మైదా లేకుండా ఆరోగ్యంగా..నోరూరించే రవ్వ మోమోస్ ఎలా చేసుకోవాలంటే..

Posted By:

సాయంత్ర సమయాల్లో వీధి చివర్లో లేదా రోడ్డు పక్కనో మోమోస్ బండి కనిపిస్తే మనకు నోట్లో నీళ్లూరుపోతుంటాయి. అంతలా ఈ టిబెటన్ వంటకం భారతీయుల మనసు గెలుచుకుంది. ఆవిరిపై ఉడికించే వంటకం కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, బయట దొరికే మోమోలలో వాడే మైదా పిండి, క్వాలిటీ లేని పదార్థాల పట్ల చాలామందికి ఆందోళన ఉంటుంది.

అయితే మైదాకు బదులుగా రవ్వను వాడి ఇంట్లోనే హెల్దీ మోమోస్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు. రుచితో పాటు ఆరోగ్యం కూడా అందించే హెల్దీ మోమోస్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Better Than Street Food Homemade Rava Momos Recipe You Must Try Recipe in Telugu

కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ: రెండున్నర కప్పులు
నూనె: 2 టీస్పూన్లు
ఉప్పు: చిటికెడు
స్టఫింగ్ కోసం
సోయా గ్రాన్యూల్స్ (సోయా రవ్వ): 1 కప్పు
పనీర్:250 గ్రాములు
ఉల్లిపాయ: 1
క్యాబేజీ తురుము: 1 కప్పు
క్యారెట్ తురుము: అర కప్పు
క్యాప్సికమ్: అర కప్పు
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 స్పూన్
సోయా సాస్
వెనిగర్
మిరియాల పొడి
కారం
ఉప్పు
నూనె
స్పైసీ చట్నీ కోసం
టమోటా:1
ఎండుమిర్చి: 5-6
వెల్లుల్లి రెబ్బ: 1
ఉప్పు: 1 టీస్పూన్
వెనిగర్: 1 టీస్పూన్

తయారీ విధానం

-ముందుగా బొంబాయి రవ్వను జల్లెడ పట్టి మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.

-ఆ తర్వాత ఒక గిన్నెలో గ్రైండ్ చేసిన రవ్వ పొడి, ఉప్పు, నూనె వేసి, గోరువెచ్చని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా తడి గుడ్డతో కప్పి పక్కన పెట్టండి.

-ఈలోగా చట్నీ తయారీకోసం మిక్సీ గిన్నెలో మోటా, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకుంటే స్పైసీ మోమోస్ చట్నీ రెడీ.

-ఇప్పుడు మోమోస్ లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం..ముందుగా సోయా గ్రాన్యూల్స్‌ ను వేడి నీటిలో 5 నిమిషాలు నానబెట్టి మెత్తబడ్డాక నీళ్లు గట్టిగా పిండేయాలి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి ముక్కలు వేగనిచ్చాక ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ వేసి కాసేపు వేయించాలి. ఇప్పుడు అందులో సోయా గ్రాన్యూల్స్, తురిమిన పనీర్ వేసి 5-8 నిమిషాలు వేగనివ్వాలి.

-చివరగా అందులో ఉప్పు, కారం, మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్ వేసి బాగా కలిపి స్టవ్ ఆపేసి మిశ్రమం చల్లారనివ్వాలి.

-ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పూరీల్లా పల్చగా ఒత్తుకోవాలి. అంచులు పల్చగా, మధ్యలో కాస్త మందంగా ఉండాలి. మధ్యలో సోయా-పనీర్ మిశ్రమాన్ని ఉంచి, అంచులను దగ్గరకు చేర్చి మోమోస్ ఆకారంలో మడిచి సీల్ చేయాలి.

-ఇడ్లీ కుక్కర్ లేదా స్టీమర్‌ లో నీళ్లు పోసి వేడి అయ్యాక మోమోలను ఆవిరిపై 10-15 నిమిషాలు ఉడికించాలి. అంతే వేడి వేడి ప్రోటీన్ రిచ్ మోమోస్ రెడీ. వీటిని స్పైసీ టమోటా చట్నీతో సర్వ్ చేస్తే, పిల్లల నుండి పెద్దల వరకు లొట్టలేసుకుంటూ తింటారు.

[ of 5 - Users]
Story first published: Friday, January 2, 2026, 16:02 [IST]
Desktop Bottom Promotion