వంకాయ-బంగాళదుంప గుజ్జు..ఇడ్లీ,దోశలకు సరైన జోడి!

Posted By:

బ్రేక్ ఫాస్ట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఇడ్లీలు, దోశలు. అయితే ఇడ్లీ, దోశలు ఎంత బాగున్నా, అందులోకి నంజుకోవడానికి చేసుకునే చట్నీని బట్టే దాని అసలైన రుచి ఆధారపడి ఉంటుంది. రోజూ ఇంట్లో చేసుకునే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, టమాటా లేదా కారపు చట్నీలు తిని మీకు బాగా బోర్ కొట్టేసిందా? మీ నాలుక ఏదైనా కొత్త రుచిని కోరుకుంటుందా?

అయితే మీ ఇంట్లో వంకాయలు, బంగాళదుంపలు ఉంటేవాటితో క్షణాల్లో ఒక కమ్మటి చట్నీ తయారు చేసుకోవచ్చు. ఈ చట్నీ ఇడ్లీ, దోసెల్లోకి అమృతంలా ఉంటుంది. మామూలుగా రెండు ఇడ్లీలు తినేవాళ్లు కూడా, ఈ చట్నీ రుచికి ఫిదా అయిపోయి కచ్చితంగా మరో రెండు ఇడ్లీలు అదనంగా లాగించేస్తారు. నోరూరించే ఈ వంకాయ-బంగాళదుంప గుజ్జు పచ్చడి ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Mouth Watering Brinjal Potato Chutney Recipe in Telugu Perfect Side Dish for Idli Dosa

వంకాయ-బంగాళదుంప తయారీకి కావలసిన పదార్థాలు

సాంబార్ ఉల్లిపాయలు- 12
వెల్లుల్లి రెబ్బలు - 4 లేదా 5
పచ్చిమిరపకాయలు - 3
టమాటాలు - 2
బంగాళదుంప - 1 చిన్నది
వంకాయలు - 4
సోంపు - అర టీస్పూన్
కారం - పావు టీస్పూన్
పసుపు - ఒక చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - కూరగాయలు మునిగేంత వరకు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - పావు టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
పసుపు - కొద్దిగా
ఎండు మిరపకాయ - 1
కరివేపాకు - ఒక రెమ్మ
కొత్తిమీర - కొద్దిగా

వంకాయ-బంగాళదుంప గుజ్జు తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. అందులో పొట్టు తీసిన చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, తరిగిన టమాటా ముక్కలు వేయండి. ఆ వెంటనే కోసి పెట్టుకున్న బంగాళదుంప, వంకాయ ముక్కలను కూడా కుక్కర్‌ లో వేయండి.

-కూరగాయల ముక్కలు మునిగేలా తగినన్ని నీళ్లు పోయండి. అందులోనే సోంపు, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపండి. కుక్కర్ మూత పెట్టి, మీడియం మంటపై సుమారు 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.

-ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి, అందులో ఎక్కువగా ఉన్న నీటిని (స్టాక్) జాగ్రత్తగా వడకట్టి వేరొక గిన్నెలో పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు కుక్కర్‌ లో మిగిలిన కూరగాయల మిశ్రమాన్ని పప్పుగుత్తితో మెత్తటి గుజ్జులా ( కాస్త బరకగా) మెదపండి.

-తర్వాత పక్కన పెట్టుకున్న నీటిని ఈ గుజ్జులో పోసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మళ్లీ స్టవ్ మీద పెట్టి, సన్నని మంటపై ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి.

-తాలింపు కోసం ఇప్పుడు పక్కన మరో స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకుని నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, కరివేపాకు వేసి వేయించండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని, ఈ గుమగుమలాడే తాలింపును మరుగుతున్న వంకాయ గుజ్జులో వేసి బాగా కలిపేయండి. అంత ఎంతో కమ్మగా, నోరూరించే వంకాయ-బంగాళదుంప గుజ్జు రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, March 23, 2026, 10:58 [IST]
Desktop Bottom Promotion