ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్‌ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే..

Posted By:

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా రాత్రి డిన్నర్ లోకి ఎప్పుడూ ఒకేలాంటి ఆహారం తిని బోర్ కొట్టిందా? అయితే ఆరోగ్యానికి మేలు చేస్తూ, నోటికి ఎంతో రుచిగా ఉండే సరికొత్త వంటకం బీట్‌ రూట్ రాగి పనీర్ పరాఠా ఓ సారి ట్రై చేయండి. రాగి పిండి ఎముకలకు బలాన్నిస్తే, బీట్‌ రూట్ రక్తహీనతను దరిచేరనివ్వదు.

ఇక పనీర్ ప్రోటీన్‌ కు కేరాఫ్ అడ్రస్. ఇందులో ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. పిల్లలు కూడా దీని ఆకర్షణీయమైన రంగు, అద్భుతమైన రుచి చూసి వదలకుండా తింటారు. ఎంతో మృదువుగా ఉండే ఈ పరాఠాను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Beetroot Ragi Paneer Paratha Recipe in Telugu Iron Calcium Protein in One Dish

బీట్‌ రూట్ రాగి పనీర్ పరాఠా తయారీకి కావలసిన పదార్థాలు

రాగి పిండి - 2 కప్పులు
నీళ్లు - ఒకటిన్నర కప్పులు
బీట్‌రూట్ - 1
నెయ్యి - పిండిని కలపడానికి తగినంత
పనీర్ - 200 గ్రాములు
ఉల్లిపాయ - 1
అల్లం వెల్లుల్లి తరుగు - ఒకటిన్నర టేబుల్ స్పూన్
కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నువ్వులు - కొద్దిగా
పొడి రాగి పిండి - పరాఠాలు ఒత్తుకోవడానికి
నెయ్యి - పరాఠాలు కాల్చడానికి

వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు!

బీట్‌ రూట్ రాగి పనీర్ పరాఠా తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీటిని తీసుకుని బాగా మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టి అందులో రాగి పిండి, ముందుగా సిద్ధం చేసుకున్న బీట్‌ రూట్ ప్యూరీ వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా పిండి మొత్తం మెత్తగా కలిసేలా చూసుకోవాలి.

-ఈ మిశ్రమం పై మూతపెట్టి ఒక 2-3 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఆ తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, పిండిని చపాతీ పిండిలా బాగా ముద్దలా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా దీనిపై ఒక తడి గుడ్డను కప్పి పక్కన పెట్టుకోవాలి.

-ఒక బౌల్‌ లో తురిమిన పనీర్ తీసుకుని.. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి తరుగు, కొత్తిమీర, జీలకర్ర పొడి మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి అన్ని పదార్థాలు బాగా కలిసేలా కలుపుకోవాలి.

-ముందుగా కలిపి పెట్టుకున్న రాగి బీట్‌ రూట్ పిండి నుండి చిన్న ముద్దను తీసుకుని, చేతితో చిన్న గిన్నెలా చేసి అందులో మనం తయారు చేసుకున్న పనీర్ మిశ్రమాన్ని పెట్టి జాగ్రత్తగా మూసివేయాలి.

-పరాఠా చేసే పీట మీద కొద్దిగా నువ్వులు, పొడి రాగి పిండి చల్లుకోవాలి. ఈ స్టఫ్ చేసిన పిండి ముద్దను పెట్టి చాలా సున్నితంగా పరాఠాలా ఒత్తుకోవాలి.

-స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయాలి. నెయ్యి రాస్తూ పరాఠాను రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు, కాస్త కరకరలాడేలా కాల్చుకోవాలి.

-అంతే బీట్ ‌రూట్ రాగి పనీర్ పరాఠా రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, September 17, 2026, 19:57 [IST]
Desktop Bottom Promotion