చెన్నై ఫేమస్ వడ కర్రీ.. ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే కాంబినేషన్!

Posted By:

చెన్నై అనగానే చాలామంది ఫస్ట్ గుర్తుకొచ్చేది వేడివేడి ఇడ్లీలు, మెత్తటి సెట్ దోసెలు. అయితే, వీటికి పర్ఫెక్ట్ కాంబినేషన్‌ గా చెన్నై వాసులు అమితంగా ఇష్టపడే అద్భుతమైన వంటకం వడ కర్రీ. దీని రుచి చూసిన వారు ఎవరైనా సరే, మళ్లీ మళ్లీ కావాలని అడగక మానరు. చెన్నైలోని చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు ఇది ఎంతో ఫేమస్. మన ఇంట్లోనే ఉండే పదార్థాలతో చాలా సులభంగా, ఎంతో రుచికరంగా ఈ కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Chennai Special Vada Curry Recipe in Telugu Perfect Side Dish for Idli Dosa

వడ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు

వేరుశెనగలు (పల్లీలు) - 1 కప్పు
తురిమిన తాజా కొబ్బరి - అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
పెద్ద ఉల్లిపాయలు - 2
టమోటాలు - 2
పచ్చి మిరపకాయలు - 2
జీడిపప్పు - కొన్ని
పసుపు - పావు టీస్పూన్
కారం పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
గరం మసాలా పొడి - అర టీస్పూన్
సోంపు - 1 టీస్పూన్
దాల్చినచెక్క - 1 చిన్న ముక్క
లవంగం - 1
బిర్యానీ ఆకులు - 1 లేదా 2
వాము గింజలు - కొద్దిగా
నూనె - 3 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర ఆకులు - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా

Chennai Special Vada Curry Recipe in Telugu Perfect Side Dish for Idli Dosa

వడ కర్రీ తయారీ విధానం

-సాధారణంగా వడ కర్రీకి వడలను నూనెలో వేయిస్తారు. కానీ మనం ఆవిరి మీద ఉడికించి మరింత ఆరోగ్యకరంగా చేయవచ్చు. ముందుగా వేరుశెనగలను తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తగినన్ని నీళ్లు పోసి సుమారు రెండు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత నీటిని వడకట్టి, పచ్చిమిరపకాయలు జతచేసి మిక్సీ జార్‌లో మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా రుబ్బుకోవాలి.

-ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని, పళ్ళెం మీద శుభ్రమైన కాటన్ గుడ్డను పరవాలి. అందులో మనం రుబ్బి పెట్టుకున్న వేరుశెనగ ముద్దను చిన్న చిన్న వడల్లా పెట్టుకుని, 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత వాటిని బయటకు తీసి, కాస్త చల్లారాక పొడిపొడిగా చిదుముకుని పక్కన పెట్టుకోవాలి.

-స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి లేదా బాండీ పెట్టుకుని నూనె వేయాలి. నూనె కాస్త వేడెక్కాక యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, వాము గింజలు, బిర్యానీ ఆకులు వేసి సువాసన వచ్చేలా వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలపాలి. ఉల్లిపాయలు చక్కటి బంగారు గోధుమ రంగులోకి మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన టమోటా ముక్కలను జతచేసి మెత్తబడే వరకు మగ్గనివ్వాలి.

-టమోటాలు గుజ్జులా మారిన తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మసాలాల పచ్చి వాసన పోయాక, గ్రేవీకి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి.

-ఈ గ్రేవీ మరిగే లోపు.. మిక్సీ జార్‌ లో తురిమిన కొబ్బరి, జీడిపప్పు, సోంపు వేసి కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకోవాలి. గ్రేవీ బాగా మరిగుతున్నప్పుడు, ఆవిరి మీద ఉడికించి పొడి చేసుకున్న వేరుశెనగ మిశ్రమాన్ని అందులో వేయాలి. వెంటనే రుబ్బి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్‌ ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌ లో పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి.

-కూర చక్కగా ఉడికి, నూనె పైకి తేలి గ్రేవీ చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీర ఆకులను పైన చల్లుకుంటే చాలు.

-అంతే వేడివేడి, కమ్మటి వడ కర్రీ రెడీ. దీనిని ఇడ్లీలు, దోసెలు, పూరీ లేదా చపాతీలతో తింటే బాగుంటుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, July 14, 2026, 7:58 [IST]
Desktop Bottom Promotion