్ చేయాలి. కొబ్బరి పాలు, మసాలా దినుసులతో బాగా కలిసిపోయి మంచి సువాసన వస్తుంది.

-ఈ చట్నీ మరీ గట్టిగా ఉంటే బాగోదు.. కాస్త పల్చగా ఉండాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి, ఉప్పు సరిచూసుకుని మరోసారి తిప్పండి. ఇప్పుడు చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి.

-తాలింపు కోసం స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి నూనె వేడి చేయండి. నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడించండి. తర్వాత ఎండుమిర్చి, తాజా కరివేపాకు వేసి వేయించండి. కరివేపాకు క్రిస్పీగా మారిన తర్వాత స్టవ్ ఆపేయండి.

-వేడివేడి తాలింపును ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పాల చట్నీలో వేసి బాగా కలపండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి.

-అంతే ఎంతో కమ్మటి, ఆరోగ్యకరమైన కొబ్బరి పాల చట్నీ రెడీ.

-ఇడ్లీలను ప్లేట్‌ లో పెట్టుకుని, వాటి పైన ఈ చట్నీని ధారాళంగా పోయండి. చట్నీ ఇడ్లీ లోపలికి ఇంకేలా కాసేపు ఆగి, ఆ తర్వాత తిని చూడండి. అలాగే వేడి వేడి అప్పం లేదా క్రిస్పీ దోసతో కూడా ఈ చట్నీ అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, February 10, 2026, 20:30 [IST]
Desktop Bottom Promotion