అన్నం కూర ఎందుకు..ఈ ప్రొటీన్ రిచ్ ఖిచిడి తింటే బోలెడు మేలు..ఎలా చేసుకోవాలంటే

Posted By:

దాల్ కిచిడి..మనదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన, పోషకమైన వంటకం. రెసిపి ప్రాంతాన్ని బట్టి టేస్ట్ మారుతూ ఉంటుంది. అయితే దీన్ని మన తెలుగువారి స్టైల్ లో చేస్తే ఆ టేస్ట్ జన్మలో మర్చిపోరు. మన దగ్గర రెస్టారెంట్లలో లేదా హోటల్స్ లో దొరికే దాల్ ఖిచిడి వెల్లుల్లి గుబాళింపుతో అదిరిపోతుంది. ఎదురుగా పెడితే ఎవరైనా యమ్మీ యమ్మీ అని లొట్టలేసుకుంటూ తింటారు. అయితే దీనిని ఇంట్లో కూడా రెస్టారెంట్ స్టైల్ తో ఈజీగా తయారుచేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారుచేసుకునే రెసిపి ఇది. అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి బోలెడు మేలు చేస్తుంది. రెస్టారెంట్ స్టైల్ దాల్ కిచిడిని ఇంట్లోనే తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు

-పెసరపప్పు
-బియ్యం
-ఆయిల్
-నెయ్యి
-జీలకర్ర
-ఎండుమిర్చి
-పచ్చిమిర్చి
-అల్లం తరుగు
-వెల్లుల్లి తరుగు
-కారం
-పసుపు
-ధనియాల పొడి
-జీలకర్ర పొడి
-ఉప్పు
-కొత్తిమీర
-టమాటో
-ఇంగువ

Authentic Restaurant Style Healthy Dal Khichdi Recipe at Home

తయారీ విధానం

-ముందుగా అరకప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు విడివిగా కనీసం గంట సేపు నానబెట్టాలి.

-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నానిన బియ్యం, నానిన పెసరపప్పు వేసి అందులోనే కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు, 3 కప్పుల నీళ్లు, అర టీస్పూన్ నెయ్యి పోసి కుక్కర్ మూతపెట్టి మీడియం మంట మీద 4-5 విజిల్స్ రానివ్వాలి.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చెయ్యాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు చీరిన పచ్చిమిర్చి, అర టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు, అర టేబుల్ స్పూన్ అల్లం తరుగు, చిటికెడు ఇంగువ వేసి తాళింపు ఎర్రగా వేగాలి.

-ఇప్పుడు అందులో 1 ఉల్లిపాయ తరుగు వేసి అవి మెత్తబడి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించుకున్నాక అందులో 1 పెద్ద టమాటో తరుగు వేసి ముక్కలు గుజ్జుగా అయ్యేదాకా వేయించాలి.

-టమాటో ముక్కలపై స్కిన్ సపరేట్ అయ్యాక అందులో పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ధనియాల పొడి,అర టీస్పూన్ కారం, అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి వేయించాలి.

-తర్వాత అందులో ఉడికించిన అన్నం వేసి ఇందులో ముప్పావు కప్పు వేడి నీళ్లు పోసి అన్నాన్ని గరిటతో బాగా కలుపుకోవాలి. గుజ్జుగా కావాలనుకుంటే మాష్ చేయండి లేదంటే అలానే వదిలేయండి.

-ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలిపాక మరో ముప్పావు కప్పు వేడి నీళ్లు పోసి కలిపి 4-5 నిమిషాలు అది దగ్గరపడేదాకా ఉడికించాలి.

-తర్వాత స్టవ్ మీద మరో బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేశాక అందులో 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు, 2 ఎండుమిర్చి,పావు టీస్పూన్ ఇంగువ వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి అందులో రుచికి సరిపడా కశ్మీరీ కారం వేసి కలిపండి.

-ఈ తాళింపుని కిచిడీలో వేసి కలుపుకుంటే టేస్టీ దాల్ ఖిచిడీ రెడీ. దీనిని రైతాతో కలిపి తింటే అదిరిపోతుంది.

కొన్ని ప్రయోజనాలు

దాల్ ఖిచిడి చాలా తేలికైన ఆహారం, సులభంగా జీర్ణం అవుతుంది. అందుకే అనారోగ్యంగా ఉన్నప్పుడు ముఖ్యంగా కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు దీనిని సూచిస్తారు. బియ్యం, పప్పుల కలయిక జీర్ణవ్యవస్థపై భారం తగ్గించి, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు,ప్రోటీన్లు శరీరానికి నిరంతర శక్తిని అందిస్తాయి. దాల్ ఖిచిడిలో ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది, తద్వారా అతిగా తినడం తగ్గుతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి, కండరాలను పెంచుకోవాలనుకునే వారికి మంచి ఆహారం.

[ of 5 - Users]
Story first published: Tuesday, June 17, 2025, 19:08 [IST]
Desktop Bottom Promotion