కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే!

Posted By:

బిర్యానీ లేదా టమాటా రైస్‌కి భిన్నంగా ఏదైనా కొత్తగా, రుచికరంగా వండుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన వంటకం సిద్ధంగా ఉంది. అదే కర్ణాటకలో ఎంతో ప్రాచుర్యం పొందిన నోరూరించే తర్కారీ పులావ్(కూరగాయల పులావ్).
ఇది మన సాధారణ పులావ్ లాగా అస్సలు ఉండదు.

ఇందులో వాడే తాజా మసాలాలు, కూరగాయలు దీనికి ఒక ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. గుమగుమలాడే ఈ కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

Mouth Watering Karnataka Style Tarkari Pulao Recipe in Telugu

తర్కారీ పులావ్ తయారీకి కావాల్సిన పదార్ధాలు

మసాలా పేస్ట్ కి

కొత్తిమీర - ఒక చిన్న కట్ట
పుదీనా ఆకులు - ఒక చిన్న కట్ట
పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 6
అల్లం - అర అంగుళం ముక్క
తరిగిన ఉల్లిపాయ - పావు కప్పు
పచ్చిమిర్చి - 3
నీళ్లు - అర కప్పు

పులావ్ తయారీకి

బియ్యం - 1 కప్పు
వేరుశెనగ నూనె - 3 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకులు - 2
యాలకులు - 1
లవంగం - 1
దాల్చినచెక్క - 1 అంగుళం ముక్క
అనాస పువ్వు - 1
సన్నగా తరిగిన ఉల్లిపాయ - పావు కప్పు
తరిగిన టమాటా - 1
కరివేపాకు - 2 రెమ్మలు
పల్లీలు (వేరుశెనగ గుళ్లు) - 2 టేబుల్ స్పూన్లు
మిక్స్డ్ వెజిటేబుల్స్ (క్యారెట్, బీన్స్, బంగాళదుంప, బఠానీ) - 2 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - 2 కప్పులు

గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ!

తర్కారీ పులావ్ తయారీ విధానం

-ముందుగా ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి, కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి.

-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, కొబ్బరి తురుము, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయాలి. అరకప్పు నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.

-స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని, నూనె వేడి చేయాలి. నూనె కాగాక బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, అనాస పువ్వు వేసి దోరగా వేయించాలి.

-మసాలా దినుసులు వేగాక, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు 2-3 నిమిషాలు వేయించాలి.

-ఆ తర్వాత టమాటా ముక్కలు, కరివేపాకు, పల్లీలు వేసి టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి.

-ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి మసాలా పేస్ట్‌ ను కుక్కర్‌ లో వేసి, పచ్చివాసన పోయేలా రెండు నిమిషాల పాటు బాగా వేయించాలి.

-మసాలా వేగాక కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలన్నీ వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పు, రెండు కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. నీళ్లు మరగడం మొదలయ్యాక, నానబెట్టుకున్న బియ్యంలోని నీటిని వంపేసి కుక్కర్‌ లో వేయాలి. నీళ్లు మళ్లీ మరిగేటప్పుడు, కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద సరిగ్గా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

-అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి కర్ణాటక స్టైల్ తర్కారీ పులావ్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, September 10, 2026, 12:17 [IST]
Desktop Bottom Promotion